Share News

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:32 AM

కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది.

కరీంనగర్‌-జగిత్యాల రోడ్డుకు మోక్షమెప్పుడో?

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌)

కేంద్ర ప్రభుత్వం కరీంనగర్‌-జగిత్యాల రోడ్డును జాతీయరహదారిగా-563గా ప్రకటించింది. ఈ రోడ్డును నాలుగులైన్లతో విస్తరించేందుకు ఏడేళ్ల క్రితమే 2,227 కోట్ల రూపాయలు కేటాయించింది. గతంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఈ రోడ్డును పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికీ భూసేకరణ కూడా పూర్తికాలేదు. పేరుకే ఇది జాతీయ రహదారిఅయినప్పటికీ గ్రామీణ రోడ్లకంటే అధ్వానంగా తయారైంది. నిత్యం వేలాది వాహనాలు ఈ రోడ్డులో రేయింబవళ్లు తిరుగుతుంటాయి. రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు 50 కిలోమీటర్లు ప్రయాణించాలంటే వాహనదారులు భయాందోళనలకు గురవుతున్నారు. ఆ రోడ్డుగుండా వెళ్లే ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళుతున్నారు. జాతీయ రహదారి నాలుగు రోడ్లతో అభివృద్ధి చేయాల్సిన అధికారులు భూసేకరణపై కూడా శ్రద్ధ చూపడం లేదు.

ఫ ఇరుకు దారిలో ప్రమాదకర మలుపులు

ప్రస్తుతం ఉన్న రోడ్డు అనేక మలుపులతో, ఇరుకుగా ఉండడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. మూలమలుపుల వద్ధ భయం భయంగా వాహనాలను నడపాల్సి వస్తోందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాలకు వెళ్లే బైపాస్‌రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ప్రతి 100 మీటర్లకు ఒకటి చొప్పున పెద్దపెద్ద గుంతలు పడటంతో భారీ వాహనదారులే కాకుండా ద్విచక్రవాహనదారులు ఆ రోడ్డుగుండా వెళ్లాలంటే భయపడుతున్నారు. రాత్రి వేళల్లో రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన పిచ్చిచెట్లు, ఇతర చెట్లు, వీధిదీపాలు లేక పోవడంతో చీకట్లో, పెద్దపెద్ద గుంతల నుంచి వెళ్లడం మరింత కష్టంగా మారిదంటూ వాహనదారులు అంటున్నారు. కరీంనగర్‌ నుంచి జగిత్యాల వరకు రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిలో ప్రతీ రోజు ఎక్కడో కొన్ని చోట్ల చిన్నచితక ప్రమాదాలు జరుగడమే కాకుండా ఎంతో మంది ఈ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న ఈ రోడ్డును నాలుగు లైన్లతో జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలని పదేళ్లుగా స్థానికులు, వాహనదారులు ఆందోళనలు చేస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. రోడ్లపై ప్రమాదకరంగా ఉన్న గుంతలను కూడా పూడ్చి శాశ్వత చర్యలు చేపట్టడం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే ఈ జాతీయ రహదారిలో దాదాపు నిమిషానికి ఒకటి చొప్పున వరుసబెట్టి వాహనాలు వెళ్తుంటాయి. ప్రస్తుతం రెండువరుసలతో ఉన్న ఈ రోడ్డు గుండా రద్దీ ఎక్కువగా ఉండడంతో ఓవర్‌టేక్‌ చేయడం గగనమవుతోంది. ఈ రహదారిలో ఆరు మేజర్‌, 18 మైనర్‌ బ్రిడ్జిలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 195 చోట్ల కల్వర్టులు నిర్మించాలని అధికారులు అంచనా వేశారు. ఇప్పటికీ ఈ రోడ్డు అభివృద్ధి పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.

ఫ అధ్వానంగా బైపాస్‌ రోడ్డు

వరంగల్‌, హైదరాబాద్‌ నుంచి వచ్చే గూడ్స్‌, గ్రానైట్‌ లాంటి ఇతర భారీ వాహనాలు కరీంనగర్‌లోని ఎన్టీఆర్‌ విగ్రహం నుంచి లోయర్‌ మానేరు డ్యామ్‌ బైపాస్‌ మీదుగా మల్కాపూర్‌ రోడ్డులో మళ్లీ ప్రధాన రహదారి మీదకు వస్తుంటాయి. అయితే ఈ భారీ వాహనాలు వచ్చే బైపాస్‌ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారింది. కొన్నిచోట్ల రోడ్డు మధ్యలో నడుములోతు గుంతలు ఏర్పడడంతో వాహనాలు ఎలా వెళ్లాలో తెలియక ప్రమాదపు అంచున నడిపిస్తున్నారు. కరీంనగర్‌-జగిత్యాల జాతీయరహదారిని నాలుగులైన్లతో అభివృద్ధి చేసేందుకు భూసేకరణ వేగంగా చేపట్టి పనులు ప్రారంభించాలని అంటున్నారు. ఆలోగా ప్రమాదకరంగా ఉన్న గుంతలన్నింటిని పూడ్చివేయాలని, రోడ్లకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్లను తొలగించాలని, ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 12:32 AM