JNTU: సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై జేఎన్‌టీయూ కొరడా
ABN , Publish Date - Feb 18 , 2025 | 04:28 AM
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమైంది.
రీయింబర్స్‌మెంట్ మంజూరైనా విద్యార్థులకు వేధింపులు
అదనపు ఫీజు వసూళ్లపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు
షోకాజ్ నోటీసులు జారీ చేసిన జేఎన్‌టీయూ
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వర్సిటీ అఫిలియేటెడ్, అటానమస్ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కళాశాలలపై కొరడా ఝళిపించేందుకు జేఎన్‌టీయూ సన్నద్ధమైంది. తాజాగా గోకరాజు గంగరాజు కళాశాలకు యూనివర్సిటీ అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు. ఈ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ మంజూరైనప్పటికీ ఒరిజినల్ సర్టిఫికెట్లను ఇవ్వడం లేదని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌కు ఫిర్యాదులందాయి.
దీంతో విద్యార్థులకు తక్షణమే సర్టిఫికెట్లు ఇవ్వాలని వర్సిటీ రిజిస్ట్రార్ ఫోన్ ద్వారా ఇచ్చిన ఆదేశాలను గోకరాజు కళాశాల యాజమాన్యం పెడచెవిన పెట్టడంతో షోకాజ్ నోటీసు జారీచేశారు. సరైన వివరణ ఇవ్వకుంటే కఠినచర్యలు తీసుకుంటామని, అవసరమైతే అఫిలియేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని కళాశాలలను ఉపేక్షించే ప్రసక్తే లేదని జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు చెప్పారు. సర్టిఫికెట్లు ఇవ్వని కాలేజీలపై విద్యార్థులు జేఎన్‌టీయూ వెబ్‌సైట్ పోర్టల్ నుంచి కానీ, పీఏటూరిజిస్ట్రార్‌కు ఇ-మెయిల్ ద్వారాగానీ ఫిర్యాదు చేయవచ్చన్నారు.