BRS: కారులో భారీ కుదుపు!
ABN , Publish Date - May 30 , 2025 | 05:11 AM
అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో కొద్దిరోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్‌ఎస్.. గురువారం కుదుపునకు గురైంది. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి.
స్వరం పెంచిన కేసీఆర్ తనయ
ముఖ్యనేతలు కేటీఆర్, హరీశ్, సంతోష్ లక్ష్యంగా పరోక్ష విమర్శ
సంక్షోభం దిశగా బీఆర్‌ఎస్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత వ్యవహారంతో కొద్దిరోజులుగా ఇరకాటంలో పడ్డ బీఆర్‌ఎస్.. గురువారం కుదుపునకు గురైంది. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ కవిత చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టాయి. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ ఒక భయంకరమైన, నిశ్శబ్ద వాతావరణంలోకి వెళ్లిపోయింది. కవిత చేసిన వ్యాఖ్యలపై ఏ ఒక్క నేత కూడా నోరు మెదపలేని పరిస్థితి నెలకొంది. ఇన్ని రోజులూ పార్టీలోని అంతర్గత విషయాలు బయటకు వస్తే విపక్షాలు, మీడియా, తెలంగాణ ద్రోహులపై నెట్టేసే నాయకత్వానికి.. ఇప్పుడు ఆ అవకాశం లేకుండాపోయింది. అంతర్గతంగా కూర్చొని చర్చల ద్వారా సంక్షోభాన్ని పరిష్కరించుకునే పరిస్థితి లేకుండాపోయింది. గత శుక్రవారం కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె మరింత స్వరం పెంచారు. ఇప్పటిదాకా వ్యక్తిగతంగా విమర్శలు, ఆరోపణలు చేయని ఆమె గురువారం అధినేత కేసీఆర్ మినహా.. కేటీఆర్, హరీశ్‌రావు, జోగినిపల్లి సంతో్‌షకుమార్ సహా ముఖ్యనేతలందరినీ టార్గెట్ చేశారు. పెయిడ్ సోషల్ మీడియా ద్వారా, విదేశాల్లో ఐటీ సెల్ ఏర్పాటు చేసుకొని తనపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. అయితే ఇటువంటి ఐటీ సెల్స్ కేటీఆరేకే ఉన్నాయని ప్రస్తుతం పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని కేటీఆరే మేనేజ్ చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆమె వ్యాఖ్యల్లో ఎక్కువగా తన అన్న కేటీఆర్‌కే తగిలేవిగానే ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. ఇక బీజేపీ నాయకుడి ఆస్పత్రిని ప్రారంభించిందేవరో చెప్పాలంటూ పరోక్షంగా హరీశ్‌రావును ఉద్దేశించి వ్యాఖ్యానించినట్లు బీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కడుపులో విషం పెట్టుకుని, బయటకు తియ్యగా మాట్లాడే అలవాటు కొందరికి ఉందంటూ జోగినిపల్లి సంతో్‌షకుమార్‌ను ఉద్దేశించి అన్నట్లు పార్టీలో ఓ సీనియర్ నేత విశ్లేషించారు.
పార్టీ నడుస్తున్న తీరును కూడా కవిత తీవ్రంగా తప్పుబట్టారు. పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో పసలేదని ఎత్తిపోడిచారు. అదే సమయంలో బీజేపీలో బీఆర్‌ఎ్‌సను విలీనం చేసేందుకు కొన్ని శక్తులు యత్నిస్తున్నాయన్నారు. అన్నింటికన్నా కవిత చేసిన ఈ ఆరోపణ దుమారం రేపుతోంది. గత పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, త్వరలో కలిసిపోతాయంటూ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూర్చేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయి. దీంతో బీఆర్‌ఎస్ ఎప్పటికైనా బీజేపీలో విలీనమవుతుందని ఆమె పరోక్షంగా సంకేతాలు ఇచ్చినట్లయిందని గులాబీ శ్రేణులు అంటున్నాయి. అంతేకాకుండా.. కవిత తాజా వ్యాఖ్యలు పార్టీ పెద్దలకు, ఆమెకు మధ్య మరింత దూరం పెంచాయని, భవిష్యత్తులో మళ్లీ దగ్గరయ్యే అవకాశాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదని పార్టీలో ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. పార్టీలో అంతా బాగుందన్న వాతావరణ లేకుండాపోయిందని అన్నారు. ఇప్పటిదాకా అధికార కాంగ్రె్‌సపై చేసిన పోరాటం, ప్రభుత్వంపై పెంచిన వ్యతిరేకత కూడా ఒక్క అంశంతో గాలికి పోయిందని గులాబీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
కేసీఆర్ ఏం నిర్ణయం తీసుకుంటారో?
అసలు బీఆర్‌ఎ్‌సలో ఏం జరగబోతుందో, కవిత విషయంలో అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారో, ఈ సంక్షోభం నుంచి పార్టీని అధినేత ఎలా గట్టెక్కిస్తారోనని పార్టీ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అయితే ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని సీనియర్ నేత ఒకరు అన్నారు. మరోవైపు కవిత సంచలన వ్యాఖ్యలు చేసిన వారం గడుస్తున్నా... కేసీఆర్ ఇంతవరకు ఆమెతో మాట్లాడలేదు. కేవలం తనవైపు నుంచి ఇద్దరు దూతలను మాత్రం పంపించారు. అయితే ఆ ఇద్దరు దూతలు కూడా ఎవరి మనుషులో అందరికీ తెలుసునంటూ కవిత వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో కవితకు షోకాజ్ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని పార్టీలో ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని ఒక వర్గం అంటుండగా.. మరో వర్గం కేసీఆర్ అంత కఠిన నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోరనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే కవిత అంశం విపక్షాలకు ఒక ఆయుధంగా మారిందని బీఆర్‌ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే.. గురువారం మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ తన కుటుంబాన్నే మేనేజ్ చేసుకోలేని కేసీఆర్.. రాష్ట్రాన్ని ఏం పాలిస్తారని వ్యాఖ్యానించారు. మున్ముందు సరిగ్గా ఇటువంటి సూటిపోటి విమర్శలే అటు పార్టీకి, ఇటు కేసీఆర్ కుటుంబానికి ఎదురవుతుంటాయని సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు.
కవితలో ఇంత ఆవేదన ఉందని.. ఇవాళే తెలిసింది: వినోద్‌కుమార్
హైదరాబాద్, మే 29 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ స్పందించారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇవాళే తెలిసిందని, ఆమెతో స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తానని అన్నారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమని, చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశామని వ్యాఖ్యానించారు. ఇలాంటి విషయాల్లో తమ పార్టీయే మొదటిది కాదని, చివరిది కూడా కాదని అన్నారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ కుటుంబం మరో కొత్త సినిమా.. యెన్నం సెటైరికల్ కామెంట్స్
గద్దర్ అవార్డుల ప్రకటన.. విజేతలు వీరే
Read Latest Telangana News And Telugu News