Family Tragedy: పురుగుల మందు పోసి, గొంతు నులిమి..
ABN , Publish Date - Dec 26 , 2025 | 05:35 AM
పెళ్లయిన యువకుడిని ప్రేమించిన ఓ బాలిక తన తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైంది. కూతురి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు..
కూతురిని కడతేర్చిన తల్లిదండ్రులు
పెళ్లయిన యువకుడిని ప్రేమించిందని కిరాతకం
అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకుందంటూ నాటకం
పోలీసు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి
సైదాపూర్, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): పెళ్లయిన యువకుడిని ప్రేమించిన ఓ బాలిక తన తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైంది. కూతురి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు.. పురుగు ముందు తాగించి, గొంతు నులిమేసి కన్నబిడ్డ ఉసురు తీశారు. ఆపై, తమ బిడ్డ అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకుందంటూ నాటకమాడారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం సర్వాయిపేట పంచాయతీ పరిధి శివరాంపల్లి గ్రామంలో నవంబరు 14న జరిగిన ఈ హత్య విషయం పోలీసు దర్యాప్తుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి హుజూరాబాద్ ఏసీపీ మాధవి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
శివరాంపల్లికి చెందిన రెడ్డి రాజు-లావణ్య దంపతుల చిన్నకుమార్తె రెడ్డి అర్చన (16) సైదాపూర్ మోడల్ స్కూల్‌లో ఇంటర్ మొదటి సంవత్సరం చదివేది. తమ గ్రామానికే చెందిన పోను అనీల్ అనే యువకుడితో అర్చన ప్రేమలో పడింది. వివాహితుడైన అనీల్ భార్యతో వివాదాల వల్ల ఒంటరిగా ఉంటున్నాడు. అర్చన, అనీల్ ఇరువురిది ఒకే కులం(ముదిరాజ్) అయినప్పటికీ.. వీరి ప్రేమ వ్యవహారం బాలిక తల్లిదండ్రులకు ఇష్టం లేదు. ఈ విషయంలో కుమార్తెను పలుమార్లు మందలించినా ఫలితం లేకపోయింది. దీంతో తమ పరువు పోతుందనే భావించి కన్నబిడ్డను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో నవంబరు 14వ తేదీ రాత్రి అర్చన ఒంటరిగా నిద్రపోతుండగా బలవంతంగా ఆమె గొంతులో పురుగు మందు పోశారు. అయినా, చనిపోతుందో లేదో అనే అనుమానంతో రాజు తన కూతురు గొంతు నులిమి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణం తీశాడు. అనంతరం, అర్చనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయని, నురుగులు కక్కుతూ తమ బిడ్డ హఠాత్తుగా చనిపోయిందని మరుసటి రోజు ఉదయం స్థానికులను నమ్మించారు.
అలాగే, అర్చనకు థైరాయిడ్, కడుపు నొప్పి తదితర సమస్యలు ఉన్నాయని, వాటివల్ల ఏదైనా విషం తీసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటుందని, తమకు ఎలాంటి అనుమానాలు లేవని నవంబరు 15న సైదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికది అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా రాజు, లావణ్య దంపతులు తాము చేసిన దారుణాన్ని బయటపెట్టారు. దీంతో రాజు దంపతులను హత్య కేసులో అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Hyderabad: అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా
Hyderabad: సీఎం రేవంత్‌రెడ్డికి ఎంపీ ఆర్.కృష్ణయ్య లేఖ