Share News

Kishan Reddy: గోవులను మతంతో ముడిపెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Oct 26 , 2025 | 06:48 PM

గోపరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు సబ్సిడీలు అందిస్తున్నాయని ఉద్ఘాటించారు.

Kishan Reddy: గోవులను మతంతో ముడిపెట్టడం సరికాదు: కిషన్‌రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్‌, అక్టోబరు26(ఆంధ్రజ్యోతి): గోపరిరక్షణను చాలా రాష్ట్రాలు ప్రోత్సహిస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. పలు రాష్ట్రాలు సబ్సిడీలు అందిస్తున్నాయని ఉద్ఘాటించారు. గోమాతను కొంతమంది ద్వేషిస్తారని.. ఇది ఏమాత్రం మంచిది కాదని చెప్పుకొచ్చారు. ఓ మతానికి ముడిపెట్టి గోమాతను అవమానించడం సరికాదని తెలిపారు కిషన్‌రెడ్డి.


పట్టణ వీధుల్లో గోవులు ప్లాస్టిక్ వ్యర్థాలను తింటున్నాయని.. వీటిని నివారించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. గోవుల సంఖ్య పెరుగుతోందని.. మనం వాటిని పరిరక్షించుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్‌లోని KMITలో గోసేవ తెలంగాణ విభాగం ఆధ్వర్యంలో గో విజ్ఞాన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఇవాళ(ఆదివారం) జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పాల్గొని ప్రసంగించారు.


గోవులతో సమాజానికి లాభాలు

‘ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. గ్రామీణ వాతావరణంలో పెరిగిన నాకు గోమాతపై ప్రత్యేకమైన గౌరవం, వాటి రక్షణపై అవగాహన ఉంది. అలాగే, గోవులతో సమాజానికి చేకూరే అపారమైన లాభాలు నాకు పూర్తిగా తెలుసు. పచ్చిక బయళ్లలో గోవులు స్వేచ్ఛగా తిరుగుతుంటే కలిగే ఆనందమే వేరు. ఆ దృశ్యం చూసి తరించిన వారికే ఆ అనుభూతి తెలుస్తోంది. గోవుల గొప్పతనం గురించి మన వేదాలు చెబుతూనే ఉన్నాయి. 'గావో విశ్వస్య మాతర:' అంటే 'ఆవులు విశ్వానికే తల్లి' అని అర్థం. ఈ సూక్తిని మనం నిజం చేసుకోవాల్సిన అవసరం ఉంది. గోవులు కేవలం పాలను మాత్రమే కాకుండా, వాటి శ్వాస, ఉచ్ఛ్వాసల మధ్య గడిపే సమయం మనిషిలోని సగం ఆరోగ్య సమస్యలను పరిష్కరిస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు’ అని కిషన్‌రెడ్డి వెల్లడించారు.


గోవుల స్వేచ్ఛకు ఇబ్బంది..

‘ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో ప్రధాని మోదీ బిజీగా ఉంటారు. అయితే ప్రధాని తన నివాసంలో గోవులను పెంచుకుంటూ, వాటితో గడిపే సమయంతో మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలను దూరం చేసుకుంటున్నాన నాకు చెప్పారు. ఇది గోవుల ప్రాముఖ్యతకు ఒక మంచి ఉదాహరణ. దురదృష్టవశాత్తూ, వ్యవసాయ క్షేత్రాలు, భూకమతాలు తగ్గిపోవడంతో గోవుల స్వేచ్ఛకు ఇబ్బందులు వస్తున్నాయి. ఒకప్పుడు పచ్చిక బయళ్లలో గోవులు స్వేచ్ఛగా తిరిగేవి. ఇప్పుడు ఇరుకు స్థలంలో కట్టేస్తున్నారు. గోశాలల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. వాటికి కావాల్సినంత స్వేచ్ఛ, ఆనందం లేకుండా పోయింది’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.


గోవుల నెయ్యిని ఉపయోగిస్తా..

‘గోవుల రక్షణ కేవలం గో పరిరక్షకుల బాధ్యత మాత్రమే కాదని.. సమాజం మొత్తం ఆ బాధ్యత తీసుకోవాలి. గోవుల ఉత్పత్తుల ప్రాధాన్యత గురించి చాలామందికి తెలియదు. నేను స్వయంగా గోవుల నెయ్యిని ఉపయోగిస్తాను. ఆశ్చర్యకరంగా, సౌదీ అరేబియా లాంటి దేశాలు కూడా మన గోవుల ఉత్పత్తులను వాడుతున్నాయి. అంతేకాకుండా, గోవుల వ్యర్థాలతో వ్యవసాయం చేయడం ద్వారా భూమి సారాన్ని పెంచుతున్నాయి. ఈ రోజు గో సేవ విభాగ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అద్భుతమైన కార్యక్రమంలో, తల్లిదండ్రులను, వారి పిల్లలను భాగస్వామ్యం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాను. ఇది రాబోయే తరాలకు గో సంరక్షణ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. మన గోమాతకు ఇంతటి ప్రాధాన్యత ఉందని.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాటిని రక్షించుకోవాలి’ అని కిషన్‌రెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీఆర్ఎస్ ఏకపక్షంగా నన్ను బయటకు పంపింది.. కవిత ఎమోషనల్

మెట్రో‌ఫేస్-2ని అడ్డుకుంటుంది కిషన్‌రెడ్డినే.. మహేష్ గౌడ్ షాకింగ్ కామెంట్స్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 26 , 2025 | 07:08 PM