NHAI: ఆర్‌ఆర్‌ఆర్‌పై డంబెల్స్ ఆకృతిలో..
ABN , Publish Date - Jan 02 , 2025 | 03:49 AM
రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. టోల్‌ప్లాజాలు మొదలు ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు ఎన్ని చేపట్టాల్సి ఉంటుందో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ఖరారు చేసింది.
చౌటుప్పల్, సంగారెడ్డి వద్ద 2 భారీ ఇంటర్‌చేంజ్‌ల నిర్మాణం
ఆర్‌ఆర్‌ఆర్‌పైకి ఇతర మార్గాల నుంచి రాకపోకలకు వీలుగా..
ఒక్కో డంబెల్ 37 హెక్టార్లలో.. హైదరాబాద్-మంచిర్యాలపై క్లోవర్ లీఫ్ ఇంటర్‌చేంజ్
ఇతర మార్గాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పైకి వెళ్లేందుకు, కిందకు దిగేందుకు వీలుగా..
ఒక్కో డంబెల్ 37 హెక్టార్లలో నిర్మాణం
హైదరాబాద్-మంచిర్యాల రహదారిలో క్లోవర్ లీఫ్ ఆకృతిలో మరో ఇంటర్‌చేంజ్
107 మైనర్, మేజర్ బ్రిడ్జిలు, 4 ఆర్వోబీలు
11 టోల్ ప్లాజాలు, 6 విశ్రాంతి ప్రదేశాలు
అన్ని రకాలు కలిపి 187 అండర్‌పా్‌సలు
ఇదీ ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం స్వరూపం
టోల్‌తో 15,768 కోట్ల రాబడి అంచనా
హైదరాబాద్, జనవరి 1(ఆంధ్రజ్యోతి): రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) ఉత్తర భాగం నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. టోల్‌ప్లాజాలు మొదలు ఆర్వోబీల వరకు ఎక్కడెక్కడ ఏయే నిర్మాణాలు ఎన్ని చేపట్టాల్సి ఉంటుందో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) తెలంగాణ విభాగం ఖరారు చేసింది. ఎక్స్‌టెండెడ్ డంబెల్స్ ఆకృతిలో రెండు కూడళ్లు, క్లోవర్ లీఫ్ ఆకారంలో మరో కూడలి రానుంది. ఎన్‌హెచ్‌ఏఐ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ప్రకారం ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం ప్రారంభమయ్యే సంగారెడ్డి దగ్గర్లోని గిర్మాపూర్ వద్ద, విజయవాడ హైవేపై చౌటుప్పల్ వద్ద రెండు భారీ ‘ఎక్స్‌టెండెడ్ డంబెల్స్’ రానున్నాయి. వీటిని వేర్వేరు మార్గాల నుంచి ఆర్‌ఆర్‌ఆర్‌పైకి వెళ్లేందుకు, ఆర్‌ఆర్‌ఆర్ నుంచి కిందకు దిగి వివిధ మార్గాల్లోకి మళ్లేందుకు వీలుగా నిర్మిస్తారు. గిర్మాపూర్ వద్ద హైదరాబాద్-పుణె, చౌటుప్పల్ దగ్గర హైదరాబాద్-విజయవాడ హైవేలను క్రాస్ చేయాల్సి ఉంది. చౌటుప్పల్ వద్దే ఆర్‌ఆర్‌ఆర్ దక్షిణ భాగం మొదలవుతుంది. ఎక్స్‌టెండెడ్ డంబెల్స్‌కు చౌటుప్పల్ దగ్గర 37.46 హెక్టార్ల భూమి (ఒక హెక్టారుకు రెండున్న ఎకరాలు), సంగారెడ్డి దగ్గర 37.69 హెక్టార్ల భూమి అవసరమవుతోంది. ఈ కూడళ్లకు కలిపే లూప్ రోడ్లు సుమారు రెండు కిలోమీటర్ల దూరం నుంచే ప్రారంభమవుతాయి. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగాన్ని మొత్తం 8 వరుసలతో నిర్మించేందుకు వీలుగా భూ సేకరణ చేయగా మొదట 4 వరుసల్లోనే నిర్మించనున్నారు. డంబెల్స్‌ను మాత్రం 8 వరుసల రోడ్డుకు అనుగుణంగానే నిర్మిస్తారు. ఇక హైదరాబాద్-మంచిర్యాల రహదారిలో గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మధ్య క్లోవర్ లీఫ్ ఆకృతిలో మరో ఇంటర్‌ఛేంజ్ నిర్మించనున్నారు. ఈ కూడలిలోనూ డంబెల్స్ విధానంలో మాదిరిగానే లూప్ రోడ్లు ఉంటాయి. ఈ మూడింటితో పాటు మరో 8 చోట్ల వివిధ రకాల ఇంటర్‌ఛేంజ్‌లు నిర్మించనున్నారు.
ఇదీ రహదారి స్వరూపం!
ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం 161 కిలోమీటర్లను 5 ప్యాకేజీల్లో నిర్మిస్తారు. ఈ మార్గంలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులను క్రాస్ చేయాల్సి వస్తోంది. కొన్నిచోట్ల మైనర్, మేజర్, బాక్స్ కల్వర్టులు కూడా నిర్మించాల్సి ఉంది. ఎన్‌హెచ్‌ఏఐ నివేదిక ప్రకారం 11 ఇంటర్‌ఛేంజ్‌లతో పాటు 11 టోల్‌ప్లాజాలు, 6 చోట్ల విశ్రాంతి ప్రాంతాలు ఏర్పాటు కానున్నాయి. దాదాపు 187 చిన్న, మధ్య, భారీ తరహా అండర్ పాస్‌లు నిర్మించాల్సి ఉంది. వీటితోపాటు రోడ్ ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లను ప్యాకేజీ-2, ప్యాకేజీ-3లో ఒక్కొక్కటి, ప్యాకేజీ-5లో రెండు నిర్మించాల్సి వస్తోంది. ఇవి కాకుండా 27 మేజర్ బ్రిడ్జిలు, 80 మైనర్ బ్రిడ్జిలు, 404 బాక్స్ కల్వర్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. రెండేళ్లలోనే పనులు పూర్తిచేయాలని కేంద్రం ఇటీవల ఆహ్వానించిన టెండర్ల నోటిఫికేషన్‌లో తెలిపింది. ఆ తరువాత 5 ఏళ్లు రహదారి నిర్వహణ బాధ్యత కాంట్రాక్టర్లదేనని కూడా పేర్కొంది. ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూఫ్రాన్, గజ్వేల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వరకు నిర్మాణం కానుంది.
టోల్ ఆదాయం రూ.15 వేల కోట్లు!
161 కిలోమీటర్ల ఉత్తరభాగం ఆర్‌ఆర్‌ఆర్‌ను 5 ప్యాకేజీల్లో రూ.7,104.06 కోట్లతో ‘ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్’ (ఈపీసీ) పద్ధతిలో నిర్మించనున్నారు. నిర్మాణం పూర్తయిన తరువాత నుంచి 17 ఏళ్లలో టోల్ రూపంలో రూ.15,768 కోట్లు రాబడి వస్తుందని ఎన్‌హెచ్‌ఏఐ నియమించుకున్న కన్సల్టెన్సీ సంస్థ ఇటీవల ఇచ్చిన నివేదికలో పొందుపర్చింది.