Bhupalpally: కాళేశ్వరాలయంలో వైభవంగా కుంభాభిషేకం
ABN , Publish Date - Feb 10 , 2025 | 04:45 AM
దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.

హాజరైన మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్
తుని తపోవన పీఠాధిపతి సచ్చిదానందతో మహా క్రతువు
మహదేవపూర్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): దక్షిణ కాశీగా పేరుగాంచిన భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ప్రాచీన పుణ్యక్షేత్రం కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో మహాకుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మూడు రోజులుగా కనులపండువగా సాగిన ఈ వేడుక ఆదివారం ముగిసింది. చివరి రోజు మహా క్రతువును భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లోని తుని తపోవన పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ సచ్చిదానంద సరస్వతి స్వామి చేతుల మీదుగా ప్రధాన ఘట్టం జరిగింది.
ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రు లు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ హాజరు కాగా, వారికి అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. కాళేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేక మహోత్సవం 43 ఏళ్ల తర్వాత నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభామేళా జరుగుతున్న తరుణంలోనే కాళేశ్వరంలో త్రివేణి సంగమంలో ఈ మహోత్సవం 3 రోజులపాటు జరిగింది. ఈ నేపథ్యంలో వివిధ ప్రాం తాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి... త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు.