Share News

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

ABN , Publish Date - May 25 , 2025 | 03:36 AM

భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.

Kavitha: సముచిత ప్రాధాన్యమిస్తే సరే.. కాదంటే కొత్త పార్టీ

  • తండ్రి కేసీఆర్‌తో తేల్చుకోవాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత

  • ఆయన పిలుపు కోసం ఎదురుచూపు.. లేఖ లీకేజీపై ఆగ్రహంగా కేసీఆర్‌ తనయ

  • లీకువీరులెవరో తేలే వరకు పార్టీకి దూరం.. పార్టీ పెడితే తెలంగాణ జాగృతే?

  • రోజంతా ఇంటికే పరిమితం.. భర్త తరఫు కుటుంబం, సన్నిహితులతో మంతనాలు

హైదరాబాద్‌, మే 24 (ఆంధ్రజ్యోతి): భారత రాష్ట్ర సమితిలో తగిన ప్రాధాన్యం దక్కకుంటే తన దారి తాను చూసుకోవాలనే యోచనలో కేసీఆర్‌ తనయ కవిత ఉన్నట్లు సమాచారం. ఈ విషయంపై అధిష్ఠానం స్పందన కోసం ఆమె ఎదురుచూస్తున్నారు. కేసీఆర్‌ నుంచి పిలుపు వస్తే అన్ని విషయాలు కూలంకుషంగా చర్చించాలనుకుంటున్నారు. ప్రధానంగా రెండు అంశాలపై ఆమె పట్టుబడుతున్నట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. పార్టీలో తిరిగి తనకు సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. అలాగే, కేసీఆర్‌ చుట్టూ ఉన్న కోటరీ, తాను ప్రస్తావించిన దయ్యాల సంగతి కూడా తేల్చాల్సిందేనని గట్టిగా పట్టుబడుతున్నారు. పార్టీ అధినేత సానుకూలంగా స్పందించకుంటే కఠినమైన నిర్ణయం తీసుకునే యోచనలో కవిత ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అవసరమైతే బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఆమె సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కవిత కొత్త పార్టీ దిశగా అడుగులు వేసే అవకాశం లేకపోలేదని అంటున్నాయి. రెండు వారాల కిందటే కవిత కీలక నిర్ణయం తీసుకుంటుందని భావించారు. ఎందుకో కార్యరూపం దాల్చలేదు. తాను రాసిన లేఖపై కేసీఆర్‌ స్పందిస్తారని, తాను ప్రస్తావించిన అంశాలపై చర్చిస్తారని ఆమె భావించారని, కానీ అవేమీ జరగలేదని, మరికొంత సమయం కవిత ఎదురు చూశారని, ఈ లోగా ఆమె రాసిన లేఖ బయట పడిందని తెలిపాయి.


పార్టీ పేర్లు ఇవే

తప్పనిసరి పరిస్థితుల్లో బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లాల్సివస్తే కొత్త పార్టీ పెట్టడం ఖాయమని కవిత సన్నిహితవర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు పేర్లు చర్చకు వచ్చినట్లు సమాచారం. తన మానస పుత్రిక తెలంగాణ జాగృతి సంస్థ పేరునే పార్టీ పేరుగా ఖరారు చేసే అవకాశాలు లేకపోలేదని సన్నిహితులు చెబుతున్నారు. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి(టీబీఆర్‌ఎస్‌) పేరును కూడా ఆమెతో సన్నిహితంగా ఉండే కొందరు బీసీ నేతలు తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.


లీకేజీపై కవిత గరంగరం

ముఖ్యంగా తన లేఖ లీకేజీపై కవిత తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. తాను చెబుతున్న దయ్యాలే వాటిని కావాలని బయటకు విడుదల చేసి ఉండాలని ఆమె భావిస్తున్నారు. ముందు లేఖ ఎలా లీకైందన్న విషయం బయటకు రావాల్సిందేనని కవిత పట్టుబడుతున్నట్లు తెలిసింది. గతంలోనూ అనేక చేదు అనుభవాలను కవిత ఎదుర్కొన్నారని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. గతంలో కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడేందుకు కవిత పలుమార్లు ప్రయత్నించినా తన తండ్రికి ఫోన్‌ కూడా ఇవ్వకుండా చేశారని, ఇటువంటి పరిస్థితులు ఆమెకు మింగుడు పడకుండా చేశాయని సమాచారం. తన లేఖ లీకేజీ వీరులెవరో తెలిసేదాకా పార్టీ కార్యాలయానికి కానీ, కేసీఆర్‌ వద్దకు కానీ వెళ్లకూడదని మరో ఆలోచన కూడా కవితకు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాను రాసిన లేఖనే లీకు చేస్తారా అన్న ఆగ్రహావేశాలతో ఆమె ఉన్నట్లు జాగృతి వర్గాలు వెల్లడించాయి. ప్రధానంగా లీకు వీరులపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకోవాల్సిందేనని ఆమె డిమాండ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం ఎర్రవల్లిలో కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో ఉన్న ఇద్దరు ముగ్గురితో కవిత ఫోన్‌లో మాట్లాడినట్లు సమాచారం. లేఖలో కవిత పేర్కొన్న అంశాల్లో తప్పేముందన్న నేతలు లేకపోలేదు. కవిత లేఖ విషయంలో ఎవ్వరూ నొరెత్తవద్దన్న అధిష్ఠానం ఆదేశాల మేరకు అంతా గప్‌చు్‌పగా ఉన్నారు. ఆమె ప్రస్తావించిన అంశాలు ఎంతో విలువైనవని మాత్రం అంటున్నారు. కేసీఆర్‌ కోటరీ విషయంలో కవిత ప్రస్తావించిన అంశాలపై బహిరంగంగా మీడియాతో మాట్లాడే ధైర్యం ఏ ఒక్కరూ చేయలేక పోతున్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎంపీపీ కవిత లేఖలో ప్రస్తావించిన అంశాలు సరైనవేననీ, దానిపై అధిష్ఠానం సీరియె్‌సగా చర్చించాల్సిందేనని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎ్‌సలో కవిత అంశంపై ఒక్క కేటీఆర్‌ తప్ప మిగిలిన వాళ్లు అంతా మౌనముద్ర దాల్చారు. కేటీఆర్‌ కూడా కేసీఆర్‌ ఆదేశాల మేరకే కవిత అంశంపై స్పందించారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పార్టీ అంతర్గత విషయాలను అంతర్గతంగానే మాట్లాడాలని చెప్పడం ద్వారా కవిత వ్యాఖ్యలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు. ఒక రకంగా కవిత బహిరంగంగా అలా మాట్లాడటం సరికాదన్న ధోరణితో పార్టీ అధిష్ఠానం ఉన్నట్లు కేటీఆర్‌ వ్యాఖ్యల ద్వారా తేటతెల్లమైందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.


శనివారమంతా ఇంటికే పరిమితం

శుక్రవారం రాత్రి విదేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న కవిత శనివారమంతా ఇంటికే పరిమితమయ్యారు. బయటకు రాలేదు. ప్రయాణ బడలిక కారణంగా కొంత సేపు కవిత విశ్రాంతి తీసుకున్నారని సన్నిహితులు వెల్లడించారు. ఎవర్నీ కలిసేందుకు కవిత ఇష్టపడలేదని తెలిపారు. ఆమె ఎవరికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వలేదని జాగృతి వర్గాలు వెల్లడించాయి. తన భర్త అనిల్‌ తరపున బంధువులే పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. వారితో కొంతసేపు మంతనాలు జరిపినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి

Government Doctor: భార్యను పుట్టింటికి పంపించి.. వేరే మగాళ్లతో ఇంట్లో ఆ వీడియోలు..

Telangana: కవిత చెప్పిన దెయ్యాలు వారే.. సామ సంచలన కామెంట్స్..

Updated Date - May 25 , 2025 | 05:48 AM