Share News

KCR: మళ్లీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారు

ABN , Publish Date - Feb 18 , 2025 | 04:07 AM

చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కేసీఆర్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.

KCR: మళ్లీ కేసీఆరే రావాలని జనం కోరుకుంటున్నారు

  • ఆయన తెలంగాణ జాతికే హీరో

  • కేసీఆర్‌ జన్మదిన వేడుకల్లో కేటీఆర్‌

  • పాములపర్తిలో ప్రైవేట్‌ కార్యక్రమంలో

  • దండలు మార్చుకున్న కేసీఆర్‌ జంట

  • రాష్ట్రవ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలు

హైదరాబాద్‌, పిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కారణ జన్ముడు కేసీఆర్‌ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మళ్లీ కేసీఆరే రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఆయనకు కొడుకుగా పుట్టడం తన పూర్వజన్మ సుకృతమన్నారు. ఆయన తనకే కాక, యావత్‌ తెలంగాణ జాతికే హీరో అని కేటీఆర్‌ అన్నారు. బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ 71వ జన్మదిన వేడుకలను సోమవారం తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. ఆయన ఉద్యమ ప్రస్థానం, రాజకీయ జీవితంలోని ముఖ్యమైన అంశాలు ప్రతిబింబించేలా తలసాని ఆధ్వర్యంలో రూపొందించిన డాక్యుమెంటరీ వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు. శాసనమండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌తో కలిసి కేటీఆర్‌ భారీ కేక్‌ను కట్‌ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసం బీఆర్‌ఎస్‌ అధినేత నడుం బిగించిన రోజు ఆయనకు ఏ మద్దతూ లేదన్నారు. మీడియా, మనీ, మజిల్‌ పవర్‌ లేకుండా తెలంగాణను సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని చెప్పారు. మళ్లీ ఆయన సీఎం కావాలనే లక్ష్యంతో అందరం కలిసి పనిచేద్దామని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపునిచ్చారు.


కేసీఆర్‌ అంటే 4 కోట్ల మంది భావోద్వేగం

ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల మంది ప్రజల భావోద్వేగమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్‌కు తెలంగాణకు ఉన్న బంధం పేగు బంధమని తెలిపారు. 1969 మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్‌ వయసు 15 ఏళ్లని అప్పుడే జై తెలంగాణ అని నినదించారని చెప్పారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ లాంటి ఎంతోమంది మేధావులు ఉద్యమంలో ఆయన వెంట నడిచారన్నారు. తెలంగాణ జైత్రయాత్రనో, కేసీఆర్‌ శవయాత్రనో అంటూ ఆమరణ దీక్షకు దిగారని.. దాంతో కేంద్రం ప్రత్యేక రాష్ట్రం ప్రకటించిందని చెప్పారు. రేవంత్‌రెడ్డి తీరుతో ప్రజలు విసిగిపోయారని, మా కేసీఆరే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని హరీశ్‌ పేర్కొన్నారు. తెలంగాణను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్‌ అని మధుసూదనాచారి అన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 04:07 AM