Share News

Kavitha: లోగుట్టు ఏంటి?

ABN , Publish Date - May 23 , 2025 | 03:50 AM

బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన సంచలన లేఖ వెనక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి వరంగల్‌లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం.

Kavitha: లోగుట్టు ఏంటి?

  • లేఖ బహిర్గతమవడంలో ఆంతర్యమేంటి?

  • రజతోత్సవ సభతోనే బయటపడ్డ వైరుధ్యాలు!

  • పార్టీలో సమస్థాయిని కవిత కోరుతున్నట్లు వార్తలు

  • ప్రత్యామ్నాయాలపై కూడా ఆలోచిస్తున్నట్టు ప్రచారం

  • ఆ పరిస్థితే వస్తే అటా? ఇటా?

  • అంటూ కొందరు నేతలను ఆమె అడిగినట్లు చర్చ

హైదరాబాద్‌, మే 22, (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు కవిత రాసిన సంచలన లేఖ వెనక లోగుట్టు ఏంటనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి వరంగల్‌లో భారీగా నిర్వహించిన ఆ పార్టీ రజతోత్సవ సభ కొన్ని రాజకీయ అసంతృప్తులకు దారితీసిందనేది బహిరంగ రహస్యం. పార్టీలోని అంతర్గత వైరుధ్యాలు ప్రస్ఫుటం అయ్యేందుకు ఆ సభ బీజం వేసింది. ఏప్రిల్‌ 27న జరిగిన ఆ సభకు ముందు, తర్వాత బీఆర్‌ఎ్‌సలో అంతర్గత పరిణామాలు వేగవంతం అయ్యాయన్నది బహిరంగ రహస్యమే. పార్టీకి, తనకు రాజకీయ వారసుడు కేటీఆరే అని ఒక స్పష్టమైన సందేశం ఇచ్చే దిశగా ఆ సభను ఒక వేదికగా అధినేత ఉపయోగించుకున్నారనే చర్చ ఆ పార్టీ వర్గాల్లో నడుస్తోంది. దీంతో ఈ సభ అనంతరం కవిత కూడా తనకూ పార్టీలో సమ స్థాయి కావాలని అడుగుతున్నట్లు వార్తలొచ్చాయి. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని ఆమె ఆడిగినట్లుగా పార్టీలోనే అంతర్గతంగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆమె 20 రోజుల క్రితమే కేసీఆర్‌కు ఒక లేఖ రాశారనే విషయం బయటకు వచ్చింది. అయితే అప్పటికి కొద్దిమందికి మాత్రమే ఆ విషయం తెలుసు. ఆ లేఖలో.. పార్టీలో జరుగుతున్న అంతర్గత పరిణామాలకు సంబంధించి పలు అంశాలను ఆమె ప్రస్తావించారని, అలా చేయడంతో ఆమెకు ఇతరత్రా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయనే చర్చ కూడా జరిగింది. తాజాగా గురువారం ఆ లేఖ సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షం అయింది. లేఖ రాస్తే.. అది రాసిన వ్యక్తికి, తీసుకున్న వ్యక్తికి మాత్రమే తెలియాలి. ఒకవేళ బయటకు వస్తే ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు దానికి కారణం అవుతారు. ఇప్పుడీ లేఖ బయటకు వచ్చేలా చేయడం.. భవిష్యత్‌లో ఏ పరిణామాలకు దారితీస్తుందో చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ లేఖ బయటకు రావడం వెనక ఎవరి ప్రమేయం ఉంది? కావాలనే బయటకు తెచ్చారా? భవిష్యత్‌ రాజకీయ పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీలో తాను కోరుకున్న హోదా, ప్రాధాన్యం ఇవ్వకుంటే.. ప్రత్యామ్నాయ రాజకీయ వేదికల గురించి కూడా కవిత ఆలోచిస్తున్నారనే స్థాయి దాకా చర్చ జరుగుతోంది. ‘‘ఒకవేళ.. ప్రత్యామ్నాయ రాజకీయాలు కార్యరూపం దాలిస్తే మీరు ఇటువైపా? అటువైపా?’’ అని సైతం పార్టీలో కొందరు నాయకులను ఆమె అడిగినట్లు బీఆర్‌ఎ్‌సలో చర్చ జరుగుతోంది. తద్వారా ఎలాంటి ప్రతిస్పందన ఉందో ఆమె తెలుసుకునే ప్రయత్నం చేశారని పార్టీ వర్గాల సమాచారం.


పైనుంచి కింది స్థాయి వరకూ..

కవిత లేఖాస్త్రం వ్యవహారం ఆ పార్టీలో పై నుంచి కిందిస్థాయి వరకు చర్చకు దారితీసింది. కాళేశ్వరం కమిషన్‌ నోటీసుల వ్యవహారంలో కేసీఆర్‌ను హరీశ్‌రావు కలిసినప్పుడు ఈ వ్యవహారం కూడా చర్చకు వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో పార్టీలోని అగ్రనేతల నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు కూడా ఈ అంశంపైనే అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. వాస్తవానికి గత కొన్ని నెలలుగా కవిత తనకంటూ కొన్ని కార్యక్రమాలను పెట్టుకుని సొంతంగానే వాటిని నిర్వహించుకుంటున్నారనే వాదన ఉంది. పార్టీ తరఫునే చేస్తున్నప్పటికీ, పార్టీపరంగానే కార్యక్రమాలు ఉంటున్నప్పటికీ.. ఆ కార్యక్రమాల్లో పాల్గొనే పెద్ద నాయకురాలు ఆమే. అలాగే.. ఇటీవలికాలంలో తెలంగాణ జాగృతి కార్యకలాపాలను మరింత క్రియాశీలం చేశారు. తాను ప్రజల్లోకి వెళ్లడానికి అవసరమైన ఒక అజెండాను ఆమె ఏర్పాటుచేసుకుని, ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టారు. ఉదాహరణకు బీసీ కులగణన అంశంపై ఆమె తనంతతానుగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక దశలో పార్టీలోని నేతలు ఈ అంశంపై ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా ఎవరి కార్యక్రమాలను వారు నిర్వహించుకున్నారన్న చర్చ కూడా జరిగింది. కాగా, కుమారుడి గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు కొద్దిరోజుల క్రితం అమెరికాకు వెళ్లిన కవిత.. అక్కడ బీఆర్‌ఎస్‌ రజతోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడంపైనా ప్రవాసుల్లో కొంత చర్చ జరిగింది. కేసీఆర్‌కు ఆమె రాసిన లేఖ గురువారం బయటపడడంపై కవిత వివరణ అడిగేందుకు ప్రయత్నించినా ఆమె అందుబాటులోకి రాలేదు. శుక్రవారం ఆమె రాష్ట్రానికి తిరిగిరానున్నారు. వచ్చాక దీనిపై ఆమె ఏం మాట్లాడతారోననే ఆసక్తి నెలకొంది.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 03:50 AM