Vice President Nomination: వ్యవసాయ కుటుంబంలో జన్మించి.. ఉప రాష్ట్రపతి అభ్యర్థి స్థాయికి
ABN , Publish Date - Aug 20 , 2025 | 03:54 AM
భారత ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు.
రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం నుంచి సుప్రీంకోర్టు జడ్జి దాకా
అంచెలంచెలుగా ఎదిగిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి
పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులు
హైదరాబాద్/కందుకూరు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): భారత ఉప రాష్ట్రపతి పదవికి ఇండియా కూటమి తరఫున అభ్యర్థిగా ఎంపికైన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం ఆకుల మైలారం గ్రామంలో 1946 జూలై 8న జన్మించిన భూచిరెడ్డి సుదర్శన్‌రెడ్డి విద్యాభ్యాసం హైదరాబాద్‌లో కొనసాగింది. 1971లో ఉస్మానియా విశ్వవిద్యాలంయం నుంచి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ పట్టా పొందారు. అదే ఏడాది డిసెంబరు 27న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. 1988 ఆగస్టు 8న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ ప్లీడరుగా సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. రిట్ పిటిషన్లు, సివిల్ తగాదాల కేసుల్లో వాదనలు వినిపించారు. 1990లో కేంద్ర ప్రభుత్వంలో అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా నియమితులై ఆరు నెలలపాటు పని చేశారు. 1993లో ఉమ్మడి ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి న్యాయ సలహాదారుగా వ్యవహరించారు. అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
1995 మే 2న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2005లో పదోన్నతిపై గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2007లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. నాలుగున్నరేళ్లుపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2011 జూలై 8న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన అనంతరం గోవాకు మొట్టమొదటి లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ సుదర్శన్‌రెడ్డి పనిచేశారు. 2024 డిసెంబరులో హైదరాబాద్ అంతర్జాతీయ అర్బిట్రేషన్ అండ్ మీడియేషన్ సెంటర్ (ఐఏఎంసీ) శాశ్వత ట్రస్టీగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన సమయంలో పలు కీలక కేసుల్లో సంచలన తీర్పులు ఇచ్చారు. నల్లధనం కేసులపై కేంద్ర ప్రభుత్వ అలసత్వాన్ని విమర్శిస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే సల్వా జుడుం (మావోయిస్టులపై చర్యల కోసం గిరిజన యువకులను నియమించడం) చట్టవిరుద్ధమని తీర్పు ఇచ్చారు. ప్రజాసంఘాలతో మంచి సంబంధాలున్న జస్టిస్ సుదర్శన్‌రెడ్డిని ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడంతో ఈ ప్రాంత ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జస్టిస్ సుదర్శన్‌రెడ్డి వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ: 1946 జూలై 8
పుట్టిన స్థలం: రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం, ఆకులమైలారం గ్రామం
తల్లిదండ్రులు:
భూచిరెడ్డి లక్ష్మీనారాయణరెడ్డి, అనసూయమ్మ
భార్య: పద్మారెడ్డి
కుమారులు: బి.శశిధర్‌రెడ్డి, బి.వంశీదర్‌రెడ్డి
కూతురు: సుమిత
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..