Share News

KTR: వందా.. వాని బొందా?

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:32 AM

వందా.. వాని బొందా..!? 100 అసెంబ్లీ సీట్లు రావాలంటే ప్రజలు ఓటెయ్యాలి. రేవంత్‌కు ఎవరు ఓటేస్తారు ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అమలు చేయనందుకు దళితులు, గిరిజనులు ఓట్లేయాలా..

KTR: వందా..  వాని బొందా?

  • తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు

  • సాధిస్తామన్న రేవంత్‌ వ్యాఖ్యలపై కేటీఆర్‌ ఎద్దేవా

  • రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రెడీ

  • 8న ప్రెస్‌క్లబ్‌కు వస్తా.. ఎమ్మెల్యేలతో కలిసి రా

  • నీ స్థాయికి నేను చాలు.. కేసీఆర్‌ అవసరం లేదు

  • మా హయాంలో పూర్తయిన నియామకాలను

  • నీవని చెప్పుకోవడానికి సిగ్గు లేదా?: కేటీఆర్‌

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ‘‘వందా.. వాని బొందా..!? 100 అసెంబ్లీ సీట్లు రావాలంటే ప్రజలు ఓటెయ్యాలి. రేవంత్‌కు ఎవరు ఓటేస్తారు? ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ అమలు చేయనందుకు దళితులు, గిరిజనులు ఓట్లేయాలా? రూ.4000 పింఛను ఇవ్వనందుకు ముసలివాళ్లు ఓట్లేయాలా? రెండు లక్షల ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరుద్యోగులు ఓట్లేయాలా? నెలకు రూ.2500 ఇవ్వనందుకు ఆడబిడ్డలు ఓటు వేయాలా? రైతు బంధు ఎగ్గొట్టినందుకు రైతులు ఓట్లు వేయాలా? చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు నీకు ఓటు వేయాలా?’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 100 అసెంబ్లీ సీట్లు సాధిస్తామన్న సీఎం రేవంత్‌ వ్యాఖ్యలను ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ హయాంలో పూర్తయిన నియామకాలకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు ఇచ్చి తానే చేసినా అని రేవంత్‌ రెడ్డి గప్పాలు కొట్టుకుంటున్నారని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో శనివారం కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ‘‘రైతులకు ఎవరెవరు ఏం చేశారో చర్చిద్దామన్న రేవంత్‌ రెడ్డి చాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. రేవంత్‌కు 72 గంటల ప్రిపరేషన్‌ టైం ఇస్తున్నా. 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌ వస్తా. నీవు కూడా నీ ఎమ్మెల్యేలతో కలిసి రా.. మీడియా ముందే చర్చిద్దాం’’ అని సవాలు విసిరారు. రేవంత్‌ స్థాయికి కేసీఆర్‌ అవసరం లేదని, తాను సరిపోతానని అన్నారు.


బనకచర్ల పేరుతో ఆంధ్రకు నీళ్లు పంపుతున్నారని, నిధులను ఢిల్లీకి పంపుతున్నారని, ఆయన తొత్తులు కొంతమందికి నియామకాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఎరువులను పంచడం కూడా చేతగాని రేవంత్‌ రెడ్డి.. కేసీఆర్‌లాంటి నాయకుడితో చర్చకు సిద్ధపడితే జనం నవ్వుతున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ తెలంగాణవ్యాప్తంగా ఎరువులు, విత్తనాల కోసం రైతులు యుద్ధమే చేయాల్సి వస్తోందని, ప్రతి మండలంలో రైతులు ఎరువులు, యూరియా కోసం ధర్నాలు చేస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే మళ్లీ పాత రోజులు తీసుకొస్తామని అన్నారని, నిజంగానే ఆ పాత దుర్దినాలను రేవంత్‌ రెడ్డి తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కరోనా సమయంలో దేశమంతా అతలాకుతలమవుతుంటే 7500 ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టి చివరి గింజ వరకు కొని రైతుల కడుపును కేసీఆర్‌ నింపారని, ఎక్కడ బోనస్‌ ఇవ్వాల్సి వస్తుందోనన్న భయంతో ఇవాళ మార్కెట్‌ యార్డులకు వచ్చిన ధాన్యాన్ని కొనకుండా పారిపోతున్నది రేవంత్‌ ప్రభుత్వమని మండిపడ్డారు. ‘‘రైతు భరోసాలో 39 వేల కోట్లు, రుణమాఫీలో రూ.38 వేల కోట్లను రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఎగ్గొట్టింది. నాట్లు వేసేటప్పుడు కేసీఆర్‌ రైతుబంధు ఇస్తే.. ఓట్లు వేసేటప్పుడు మాత్రమే రేవంత్‌ రెడ్డి రైతు భరోసా ఇస్తున్నాడు. కోటీశ్వరులను చేస్తానన్న మాటల్ని ఆడబిడ్డలు నమ్మడం లేదు. నెలకు తమకి ఇస్తామన్న రూ.2500 ఎప్పుడు ఇస్తావో చెప్పాలని నిలదీస్తున్నారు.


తమకి ఇస్తానన్న స్కూటీ ఏమైందని మా చెల్లెళ్లు ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగ భృతి ఏమైందని తమ్ముళ్లు అడుగుతున్నారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు నింపుతానన్న మాట ఎప్పుడు నిలబెట్టుకుంటావని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు చేస్తావు? ఎకరాకు 15,000 రైతు భరోసా ఎప్పుడు ఇస్తావోనని రైతులు ఎదురు చూస్తున్నారు’’ అని నిలదీశారు. ఇవాళ తెలంగాణలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, రేవంత్‌ రెడ్డి, ఆయన తొట్టి గ్యాంగ్‌ మాత్రమే సంతోషంగా ఉందని, దండుపాళ్యం ముఠాలా ఏర్పడి బిల్డర్లు, కాంట్రాక్టర్లను బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఆరోపించారు. ‘‘ఒక్క కొత్త స్కీము అమలు చేయలేదు. ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. కానీ, అప్పు మాత్రం రెండు లక్షల కోట్లకు చేరింది. ఈ పైసలన్నీ ఎక్కడికి పోతున్నాయి? రాహుల్‌ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌ ఖాతాల్లో టకీ టకీమని డబ్బులు పడుతున్నాయా?’’ అని నిలదీశారు. కాంగ్రెస్‌ బీసీ డిక్లరేషన్‌ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిదని తాము ఎప్పుడో చెప్పామని దుయ్యబట్టారు. తొమ్మిదేళ్లలో సుమారు 9 బిలియన్‌ డాలర్ల(సుమారు రూ.72 వేల కోట్లు)ను నేరుగా రైతుల ఖాతాల్లో వేశామని మొన్న ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీలో చెబితే అక్కడున్న ప్రొఫెసర్లు, మేధావులు ఆశ్చర్యపోయారని చెప్పారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 04:32 AM