MLC Kavitha: ముందుంది ముసలం?
ABN , Publish Date - May 24 , 2025 | 03:05 AM
బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత.. తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది.
బీఆర్‌ఎస్‌లో కవిత కలకలం.. పార్టీలో లుకలుకలు బహిర్గతం..!
కేసీఆర్ చుట్టూ దయ్యాలెవరు?.. కవిత లేఖ ఎక్కడికి దారి తీస్తుంది?
ధిక్కారాన్ని కేసీఆర్ సహిస్తారా?.. కూతురే ప్రశ్నించడంపై ఆందోళన
అసమ్మతి గళం వినిపించిన నేతలను బయటికి పంపించిన చరిత్ర
కాంగ్రె్‌సపై వ్యతిరేకత పెంచామన్న జోష్ ఆవిరి
కవిత కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం
హైదరాబాద్, మే 23 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత.. తన తండ్రికి రాసిన లేఖ వ్యవహారం ఆ పార్టీలో చిచ్చురేపుతోంది. గత కొంతకాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందంటున్న కవిత.. తొలిసారి తన లేఖ ద్వారా ఈ విషయాన్ని బయటపెట్టిన తీరు పార్టీ వర్గాలను విస్మయానికి గురి చేసింది. పార్టీ తనకు తగినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదని గత కొంతకాలంగా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు కేసీఆర్ సొంత మీడియాలోనూ ఆమెకు తగినంత ప్రచారం కూడా లభించడం లేదని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. దాంతో సొంతంగా జిల్లా పర్యటనలు పెట్టుకున్నారని అంటున్నారు. కవిత తీరుపై పార్టీ పెద్దలూ కొంత అసంతృప్తితో ఉన్నట్లు గులాబీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైనప్పుడు ఒక దశలో తెలంగాణ భవన్‌లో ఆమెను మీడియా సమావేశాలు కూడా నిర్వహించవద్దని ఆదేశాలు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మరోవైపు పార్టీ అధినేతకు రాసిన లేఖను కావాలనే కేసీఆర్ సన్నిహితులే బయటపెట్టారని, ఇదంతా కవితకు, కేసీఆర్ మధ్య మరింత దూరం చేసేందుకే చేశారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ రజతోత్సవం సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలను వివరిస్తూ కేసీఆర్‌కు కవిత రాసినట్లుగా చెబుతున్న లేఖ గురువారం బహిర్గతం కావడం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇది నకిలీ లేఖ అని, తమ పార్టీకి దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కుట్ర చేశారనే కోణంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే వ్యూహం దిశగా బీఆర్‌ఎస్ నేతలు ఆలోచించారు. కానీ, లేఖను తానే రాశానంటూ శుక్రవారం కవిత కుండబద్దలు కొట్టడంతో అధినాయకత్వం వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.
ఎవరా దయ్యాలు?
లేఖ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా పేర్కొన్న సానుకూల అంశాలను ప్రస్తావించకుండా కేసీఆర్ దేవుడని, కానీ.. ఆయన చుట్టూ దయ్యాలున్నాయని కవిత అనడం మరింత కలకలం రేపింది. ఇంతకీ కేసీఆర్ చుట్టూ ఉన్న ఆ దయ్యాలెవరనే చర్చ నడుస్తోంది. వాస్తవానికి కేసీఆర్ కోటరీగా చాలా కొద్ది మందికి మాత్రమే పేరుంది. వారు దయ తలిస్తేనే కేసీఆర్ దర్శనం దక్కుతుందన్న అభిప్రాయాలు పార్టీ వర్గాల్లో ఉన్నాయి. అధికారం కోల్పోయాక కూడా కొంతమేరకు ఇంకా అదే పరిస్థితి నడుస్తోందన్న ఆరోపణలున్నాయి. గతంలో ఓ కుటుంబం కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా.. వారికి ఆ అవకాశం ఇవ్వకపోవడంతో ఆ కోటరీపై కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ సన్నిహితులు చెబుతున్నారు. గొడవ కూడా పడినట్లు వారు గుర్తు చేసుకుంటున్నారు. అందుకే తన ఆక్రోషాన్ని ఆమె లేఖ ద్వారా వెళ్లగక్కారని అంటున్నారు. అలాగే తనకు, తన తండ్రికి మధ్య ఆ కోటరీ కారణంగానే దూరం పెరిగిందన్న భావన ఆమెలో ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.
ఎలా డీల్ చేస్తారో?
పార్టీలో కవిత దూకుడునే తగ్గించేందుకే ఈ లేఖ వ్యవహారాన్ని బయట పెట్టారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. గతంలో పార్టీలో సంక్షోభాలు నెలకొన్న సమయంలో.. ప్రతిపక్షాల పని అనో, తెలంగాణ ద్రోహులు అనో, ఢిల్లీ వాళ ్లపని అనో ఇతరులపై నెపం నెట్టి.. ఆ సంక్షోభం నుంచి బయటపడే ప్రయత్నం పార్టీ అధిష్ఠానం చేసేది. తెలంగాణ ఉద్యమంలో తనతోపాటు ఆలె నరేంద్ర కీలకంగా వ్యవహరించినా.. ఆయనతో ఏర్పడ్డ విభేదాలతో ఇతర కారణాలు చూపి 2007 ఏప్రిల్‌లో కేసీఆర్ సస్పెండ్ చేశారు. అయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే కేసీఆర్ నాయకత్వం తప్పనిసరి అని భావించిన తెలంగాణవాదులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించలేకపోయారు. ఆ తరువాత తన ‘తల్లి తెలంగాణ పార్టీ’ని నాటి టీఆర్‌ఎ్‌సలో విలీనం చేసి కేసీఆర్‌తోపాటు ఎంపీగా గెలిచిన విజయశాంతిని స్వయంగా పార్టీ నుంచి వైదొలిగే పరిస్థితి కల్పించారు. అప్పుడు కూడా.. తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం, బీఆర్‌ఎస్ అధికారం చేపట్టడంతో కేసీఆర్‌కు ఎవరూ ఎదురు చెప్పలేని పరిస్థితి ఉంది. ఆపై పార్టీలో సీనియర్ నేత అయిన ఈటల రాజేందర్‌కూ ఇదే పరిస్థితి ఎదురైంది. అధినేత నిర్ణయాలను ప్రశ్నించే ధోరణిలో మాట్లాడడంతో ఆయనను మంత్రి పదవి నుంచి తప్పించారు. ఆపై ఈటల ఆస్తులను తెరపైకి తెచ్చి ఆత్మరక్షణలో పడేశారు. దీంతో ఈటల ఎమ్మెల్యే పదవికి కూడా 2021 జూన్‌లో రాజీనామా చేసి బీజేపీలో చేరారు. అయితే వీరందరి వ్యవహారం ఒక ఎత్తయితే.. ఈసారి సొంతింటి నుంచే ధిక్కార స్వరం వినిపిస్తోంది. దీంతో ఈ అంశాన్ని కేసీఆర్ ఎలా డీల్ చేస్తారోనన్న ప్రశ్నలు పార్టీ వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. కానీ, కవిత లేఖ వ్యవహారం మాత్రం కచ్చితంగా పార్టీకి నష్టం కలిగిస్తుందని గులాబీ వర్గాలంటున్నాయి. ఈ వ్యవహారాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించకోకపోతే మరింత నష్టం జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. అయితే పెద్దాయనకు, పిల్లలకు మధ్య సమన్వయకర్తగా కేసీఆర్ సతీమణి శోభ వ్యవహరిస్తుంటారని, ప్రస్తుతం కవిత విషయంలోనూ ఆమె చొరవ తీసుకునే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు అంటున్నాయి.
కవిత లేఖపై నోరెత్తొద్దన్న అధిష్ఠానం..!
బీఆర్‌ఎస్ అధినేతకు కవిత రాసిన లేఖపై మాత్రం ఆ పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు సహా.. ఇతర నేతలెవరూ స్పందించలేదు. ఖండించనూ లేదు. కాగా ఈ అంశంపై గులాబీనేతలు ఎవరూ మీడియా ముందుగానీ.. ఇతర చోట్లగానీ నోరెత్త వద్దని అధిష్ఠానం అల్టిమేటం జారీచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిణామాలు ఎంతవరకు దారితీస్తాయో వేచి చూసి.. ఆ తర్వాత అధినేత సూచనమేరకు దీనిపై స్పందించాలని పార్టీ శ్రేణులకు సూచించినట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యతిరేకత పెంచామన్న జోష్ కొద్దిరోజులే..
అధికారం కోల్పోయిన తొలినాళ్లలో బీఆర్‌ఎస్ కొంత ఆత్మరక్షణలో పడిపోయింది. పార్లమెంటు ఎన్నికల్లోనూ ఈ విషయం స్పష్టవైంది. కానీ, ఇటీవలి కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ చాలా దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికార పార్టీని టార్గెట్ చేస్తోంది. హామీల అమలు కోసం నిలదీస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే ప్రజల్లో కాంగ్రె్‌సపై వ్యతిరేకత పెంచడంలో ఒక అడుగు ముందుకు వేసిందనే అభిప్రాయాలు జనంలోనూ ఉన్నాయి. వరంగల్ రజతోత్సవ సభ ద్వారా పార్టీకి ఒక మంచి ఊపు తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ వ్యతిరేకతను బాగా ఎస్టాబ్లిష్ చేశామన్న సంతోషం గులాబీ వర్గాల్లో కనిపించింది. అయితే ఆ సంతోషం కొద్దిరోజులకే కవిత రూపంలో ఆవిరైందని ఓ కీలక నేత వ్యాఖ్యానించారు. సొంతింటి వ్యవహారాన్నే చక్కదిద్దుకోలేని పరిస్థితులు ఏర్పడితే ప్రజల్లో చులకన భావం ఏర్పడుతుందని ఆ నేత ఆందోళన వ్యక్తం చేశారు.
కొత్త పార్టీ యోచనలో కవిత?
పార్టీలోని తాజా రాజకీయ పరిణామాలు.. ఎటు దారితీస్తాయి? పార్టీలో చీలికలు ఏర్పడతాయా? అన్న కోణంలో కూడా బీఆర్‌ఎస్ నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీలో నెలకొన్న సమస్యలను అధినేత దృష్టికి తీసుకువెళ్లానని, ఇందులో తనకు ఎటువంటి వ్యక్తిగత ఎజెండా లేదని కవిత ప్రకటించినప్పటికీ.. త్వరలోనే ఆమె కొత్త పార్టీ పెట్టనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే మొన్నటివరకు కవితతో సన్నిహితంగా ఉన్న గులాబీ పార్టీ నేతల్లో ఎంతమంది ఆమె వైపు నిలుస్తారు? అసలు ఆమె పార్టీ పెడతారా? లేదంటే పార్టీలోని అంతర్గత సమస్యలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారా? అన్నదానిపై పార్టీ శ్రేణుల్లో చర్చ కొనసాగుతోంది. గతంలో నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్, జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి లాంటివారు బీఆర్‌ఎ్‌సను వీడి ఇతర పార్టీల్లో చేరినట్లుగా కవిత కూడా మరో పార్టీలో చేరతారా? అన్నదానిపైనా చర్చ జరుగుతోంది. వాస్తవానికి కవిత కొంతకాలంగా తీవ్ర అసంతృతప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే.. మేడే సందర్భంగా తన నివాసంలో ఏర్పాటుచేసిన సమావేశంలో సామాజిక తెలంగాణను సాధించలేకపోయామని, పదేళ్లు అధికారంలో ఉన్నా.. భూమిలేని పేదలకు ఏమీ చేయలేకపోయామని అనడం చర్చకు దారిదీసింది. మరోసారి మీడియాతో చిట్‌చాట్‌లో ఆమె మాట్లాడుతూ తనపై కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని.. సమయం వచ్చినపుడు అన్నీ బయటకు వస్తాయన్నారు. ఆర్నెళ్లు జైల్లో ఉన్నది సరిపోదా? ఇంకా కష్టపెడతారా? అంటూ ఆమె బాధపడ్డారు. తనను రెచ్చగొడితే ఇంకా గట్టిగా స్పందిస్తానని ఆ సందర్భంలో కవిత హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి
Genelia D Souza: డ్రైవర్ తొందరపాటు.. జెనీలియాకు తప్పిన పెను ప్రమాదం
Viral Video: ఇండియన్ ఆక్వామ్యాన్.. ఉప్పొంగుతున్న మ్యాన్ హోల్‌లోంచి..