Kavitha: కమలంతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదు
ABN , Publish Date - May 31 , 2025 | 04:23 AM
తనకంటూ ప్రత్యేక అజెండా ఏదీ లేదని, పెద్దాయనను(కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.
పొత్తు ప్రతిపాదనను గట్టిగా వ్యతిరేకిస్తా
పార్టీని కాపాడుకోవాలనే కేసీఆర్‌కు లేఖ
అవకాశం వచ్చినా నాన్నను కలవలేక పోయా
ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం దుశ్చర్యలు
ఎన్‌కౌంటర్‌లో మరణించిన నంబాల మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం లేని పార్టీ బీజేపీ
కాంగ్రెస్ దళిత వ్యతిరేకి.. రేవంత్‌రెడ్డి కూడా.. అందువల్లే భట్టి, ఎంపీ వంశీలకు అవమానాలు
మంచిర్యాలలో విలేకరులతో ఎమ్మెల్సీ కవిత
ఆమె పర్యటనలో కనిపించని బీఆర్‌ఎస్ నేతలు
మంచిర్యాల, మే 30(ఆంధ్రజ్యోతి): తనకంటూ ప్రత్యేక అజెండా ఏదీ లేదని, పెద్దాయనను(కేసీఆర్‌ను ఉద్దేశించి) ఎవరు ఏమన్నా ఊరుకునేది లేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. శుక్రవారం మంచిర్యాలలో ఆమె మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే పెద్దాయనకు లేఖ రాసినట్లు తెలిపారు. జాగృతి కమిటీలను వేస్తే రాద్దాంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యరెడ్డి వర్మ, పీవీ నర్సింహారావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆధ్వర్యంలో చేశామని, అది కూడా బీఆర్‌ఎ్‌సను వ్యతిరేకించినట్లా అని ప్రశ్నించారు. గతంలో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)లో కొత్త నాయకత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు కూడా పనికట్టుకొని విమర్శలు చేశారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే బీఆర్‌ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. తాను కేసీఆర్‌కు లేఖ రాయడం కొత్తేమీ కాదని, దానిని లీకు చేసినవారెవరో బయట పెట్టాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు.
లేఖలో ప్రస్తావించిన అంశాలు కొత్తవేమీ కాదని, ప్రజలు అనుకునేవేనని చెప్పారు. బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేయడానికి తాను వ్యతిరేక మని, పార్టీ బీజేపీ వైపు చూడాల్సిన అవసరం లేదని అన్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలేవీ బాగుపడలేదని చెప్పారు. తాను జైల్లో ఉన్నప్పుడు బీఆర్‌ఎ్‌సను బీజేపీలో కలపాలనే అంశం ప్రస్తావనకు వస్తే అంగీకరించే ప్రసక్తే లేదని చెప్పానన్నారు. ఇప్పుడు ఆ ప్రయత్నం చేసినా వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్‌ను వ్యక్తిగతంగా కలిసి అసలు విషయం చెప్పాలని ప్రయత్నం చేశానని, తండ్రిని కలిసే అవకాశం కూడా వచ్చిందని, వ్యక్తిగత కారణాల వల్ల కలువలేక పోయానని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆపరేషన్ కగార్ పేరుతో దుశ్చర్యలకు పాల్పడుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు ఎండీ మునీర్ కుటుంబ సభ్యులను కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, మునీర్ విప్లవోద్యమ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో, సమస్యలను ఎండగట్టడంలో ముందుండేవారన్నారు. మావోయిస్టు నేత నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో మరణిస్తే అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చే సంస్కారం కూడా లేని పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేకులని ఆరోపించారు. సరస్వతీ నది పుష్కరాలకు పెద్దపల్లి ఎంపీ వంశీని ఆహ్వానించకుండా అవమానపరిచారన్నారు. యాదగిరి గుట్టలో రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యులంతా పైన ఆసనాల్లో కూర్చుని, దళితుడైన డిప్యూటీ సీఎం భట్టిని కింది ఆసనాల్లో కూర్చోబెట్టి అవమానించారని వ్యాఖ్యానించారు.
కవిత వెంట కానరాని బీఆర్‌ఎస్ నాయకులు
కవిత పర్యటన సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు గానీ, పార్టీ అనుబంఽధ తెలంగాణ సింగరేణి కార్మిక సంఘం(టీబీజీకెఎస్) నాయకులు కానీ ఎవరు కానరాలేదు. శ్రీరాంపూర్ నుంచి మొదలైన పర్యటన లక్షెట్టిపేట వరకు కొనసాగింది. కొందరు జాగృతి నాయకులు తప్ప బీఆర్‌ఎస్ నేతలు, అనుబంధ సంఘాల నాయకులు ఎవరు పాల్గొనక పోవడం గమనార్హం. కవిత పర్యటనలో ఎవరు పాల్గొనవద్దనే ఆదేశాలు ఉండడంతో వారంతా స్పందించలేదని ప్రచారం జరుగుతోంది. మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్‌తో పాటు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు కూడాకవిత పర్యటనకు దూరంగా ఉన్నారు. పలు కూడళ్లలో జాగృతి నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో కేటీఆర్ ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది. గతంలోకవిత పర్యటన అంటే పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు పాల్గొనేవారు. తాజా పరిణామాలతో వారంతా మొఖం చాటేసినట్లు తెలుస్తోంది. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాల కార్యకర్తలు కూడాదూరంగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఆర్సీబీ ఓడిపోతే భర్తకు విడాకులు ఇస్తుందట.. ఇదేం పిచ్చి..
ఐఎన్ఎస్ విక్రాంత్ పైనుంచి పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ వార్నింగ్