Share News

KTR: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోంది: కేటీఆర్

ABN , Publish Date - Oct 26 , 2025 | 06:50 PM

రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు.

KTR: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోంది: కేటీఆర్
KTR

హైదరాబాద్, అక్టోబర్ 26: రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన నడుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్‌లో తెలంగాణ హోటల్స్ కార్మిక యూనియన్ నేతలతో ఆయన సమావేశం నిర్వహించారు. పలువురు హోటళ్ల కార్మిక నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. హోటల్‌లో పనిచేసే కార్మికులు బతుకుదెరువు కోసం హైదరాబాద్‌కు వచ్చారని.. బీఆర్ఎస్ హయాంలో వీరికి ఎలాంటి ఇబ్బంది కలిగించలేదని గుర్తుచేశారు.


మంత్రి ఓఎస్డీ తుపాకీతో బెదిరించారని మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లారని.. ఆ సమయంలో మంత్రి బిడ్డ బయటకు వచ్చి తుపాకీ ఇచ్చింది రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి అని చెప్పారని అన్నారు. మంత్రి భర్త తుపాకీ ఇచ్చారని పోలీసులే అంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన రౌడీ షీటర్ల పాలన అయిందన్నారు. తుపాకీ రోహిన్ రెడ్డి పెట్టారా? సుమంత్ పెట్టారా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అలీబాబా దొంగల ముఠాల పాలన తయారైందని దుయ్యబట్టారు. లిక్కర్ బాటిల్స్ స్టిక్కర్ కాంట్రాక్టు కోసం సీఎం అల్లుడు, మంత్రి కొడుకు పోటీపడ్డారని ఆరోపించారు. ఎవరికి చెప్పలేక మంచి ఐఏఎస్ రాజీనామా చేశారని తెలిపారు.


హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మలేదని.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓఆర్ఆర్ లోపల కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు రాలేదన్నారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని, హైదరాబాద్ నగరాన్ని కాంగ్రెస్ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు హామీల్లో కాంగ్రెస్ అర్రాస్ పాట పాడిందన్నారు. రేవంత్ రెడ్డి తిన్న తిట్లు దేశంలో ఏ ముఖ్యమంత్రి తినలేదన్నారు. హైడ్రాలో పేదవాళ్లకు మాత్రమే రూల్స్ ఉంటాయని.. పెద్దవాళ్లకు రూల్స్ ఉండవని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తెలంగాణకు లాభం చేసే తీర్పు ప్రజలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ రెడ్డి కుటుంబం, తమ్ముళ్లు, మంత్రులు దోచుకోవడంపై దృష్టి పెట్టారని ఆరోపించారు.


జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్ధి చరిత్ర ప్రజలకు తెలుసని చెప్పారు. రౌడీషీటర్లను, నేరచరిత్ర ఉన్నవాళ్ళను, బెదిరింపులకు పాల్పడే వాళ్ళను గెలిపిస్తారా? అని అడిగారు. కారు కావాలా? బుల్డోజర్ కావాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బుల్డోజర్ మీ ఇంటికి వస్తుందని చెప్పారు. కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఒకరిని చేయమంటే ఎట్లా? అని వ్యాఖ్యానించారు. రాబందు ప్రభుత్వం పోవాలని.. కేసీఆర్ రైతు ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని.. ఎన్నికల్లో ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనాలని అన్నారు. కేసీఆర్‌ను మరోసారి సీఎం చేసే అవకాశం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతోనే వచ్చిందని చెప్పారు.


ఇవి కూడా చదవండి:

Kishan Reddy: గోమాతను పరిరక్షించుకోవాలి: కిషన్‌రెడ్డి

Police firing incident: చాదర్‌ఘాట్‌ కాల్పుల ఘటనపై డీజీపీ కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 26 , 2025 | 09:21 PM