Kova Lakshmi: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంలో ఊరట
ABN , Publish Date - Aug 15 , 2025 | 03:44 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఆమె ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ/ఆసిఫాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆజ్మీరా శ్యాం నాయక్.. కోవా లక్ష్మి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే, లక్ష్మి ఎలక్షన్ కమిషన్‌కు అందజేసిన అఫిడవిట్‌లో ఆదాయ పన్ను వివరాలను దాచిపెట్టి తప్పుడు సమాచారాన్ని అందించారని, ఆమె ఎన్నిక చెల్లదని ఆరోపిస్తూ గతేడాది జనవరిలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన హైకోర్టు కోవా లక్ష్మికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ నవంబర్ 21న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ ఎన్. కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం.. ఎమ్మెల్యే వాదనలతో ఏకీభవించింది. ఆదాయపు పన్ను రిటర్స్న్‌లో నాలుగు ఆర్థిక సంవత్సరాల ఆదాయాన్ని వెల్లడించకపోవడం పెద్ద లోపం కాదని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేయలేమంటూ పేర్కొంది. సుప్రీం తీర్పుపై ఎమ్మెల్యే కోవా లక్ష్మి స్పందించారు. తనకు అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయం జరిగిందని తెలిపారు.
టెస్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు
హైదరాబాద్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు(పీఏసీఎస్), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు(డీసీసీబీ), తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) పాలకవర్గాల పదవీ కాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు. సహకార చట్టంలోని 32(7)(ఏ) సెక్షన్ ప్రకారం.. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం కొత్త ఆదేశాలు వచ్చేవరకు కొనసాగుతుంది. పనితీరు సరిగా లేకపోయినా, సొసైటీల్లో అవినీతి, ఆరోపణలు వచ్చినా విచారణ జరిపించి చర్యలు తీసుకునే అధికారం సహకారశాఖ రిజిస్ట్రార్‌కు కల్పించారు. రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. పాత తొమ్మిది జిల్లాలకు డీసీసీబీలు, రాష్ట్రస్థాయిలో టెస్కాబ్ ఉన్నాయి. వీటిన్నింటి పాలకవర్గాల పదవీకాలాన్ని రాష్ట్ర ప్రభుత్వం పొడిగించటం విశేషం. సహకార సంఘాలు, సహకార బ్యాంకుల పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో ఆయా పాలకవర్గాల కోసం తక్షణమే ఎన్నికలు జరపటం సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం పొడిగింపు ఉత్తర్వులను జారీచేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ