Share News

Komatireddy Venkat Reddy: కవితను చూసి ఆ ముగ్గురు నేర్చుకోవాలి

ABN , Publish Date - Feb 17 , 2025 | 04:03 AM

కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు.

Komatireddy Venkat Reddy: కవితను చూసి ఆ ముగ్గురు నేర్చుకోవాలి

  • కులగణనపై కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌లది రాద్ధాంతం

  • రెండేళ్లలో శ్రీశైలం సొరంగ మార్గం పనులు పూర్తి

  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్లగొండ టౌన్‌, ఫిబ్రవరి 16 (ఆంధ్రజ్యోతి): కులగణనపై రాద్ధాంతం చేస్తున్న కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు ఎమ్మెల్సీ కవితను చూసి నేర్చుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆ ముగ్గురూ కులగణనలో పాల్గొనలేదని, కవిత ఒక్కరే పాల్గొన్నారని చెప్పారు. ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కులగణన సర్వేలో రాష్ట్రంలో 97ు పాల్గొన్నారని తెలిపారు. ప్రజలందరి కోరిక మేరకు మిగిలిన 3శాతం మంది కోసం మళ్లీ సర్వే చేస్తామన్నారు. హైదరాబాద్‌ చుట్టూ నిర్మిస్తున్న రీజనల్‌ రింగ్‌ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌)తో తెలంగాణ రాష్ట్ర ప్రగతి మరో మెట్టు ఎక్కుతుందని పేర్కొన్నారు.


ఆర్‌ఆర్‌ఆర్‌ పనులను త్వరలోనే పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. రీజనల్‌ రింగ్‌ రోడ్డు, ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు నడుమ నిర్మిస్తున్న రేడియల్‌ రోడ్లతో తెలంగాణ రూపురేఖలు మారడంతో పాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్యకు పూర్తి పరిష్కారం లభిస్తుందన్నారు. దశాబ్దాలుగా నల్లగొండ జిల్లాలో నెలకొన్న సాగు, తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు శ్రీశైలం టన్నెల్‌ బేరింగ్‌ మిషన్‌ పనులను ప్రారంభించామన్నారు. రెండేళ్లలో శ్రీశైలం సొరంగ మార్గం పనులను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Updated Date - Feb 17 , 2025 | 04:03 AM