Share News

KTR Phone Tapping: మంత్రుల ఫోన్లను ట్యాప్‌ చేయిస్తున్నారు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:59 AM

తన సీటుకు ఎవరు, ఎలా ఎసరుపెడతారోనని చెప్పి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌ల ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాపింగ్‌ చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR Phone Tapping: మంత్రుల ఫోన్లను ట్యాప్‌ చేయిస్తున్నారు

  • భట్టి, పొంగులేటి, ఉత్తమ్‌ తన సీటుకు ఎసరుపెడతారని సీఎం రేవంత్‌ భావిస్తున్నారు

  • మా ఫోన్లు సహా వేలాది ఫోన్లు ట్యాప్‌ అవుతున్నాయి

  • దమ్ముంటే లైడిటెక్టర్‌ పరీక్షలకు రావాలి

  • నేను లోకేశ్‌ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి?: కేటీఆర్‌

  • హౌలే, నికృష్టుడు, పెంటపురుగు, ఏం పీకావ్‌, మగాడివైతే రా.. అంటూ సీఎంపై పరుష పదజాలం

  • తెలంగాణలో చిల్లర పోలీసింగ్‌ నడుస్తోంది!

  • ఒక్కొక్కడిని ఏం చేయాలో రాసిపెడ్తున్నం: కేటీఆర్‌

ఖమ్మం/హైదరాబాద్‌ సిటీ/మల్కాజ్‌గిరి, జూలై 18 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తన సీటుకు ఎవరు, ఎలా ఎసరుపెడతారోనని చెప్పి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌ల ఫోన్లను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్యాపింగ్‌ చేయిస్తున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రాష్ట్రంలో తమ ఫోన్లు సహా వేలాది ఫోన్లను ట్యాపింగ్‌ చేస్తున్నారని.. దీనిపై లైడిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? మగాడివైతే రా అని సీఎం రేవంత్‌కు సవాల్‌ విసిరారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి ‘హౌలే, నికృష్టుడు, పెంటపురుగు, ఏం పీకావ్‌, పిచ్చివాగుడు..’ అంటూ పరుష పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం రేవంత్‌రెడ్డి చిట్‌చాట్‌ల పేరుతో రోత డైలాగులు చెప్పడంలో, బూతులు మాట్లాడటంలో ప్రసిద్ధుడని వ్యాఖ్యానించారు. శుక్రవారం ఖమ్మంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడారు. ‘‘రేవంత్‌రెడ్డి లాంటి నీచపు సీఎంను ఎప్పుడూ చూడలేదు. చిట్‌చాట్‌ల పేరుతో తప్పుడు లీకులు, సోషల్‌ మీడియాలో తప్పుడు తంబ్‌నెయిల్‌లు, అబద్ధపు, డైవర్షన్‌ రాజకీయాలతో 18 నెలల పాలన సాగించిన ఘనుడు. రేవంత్‌రెడ్డి నోటి నుంచి ఫోన్‌ ట్యాపింగ్‌, ఫార్ములా-ఈ, కాళేశ్వరం, కేసీఆర్‌.. ఇలా నికృష్టపు మాటలు తప్ప మరేమీ రావు. ఆ మాటలు, స్పీచ్‌లను చూసి ప్రజలు మోసపోవద్దు. డ్రగ్స్‌ మనుషుల ప్రాణాలు ఎలా తీస్తాయో.. రేవంత్‌రెడ్డి మాటలు రాష్ట్ర ప్రజల ప్రశాంతతను, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. చిల్లర గాసిప్‌ వెబ్‌సైట్లు, యూట్యూబ్‌ చానల్స్‌కే తప్ప ప్రజలకు రేవంత్‌రెడ్డితో దమ్మిడీ లాభం లేదు’’ అని వ్యాఖ్యానించారు. కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, చంద్రబాబు, రోశయ్య వంటివారు సీఎం పదవికి హుందాతనం తెచ్చారని, కానీ రేవంత్‌ నికృష్ట పాలన చేస్తున్నారని విమర్శించారు.


చర్చిద్దాం.. ఎక్కడికైనా వస్తాం..

అధికారం ఉందని ఇష్టమొచ్చినట్టు కేసులు పెట్టారని, కానీ లీకులివ్వడం తప్ప పీకేదేమీ లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ‘‘అధికారికంగా ఏమీ చెప్పకుండా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. గ్రాఫిక్స్‌తో నాన్సెన్స్‌ సృష్టిస్తున్నారు. కిట్టీపార్టీ ఆంటీలా గాసిప్స్‌ సృష్టిస్తున్నారు. నీ మీద ఏసీబీ కేసుంది.. నామీదా ఏసీబీ కేసుంది. దమ్ముంటే చర్చిద్దాం రా.. ఎక్కడపెడతావో పెట్టు చర్చ. అసెంబ్లీలో పెడితే మైక్‌ కట్‌ చేయకుండా చూడు. జూబ్లీహిల్స్‌ ప్యాలె్‌సకా, కొండగల్‌ కోటకా.. ఎక్కడికైనా వస్తాం’’ అని సవాల్‌ చేశారు.


లోకేశ్‌ను కలవలేదు.. కలిస్తే తప్పేంటి?

‘‘నేను ఆంధ్రప్రదేశ్‌ మంత్రి లోకేశ్‌ను కలిశానని రేవంత్‌రెడ్డి చెబుతున్నారు. నేను కలవలేదు. అయినా కలిస్తే తప్పేంటి? బాజాప్తాగా కలుస్తా. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. పక్క రాష్ట్ర మంత్రి, నా తమ్ముడి లాంటివాడు. ఇద్దరం ఫ్రెండ్లీగా ఉంటాం’’ అని కేటీఆర్‌ చెప్పారు. గోదావరి జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను ఆంధ్రాకు, చంద్రబాబుకు తాకట్టు పెట్టారని.. కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో సగం మంత్రి పొంగులేటికి ధారదత్తం చేశారని ఆరోపించారు. 50సార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌ రాష్ట్రానికి 50పైసలు కూడా తేలేదని.. ఢిల్లీలో చీకట్లో మోదీ, అమిత్‌ షా కాళ్లు పట్టుకోవడం తప్ప ఏమీ చేయలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్‌ఎ్‌సకు వందసీట్లు వస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకోసం కార్యకర్తలు, నాయకులు సిద్ధం కావాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌, సత్యవతి రాథోడ్‌, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కొండబాల కోటేశ్వరరావు, తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


ఒక్కొక్కరిని ఏం చేయాలో రాసిపెడ్తున్నం

కాంగ్రెస్‌ గూండాల చేతిలో దాడులకు గురైన బీఆర్‌ఎస్‌ లీడర్లపై ఉల్టా కేసులు పెట్టి వేధించే చిల్లర పోలీసింగ్‌ తెలంగాణలో నడుస్తోందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల బోనాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్‌ కార్యకర్తల దాడిలో గాయపడ్డ హైరాబాద్‌లోని గౌతంనగర్‌ కార్పొరేటర్‌ సునీత భర్త రాముయాదవ్‌ను కేటీఆర్‌ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ‘‘చంపేస్తా అని మాజీ మంత్రిని ఒక మాజీ ఎమ్మెల్యే హెచ్చరిస్తే కేసు కాదా? ఇదొక రాష్ట్రం, ఇదో పోలీస్‌ వ్యవస్థనా? సన్నాసులు, పిరికిపందలు ఈ పోలీసులు! ఒక్కొక్కడి పేరు రాసుకొండి. ఏసీపీలు, డీసీపీలు, సీఐలు, ఎస్సైలు ఎవడెవడైతే బాగా ఎగురుతడో..! నేను ప్రామిస్‌ చేస్తున్నా. నెక్ట్స్‌ టైం కేసీఆర్‌ చెప్పినా నేను వినను. ఎందుకంటే నేనైతే మంచోడిని కాదు. మళ్లీ మా టైం వస్తది. బానిసల్లా పనిచేస్తున్న అధికారులకు చెబుతున్నా.. మా ప్రభుత్వం వచ్చినంక మిమ్మల్ని ఒక్కొక్కర్ని ఏం చేయాలో రాసి పెడ్తున్నం. చేసి చూపెడతాం’’ అని పోలీసులను హెచ్చరించారు. హైదరాబాద్‌లో ఒక్క సీటు రాలేదన్న కోపంతో ఇక్కడి ప్రజలపై కాంగ్రెస్‌ ప్రభు త్వం పగబట్టిందని.. రౌడీయిజం, గుండాగిరితో శాంతియుత వాతావరణం చెడగొట్టాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. మల్కాజిగిరిలో పిచ్చి కుక్కలు ఎక్కువయ్యాయని, ఎవరైనా మల్కాజిగిరి చౌరస్తాకు గుండాలతో వచ్చి గంటసేపు ట్రాఫిక్‌ జామ్‌ చేసి చిల్లర రాజకీయం చేస్తారా అని మండి పడ్డారు. కాంగ్రెస్‌లోకి రాలేదన్న అసహనంతోనే ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిపై దాడి చేస్తున్నారని ఆరోపించారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:59 AM