Share News

NEET-2025 Result: అమ్మమ్మ కల.. నాన్న ప్రోత్సాహం

ABN , Publish Date - Jun 15 , 2025 | 04:02 AM

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌-2025 యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు.

NEET-2025 Result: అమ్మమ్మ కల.. నాన్న ప్రోత్సాహం

  • రోజుకు 14 గంటల పాటు చదువు

  • మాక్‌ టెస్టుల్లో దొర్లిన తప్పులు పునరావృతం కాకుండా సాధన

  • దక్షిణాది టాపర్‌గా నిలవడం సంతోషం

  • ‘ఆంధ్రజ్యోతి’తో నీట్‌ ఆలిండియా 18వ ర్యాంకర్‌ కాకర్ల జీవన్‌ సాయికుమార్‌

వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్‌-2025 యూజీ పరీక్షలో రాష్ట్రానికి చెందిన కాకర్ల జీవన్‌ సాయికుమార్‌ జాతీయ స్థాయిలో 18వ ర్యాంకు సాధించాడు. తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాదిలోనే టాప్‌ ర్యాంకర్‌గా నిలిచాడు. ఈ సందర్భంగా జీవన్‌ సాయికుమార్‌తో ‘ఆంధ్రజ్యోతి’ ముఖాముఖి మాట్లాడగా.. తాను పరీక్షలకు ఎలా సిద్ధమయ్యాడు ? కుటుంబసభ్యుల నుంచి లభించిన ప్రోత్సాహం, భవిష్యత్తు ప్రణాళిక తదితర అంశాలను పంచుకున్నాడు.


వైద్య వృత్తిని ఎందుకు ఎంచుకున్నారు ?

నేను డాక్టర్‌ అవ్వాలన్నది మా అమ్మమ్మ కల. ఆమె నన్ను చాలా గారాబంగా పెంచారు. అప్పట్లో ఓసారి ఆమె అనారోగ్యానికి గురవ్వగా.. ‘‘నువ్వు డాక్టరయితే నాకు వైద్యం చేశేవాడివిరా’’ అనేది. నా మూడున్నరేళ్ల వయసులోనే ఆమె చనిపోయింది. కానీ, నాతో అన్న మాటలు నా మనసులో బలంగా నాటుకుపోయాయి. అలా చిన్నప్పటి నుంచే డాక్టర్‌ కావాలని అనుకుంటున్నా.

ఏ కాలేజీలో చేరతారు?

ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చదవాలనుకుంటున్నాను. నాకు వచ్చిన ర్యాంకుతో ఆ కాలేజీలో సీటు వస్తుందనే నమ్మకముంది.


మీ విజయం వెనుక ఎవరెవరి ప్రోత్సాహం ఉంది?

మా అమ్మా, నాన్న, నాకు పాఠాలు చెప్పిన అధ్యాపకులు అంతా నన్ను ప్రోత్సహించారు. ‘నీ ప్రయత్నం బలంగా చెయ్‌ ఫలితం కోసం ఆలోచించకు. ఆందోళన పెట్టుకోకుండా చదువు’ అని చెబుతూ నాన్న నిత్యం ప్రోత్సహించేవారు. అమ్మ నాకు కావలసినవన్నీ ఏర్పాటు చేసేది. అధ్యాపకులు మార్కులు ఎలా తెచ్చుకోవాలనే మెళకువలు చెప్పేవారు. మాక్‌ టెస్టుల్లో ఏమైనా తప్పులు దొర్లితే అవి పునరావృతం కాకుండా జాగ్రత్తపడేవాడిని.

రోజు ఎంత సమయం చదివేవాడివి?

కాలేజీ, నీట్‌ శిక్షణ కేంద్రంలో కలిపి రోజుకు 14 గంటలు చదివేవాడిని. అయితే ఎంతసేపు చదివామన్నది కాదు, ఎంత మనసుపెట్టి చదివామనేదే ముఖ్యం.


ఈ ఫలితం ఊహించారా ?

నేను ఒత్తిడికి గురైన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అయితే కీ చూశాక నాకు మంచి ర్యాంకు వస్తుందని కచ్చితంగా అనుకున్నాను. అయితే దక్షిణాదిలోనే మొదటి ర్యాంకు రావడం చాలా ఆనందంగా ఉంది.

మాటలు రావడం లేదు..

మాది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా. నేను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో కంప్యూటర్‌ సైన్స్‌ బోధిస్తున్నాను. నా భార్య గృహిణి. పరీక్ష ముందురోజు మా అబ్బాయి చాలా ఒత్తిడికి గురయ్యాడు. శక్తివంచన లేకుండా ప్రయత్నించావు. అనుకున్న ర్యాంకు వస్తే సంతోషం. ఒకవేళ ఇది మిస్‌ అయితే నీకోసం వేరే రంగం ఎదురు చూస్తుందని అనుకోవాలని చెప్పా.. ధైర్యంగా వెళ్లి పరీక్ష రాసి వచ్చాడు. కీ చూసుకున్నాక తప్పకుండా ర్యాంకు వస్తుందని చెప్పినపుడు మా కుటుంబం చాలా సంతోషించింది. ఈరోజు ఫలితాలు చూశాక ఇక చెప్పడానికి మాటలు రావడం లేదు.

- గంగాధర నాగ కుమార్‌ (సాయికుమార్‌ తండ్రి)


ఈ వార్తలు కూడా చదవండి..

ఆస్ట్రేలియాను చిత్తు చేసి.. 27 ఏళ్ల తర్వాత చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా..


మీ పర్సనల్ లోన్ ఇలా తీర్చుకోండి.. మీ ఖర్చులు తగ్గించుకోండి..

For National News And Telugu News

Updated Date - Jun 15 , 2025 | 04:02 AM