Jubilee Hills by-election: ‘జూబ్లీ’ జోరు.. ప్రచార హోరు..
ABN , Publish Date - Oct 20 , 2025 | 08:49 AM
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కీలక పోరు మొదలు కానుంది. నామినేషన్ల దాఖలు పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో వ్యూహ, ప్రతి వ్యూహాలపై పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
- నామినేషన్ దాఖలుకు రేపు ఆఖరు
- ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లు
- మంగళవారం బీజేపీ అభ్యర్థి రెండో సెట్ దాఖలు
- ఇప్పటికే 80 మందికి పైగా ఇతరుల నామినేషన్లు
- పండుగ వేళ అభ్యర్థులకు తప్పని అదనపు ఖర్చు
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills by-election)లో కీలక పోరు మొదలు కానుంది. నామినేషన్ల దాఖలు పర్వం చివరి అంకానికి చేరుకోవడంతో వ్యూహ, ప్రతి వ్యూహాలపై పార్టీలు, అభ్యర్థులు ప్రత్యేక దృష్టి సారించి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మంగళవారం నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిగా వి.నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపినాథ్‌లు నామినేషన్లు వేశారు. బీజేపీ(BJP) తరఫున అభ్యర్థి కుటుంబీకులు ఒక నామినేషన్ సెట్టు దాఖలు చేయగా మంగళవారం అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి మరో నామినేషన్ దాఖలు చేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వతంత్ర, ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీల నుంచి ఇప్పటికే 80 మందికిపైగా నామినేషన్లు వేశారు. ఆఖరి రోజు ఈ సంఖ్య ఎంతకు చేరుతుందన్నది ఆసక్తికరంగా మారింది. పండుగ తర్వాత పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహణకు అభ్యర్థులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఎన్నికల వేళ పండుగలు
ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అనంతరం రెండు పెద్ద పండుగలు వచ్చాయి. ఓ వైపు ఎన్నికలు, మరోవైపు పండుగలతో అభ్యర్థులకు అదనపు ఖర్చు తప్పడం లేదు. దసరా పండుగ సందర్భంలో తమ వెంట ఉన్న అనుచరులు, నాయకులకు అభ్యర్థిత్వం ఆశించిన వారు మద్యం పంపిణీ చేశారు. అప్పటికి అభ్యర్థిగా పేరు ఖరారు కాకున్నా.. తన వెంట ఉండే వారికి ఖరీదైన మద్యం సీసాలు ఇచ్చారు. దీపావళి పండుగ దృష్ట్యా.. ఇప్పుడు నాయకులు, కీలక కార్యకర్తలకు మిఠాయిలు గిఫ్ట్‌గా ఇచ్చారు. గంపగుత్తగా గిఫ్ట్ బాక్స్‌లు కొనుగోలు చేసిన ఓ అభ్యర్థి.. ‘పిల్లలతో సరదాగా పండుగ జరుపుకోండి.. అంటూ క్రాకర్స్, స్వీట్ బాక్స్‌లు అనుచరులకు అందజేశారు. పోలింగ్ సమయానికి 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయాల్సిన దృష్ట్యా.. నికరంగా ప్రచారానికి మరో 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీలైనంత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లేందుకు అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తున్నారు.

పేరు, ఫోన్ నంబర్ల సేకరణ
గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు పోల్ మేనేజ్‌మెంట్‌కు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీలతోపాటు జిల్లాల నుంచి వారి అనుచరులు, మాజీ జడ్‌పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, కీలక నేతలు జూబ్లీహిల్స్‌లో ప్రచారం చేస్తున్నారు. వీరంతా పలు ప్రాంతాల్లో హోటళ్లు, గదులు అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని పార్టీలకు చెందిన బృందాలు ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌లో ఎపిక్ కార్డు నంబర్ ఆధారంగా తనిఖీ చేసి.. ఓటరు పేరు, మొబైల్‌నంబర్లను సేకరిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దీపావళి రోజున మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ముస్లింలకు అట్రాసిటీ చట్టం తీసుకురావాలి
Read Latest Telangana News and National News