Share News

Kaleshwaram project: నేడే కాళేశ్వరం నివేదిక బహిర్గతం

ABN , Publish Date - Aug 31 , 2025 | 03:56 AM

కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆదివారం బహిర్గతం కానుంది. ఇంతకుముందు నివేదిక సారాంశాన్ని(జిస్ట్‌) మాత్రమే బయట పెట్టిన ప్రభుత్వం..

Kaleshwaram project: నేడే కాళేశ్వరం నివేదిక బహిర్గతం

  • శాసనసభలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • బ్యారేజీల వైఫల్యానికి కారకులు, కారణాలను వివరించనున్న సర్కారు

  • మాగంటి గోపీనాథ్‌ మృతికి సభ సంతాపం

  • ఎన్టీఆర్‌కు భక్తుడు.. నాకు మిత్రుడు: రేవంత్‌

  • ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పార్టీ మారలేదు: కేటీఆర్‌

  • శాసనమండలి రేపటికి వాయిదా

  • నూతన సభ్యులను పరిచయం చేసిన చైర్మన్‌

  • మాజీ సభ్యుల మృతికి మండలి సంతాపం

హైదరాబాద్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యంపై జస్టిస్‌ పినాకిచంద్ర ఘోష్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆదివారం బహిర్గతం కానుంది. ఇంతకుముందు నివేదిక సారాంశాన్ని(జిస్ట్‌) మాత్రమే బయట పెట్టిన ప్రభుత్వం.. ఆదివారం నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వైఫల్యానికి కారకులు/కారణాలను సభలో వెల్లడించనుంది. నివేదికపై చర్చించిన అనంతరం బాధ్యులపై ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై విధాన ప్రకటన చేయనుంది. కాగా, ఈ నివేదికపై శాసనసభలో చర్చించినప్పటికీ.. తదుపరి చర్యలకు ఉపక్రమించరాదని కోరుతూ బీఆర్‌ఎస్‌ ఇప్పటికే న్యాయస్థానం తలుపు తట్టింది. అయితే నివేదిక ప్రకారం చర్యల కోసం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌ను) ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదిక సారాంశంలో, ‘‘మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణం అన్నది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ మదిలో మాత్రమే పుట్టిన ఆలోచన. తన ఆలోచనను గుడ్డిగా అమలు చేయడం, తానే ఇంజనీర్‌లా వ్యవహరించడం, అవకతవకలు, నిబందనల ఉల్లంఘన వల్లే ఆ ప్రాజెక్టు కూలింది. నిపుణుల కమిటీ సిఫారసును కూడా పట్టించుకోలేదు. నీటి లభ్యత ఉందనే సాకుతో మేడిగడ్డ వద్ద నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయం మొత్తం బ్యారేజీలను ప్రమాదంలో నెట్టేసింది. దీనికి పూర్తి బాధ్యత కేసీఆర్‌దే’’ అని పేర్కొన్న విషయం తెలిసిందే. కాగా, నివేదికలో పేర్కొన్న అంశాలన్నింటిపైనా శాసనసభలో చర్చించనున్నారు.


మాగంటి గోపీనాథ్‌ మృతికి సంతాపం..

శాసనసభ తొలిరోజు సమావేశం శనివారం ఉదయం ప్రారంభం కాగానే.. జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మృతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభలో సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గోపీనాథ్‌ ఎన్టీఆర్‌కు గొప్ప భక్తుడని అన్నారు. రాజకీయంగా పార్టీలు వేరైనా.. వ్యక్తిగతంగా తనకు మంచి మిత్రుడన్నారు. 1983లో తెలుగుదేశం పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించినప్పటి నుంచి గోపీనాథ్‌ చేపట్టిన పదవులను రేవంత్‌రెడ్డి గుర్తుచేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్‌ ప్రజల కోసం గోపీనాథ్‌ చివరిదాకా పాటుపడ్డారని అన్నారు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా తమ పార్టీపై నమ్మకంతో విధేయుడిగా ఉన్నారని చెప్పారు. సంతాప తీర్మానంపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్‌, బీఆర్‌ఎస్‌ సభ్యులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, వేముల ప్రశాంత్‌ రెడ్డి, బీజేపీ సభ్యుడు వెంకటరమణారెడ్డి, ఎంఐఎం సభ్యుడు బలాలా, సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. అనంతరం సభ ఆదివారానికి వాయిదా పడింది.


శాసనమండలి రేపటికి వాయిదా..

శాసనమండలి సమావేశాలు శనివారం ప్రారంభం కాగానే చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇటీవల నూతనంగా ఎన్నికైన సభ్యులు అద్దంకి దయాకర్‌, శంకర్‌నాయక్‌, విజయశాంతి, నెల్లికంటి సత్యం, శ్రీపాల్‌రెడ్డి, సి.అంజిరెడ్డి, మల్క కొమరయ్య, మీర్జా రియాజుల్‌ హసన్‌ అఫెండీలను సభకు పరిచయం చేశారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శాసనసమండలి సభ్యులుగా పనిచేసి ఇటీవల మరణించిన టి.రత్నాకర్‌, ఎం.రంగారెడ్డిలకు సంతాపం తెలిపారు. అనంతరం మండలిని సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం కాళేశ్వరం కమిషన్‌ నివేదిక, బీసీ రిజర్వేషన ్లపై మండలిలో చర్చించనున్నారు. శనివారం చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మండలి బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు, డిప్యూటీ చైర్మన్‌ బండ ప్రకాష్‌, శాసన మండలి ప్రతిపక్షనేత మధుసూదనాచారి, చీఫ్‌ విప్‌ పట్నం మహేందర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్‌, నెల్లికంటి సత్యం, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు పాల్గొన్నారు


కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు తర్ఫీదు

శాసనసభలో ఆదివారం కాళేశ్వరం బ్యారేజీలపై నివేదికను బహిర్గతం చేయనుండటంతో.. దానిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలకు శనివారం రాత్రి జలసౌధలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గన్‌మెన్లు, ఫోన్లు లేకుండా రావాలని వారికి సమాచారం ఇవ్వగా.. అందరూ అలాగే హాజరయ్యారు. కేసీఆర్‌, హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌ల పాత్రను కాళేశ్వరం కమిషన్‌ నివేదిక ఎలా ఎత్తిచూపిందనే విషయాన్ని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వారికి వివరించారు. విపక్ష బీఆర్‌ఎ్‌సను ఎలా ఎదుర్కోవాలి? విమర్శలకు ఎలా జవాబు చెప్పాలనే దానిపై తర్ఫీదునిచ్చారు. ఆదివారం నివేదికను సభలో ప్రవేశపెట్టనుండటంతో గోప్యంగా ఉండాలని ఆదేశాలిచ్చినట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి:

కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌‌పై మాటల యుద్ధం..

15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్

మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Aug 31 , 2025 | 03:56 AM