నీటి కేటాయింపులపై విచారణ
ABN , Publish Date - Jan 17 , 2025 | 03:58 AM
అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం జారీ చేసిన విచారణ విధి విధానాల ప్రకారం రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపైనే తొలుత వాదనలు వింటామని కృష్ణా ట్రైబ్యునల్-2(జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్) స్పష్టం చేసింది.

రాష్ట్రాల వారీగా తొలుత సెక్షన్-3 కింద వాదన
ఆ తర్వాతే విభజన చట్టం
సెక్షన్-89 కింద విచారణ
కృష్ణా ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు
ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్‌పై విచారణ
ఫిబ్రవరి 19 నుంచి వాదనలు
తెలంగాణ వాదనలవైపే మొగ్గు అనుకూల పరిణామం: ఉత్తమ్
హైదరాబాద్/న్యూఢిల్లీ, జనవరి 16(ఆంధ్ర జ్యోతి): అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం-1956లోని సెక్షన్-3 ప్రకారం జారీ చేసిన విచారణ విధి విధానాల ప్రకారం రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపైనే తొలుత వాదనలు వింటామని కృష్ణా ట్రైబ్యునల్-2(జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్) స్పష్టం చేసింది. ఆ తర్వాతే రాష్ట్ర పునర్విభజన చట్టంలోని సెక్షన్- 89 కింద విచారణ నిర్వహిస్తామని పేర్కొంది. తెలంగాణ దాఖలు చేసిన ఇంటర్‌లోక్యూటరీ అప్లికేషన్(ఐఏ)పై గురువారం ఢిల్లీలో విచారణ చేపట్టిన ట్రైబ్యునల్.. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్-3 కిందే తొలుత విచారణ జరపాలని కొన్నేళ్లుగా తెలంగాణ పట్టుబడుతుండగా, తాజా నిర్ణయంతో రాష్ట్ర వాదన నెరవేరినట్టు అయింది. ఈ అంశంపై ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 21వ తేదీ దాకా వాదనలు ట్రైబ్యునల్ ముందు జరగనున్నాయి. గురువారం కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు మంత్రి ఉత్తమ్ హాజరయ్యారు. గత 11 ఏళ్లలో తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ మంత్రి హాజరు కావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
సెక్షన్-3, సెక్షన్-89 చెబుతున్నదేంటి?
తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89కింద ప్రాజెక్టుల వారీగా కృష్ణా జలాల కేటాయింపులపై విచారణ జరపాలని జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ కోరుతూ కేంద్రం విధివిధానాలు జారీ చేసింది. గతంలో రాష్ట్రాల్లోని ‘ప్రాజెక్టుల వారీ’గా నిర్దిష్ట కేటాయింపులు జరిగి ఉండకపోతే, ఇప్పుడు జరపాలని సూచించింది. నీటి లభ్యత లేని సమయాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి విడుదల విషయంలో అమలు చేయాల్సిన ఆపరేషన్స్ ప్రొటోకాల్స్‌ను సిద్ధం చేయాలని పేర్కొంది. అయితే, ఈ పరిధిలోకి ఏయే ప్రాజెక్టులొస్తాయన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై తెలంగాణ పలు మార్లు అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం-1956లోని సెక్షన్-3 కింద రాష్ట్రాలవారీగా కృష్ణా జలాలు కేటాయించిన తర్వాతే, ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని పట్టుబట్టింది. ఎట్టకేలకు దీనిపై స్పందించిన కేంద్రం కృష్ణా ట్రైబ్యునల్-2కు అదనపు రెఫరెన్స్(మరిన్ని విధివిధానాలను)జారీ చేస్తూ 2023 అక్టోబరు 6న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సెక్షన్ 89(ఏ), 89(బీ)లోని ‘ప్రాజెక్టుల వారీగా’ అనే పదానికి విస్తృత అర్థాన్ని ఇచ్చింది. ఈ మేరకు తాజాగా కృష్ణా ట్రైబ్యునల్-2 దీనిపై నిర్ణయం తీసుకుంది. తొలి, తదుపరి విధివిధానాల్లో చాలా అంశాలు ఒకేరకంగా ఉన్నాయని, రెండింటినీ కలిపి విచారిస్తే సుప్రీంలో ఏపీ వాదన నెగ్గితే సమస్య తలెత్తుతుందని ట్రైబ్యునల్ అభిప్రాయపడింది. అందువల్ల నదీజలాల పంపిణీకి సంబంధించిన ప్రశ్నను పరిశీలించే తదుపరి విధి విధానాలను విచారించడమే సవ్యంగా ఉంటుందని చైర్మన్ బ్రజేశ్ కుమార్, సభ్యులు జస్టిస్ తలపాత్ర, జస్టిస్ రామ్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
తెలంగాణ వాదనలవైపే బ్రిజేశ్ ట్రైబ్యునల్ మొగ్గు అత్యంత సానుకూల పరిణామం: ఉత్తమ్
తెలంగాణ ఫిర్యాదుల ఆధారంగా కేంద్రం నివేదించిన తదుపరి విధి విధానాల విచారణను ముందుగా విచారించాలని బ్రిజేశ్ కుమార్ ట్రైబ్యునల్ నిర్ణయించిందని రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు సంబంధించి ఇది అత్యంత సానుకూల పరిణామంగా ఆయన అభివర్ణించారు. ఫిబ్రవరి 19 నుంచి 21 వరకు బ్రజేశ్ కుమార్ ట్రైబ్యునల్ తుది విచారణలో భాగంగా వాదనలను వినడం ప్రారంభిస్తుందని, తొలుత తెలంగాణయే తన వాదనలను వినిపిస్తుందని ఆయన చెప్పారు. ఈ ట్రైబ్యునల్‌కు సెక్షన్-3 ఆధారంగా తదుపరి విధి విధానాలను నివేదించడంతో విచారణ చేపట్టిందని, సెక్షన్-3 నివేదిక చెల్లుబాటు కాదని సుప్రీంలో ఏపీ రిట్ పిటిషన్ వేసినప్పటికీ సుప్రీం ఎలాంటి స్టే ఇవ్వలేదని, తదనుగుణంగా ట్రైబ్యునల్ తన విచారణ కొనసాగించాలని సూచించిందని తెలంగాణ నీటిపారుదల మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిజేశ్‌కుమార్ ట్రైబ్యునల్ ముందు తుది విచారణ ప్రారంభం కానున్న సమయంలో తెలంగాణ వాదనలను వినడం సానుకూల పరిణామంగా తెలంగాణ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.