Komatireddy Rajagopal Reddy: అవసరమైతే మళ్లీ రాజీనామా!
ABN , Publish Date - Aug 06 , 2025 | 03:36 AM
మంత్రి పదవికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేసేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు.
మునుగోడు ప్రజల కోసం ఏ త్యాగమైనా చేస్తా
గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చింది
పదవులు, పైసలు ముఖ్యమంత్రే తీసుకుపోతున్నారు
మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారు.. ఇక వారి ఇష్టం
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు
సంస్థాన్ నారాయణపురం, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): మంత్రి పదవికి సంబంధించి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి మళ్లీ రాజీనామా చేసేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చారు. గతంలో రాజీనామా చేస్తే ప్రభుత్వమే మునుగోడు ప్రజల వద్దకు దిగివచ్చిందన్నారు. మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పెద్దలు తనకు హామీ ఇచ్చారని, ఇస్తారో లేదో ఇక వారి ఇష్టమేనని వ్యాఖ్యానించారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం వద్ద విద్యుత్ సబ్‌స్టేషన్‌కు రాజగోపాల్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘నాకు కావాల్సింది మునుగోడు నియోజకవర్గ ప్రజలు.. వారి బాగోగులే. నాకు మంచి జరిగితే వాళ్లకు మంచి జరుగుతుంది. వాళ్ల అభివృద్ధి, సంక్షేమం కోసం ఎంతదూరమైనా వెళతా.. ఏ త్యాగమైనా చేస్తా. పోయినసారి నేను రాజీనామా చేస్తే బీఆర్‌ఎస్ ప్రభుత్వం, 100మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్లవద్దకు రాలే దా? మళ్లీ అంతదూరమైనా వెళతా’’ అని అన్నారు. తాను ఏదైనా మాట్లాడితే మంత్రి పదవి రాలేదు కాబట్టి మాట్లాడుతున్నా అంటున్నారని తప్పుబట్టారు. మంత్రి పదవే కావాలనుకుంటే ఎల్బీనగర్‌లో పోటీచేస్తే వచ్చేదని, కానీ.. తనకు మునుగోడు ప్రజలు, ఈ ప్రాంత అభివృద్ధి ముఖ్యమని, అందుకే ఇక్కడే పోటీ చేశానని చెప్పారు. తనను ఎవరైనా ‘మంత్రి పదవి కావాలా? మునుగోడు ప్రజలు కావాలా?’ అని అడిగితే మునుగోడు ప్రజలు, వారి అభివృద్ధినే కోరుకుంటానని స్పష్టం చేశారు.
పెద్ద పదవి వస్తే ప్రజలకే ఉపయోగం..
తాను పదవుల కోసం పాకులాడే వాడిని కాదని రాజగోపాల్‌రెడ్డి అన్నారు. అదృష్టం ఉండి ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుందన్నారు. అంతే తప్ప పెద్ద పెద్ద పదవులు అడ్డం పెట్టుకుని పైరవీలు చేసుకొని వేల కోట్లు దోచుకునే వాడిని కాదన్నారు. ప్రజల కోసమే పార్టీ మారి కాంగ్రె్‌సలోకి వచ్చానని తెలిపారు. మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని, పదవి ఇస్తారో .. ఇవ్వరో వారి ఇష్టమన్నారు. తాను కూడా సీనియర్‌ను, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాడినని అన్నారు. తన కన్నా జూనియర్లకు, నిన్న మొన్న పార్టీ మారి వచ్చినవాళ్లకు పదవులు ఇచ్చారని గుర్తు చేశారు. పార్టీలోకి రమ్మంటే నమ్ముకుని వచ్చామని, ఎంపీని గెలిపించమంటే గెలిపించామని, తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. పదవులు, పైసలు ఆయనే (సీఎం రేవంత్‌రెడ్డి) తీసుకుపోతున్నారని, పదవులు లేకున్నా కనీసం పైసలన్నా మునుగోడు నియోజకవర్గానికి రావాలి కదా! అని రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొడంగల్ నియోజకవర్గానికి రూ.5 వేల కోట్ల నిధులు తీసుకుపోయినప్పటి నుంచి తనకు నిద్రపట్టడం లేదన్నారు. మునుగోడు అభివృద్ధి రాజీ పడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి
పార్లమెంట్ ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన
కేసీఆర్ ఇచ్చిన టాస్క్‌ను పూర్తి చేశా.. గువ్వాల బాలరాజు షాకింగ్ కామెంట్స్
Read latest Telangana News And Telugu News