Share News

Kishan Reddy: కేటీఆర్‌ను మద్దతు ఎవరడిగారు?

ABN , Publish Date - Aug 22 , 2025 | 03:58 AM

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఎవరడిగారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.

Kishan Reddy: కేటీఆర్‌ను మద్దతు ఎవరడిగారు?

  • ఆయన మద్దతు మాకు అవసరం లేదు

  • కేంద్రంలో ఉన్నాడా? రాష్ట్రంలో ఉన్నాడా?

  • చిన్నపిల్లల ఆటలా వ్యవహరించవద్దు

  • రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా?

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్‌రెడ్డి

  • దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులున్నాయి.. సహకరించాలి

  • రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియా స్టాక్‌ పెట్టాం.. అదేమైందో తెలియదని వ్యాఖ్య

  • జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

  • వెంట వచ్చిన సోనియా, రాహల్‌, పవార్‌

  • ఎన్డీఏ అభ్యర్థికే మద్దతు: వైసీపీ నేత బొత్స

న్యూఢిల్లీ, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి): ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ను ఎవరడిగారని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తమకు కేటీఆర్‌ మద్దతు అవసరం లేదని వ్యాఖ్యానించారు. రైతుల పట్ల కేటీఆర్‌కే ప్రేమ ఉన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. గురువారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి యూరియా తెచ్చిన పార్టీ అభ్యర్థికే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతిస్తుందన్న కేటీఆర్‌ వ్యాఖ్యలను ప్రస్తావించగా.. ‘‘మాకు కేటీఆర్‌ మద్దతు అవసరం లేదు. అసలు కేటీఆర్‌ను ఎవరు అడిగారు? రైతుల పట్ల కేటీఆర్‌కే ప్రేమంతా ఉన్నట్టు మాట్లాడితే ఏట్లా? ఆయనకు ఏం ఉంది? కేంద్రంలో ఉన్నాడా? రాష్ట్రంలో ఉన్నాడా? ఆయనకేంది ఉలుకుపలుకు?’’ అని కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో అన్ని పార్టీల తరహాలోనే బీఆర్‌ఎస్‌ మద్దతు కోరుతామని.. కానీ యూరియా ఇస్తే మద్దతిస్తామంటూ చిన్న పిల్లల ఆటలా కేటీఆర్‌ తీరు ఉందని వ్యాఖ్యానించారు. యూరియా దిగుమతుల విషయంలో అంతర్జాతీయంగా కాస్త ఇబ్బందులు ఉన్నాయని, అయినా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నామని కిషన్‌రెడ్డి చెప్పారు. అందరూ సహకరించాలని కోరారు.


కాంగ్రెస్‌ హయాంలో దేశంలోని యూరియా కంపెనీలను మూసేశారని, తాము వాటిని తెరిపించి ఉత్పత్తి చేపడుతున్నామని చెప్పారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం వద్ద యూరియా స్టాక్‌ పెట్టామని, అదేమైందో తెలియదని వ్యాఖ్యానించారు. తెలంగాణ మంత్రులు రోజూ యూరియా లేదంటూ మాట్లాడుతుండటంతో.. కొందరు దొరికిన చోటల్లా నిల్వ చేసుకోవడంతో కృత్రిమ కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. రైతుల్లో ఆందోళన రేకెత్తించడం సరికాదని పేర్కొన్నారు. యూరియా దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలన్నారు. రాష్ట్రానికి వివిధ మార్గాల్లో 50వేల టన్నుల యూరియా రవాణా అవుతోందని చెప్పారు. అరెస్టయి జైల్లో ఉన్న పీఎం, సీఎం, మంత్రులను పదవీచ్యుతులను చేసే బిల్లులపై కాంగ్రెస్‌ వ్యవహరించిన తీరు దారుణమని పేర్కొన్నారు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు కాంగ్రెస్‌ తీరు ఉందని విమర్శించారు. ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఆరు నెలలు జైల్లో ఉండి సీఎంగా కొనసాగారాని, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా?అని ప్రశ్నించారు. దొంగ ఓట్లతో అధికారంలోకి రావాలనుకునే వారికి ఇలాంటి చట్టాలు రుచించవని ఆరోపించారు. గతంలో ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా వెంకయ్యను నిలిపితే కాంగ్రెస్‌ పోటీగా అభ్యర్థిని నిలబెట్టిందని, అప్పుడు తెలుగు గౌరవం గుర్తురాలేదా? అని రేవంత్‌ను ప్రశ్నించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్

టీటీడీపై వైసీపీ బురద జల్లుతోంది.. జ్యోతుల నెహ్రూ ధ్వజం

Read Latest AP News and National News

Updated Date - Aug 22 , 2025 | 03:58 AM