Share News

Congress: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 03:50 AM

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను స్వాగతిస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Congress: బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను ఆమోదించాలి

రేవంత్‌ ప్రయత్నాలకు అండగా నిలుస్తాం: కనిమొళి.. అంబేడ్కర్‌, కరుణానిధి సరసన రేవంత్‌రెడ్డి: సుప్రియ

న్యూఢిల్లీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన బీసీ రిజర్వేషన్ల బిల్లులను స్వాగతిస్తున్నట్లు ఇండియా కూటమి నేతలు తెలిపారు. తెలంగాణలో బీసీ ఉద్యమానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లులను తక్షణమే ఆమోదించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. తరతరాలుగా వెనుకబడిన వర్గాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. తమిళినాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తు చేస్తూ.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం సీఎం రేవంత్‌ చేస్తున్న ప్రయత్నాలకు డీఎంకే అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఒక కార్యకర్త నుంచి ముఖ్యమంత్రి స్థాయి దాకా ఎదిగిన రేవంత్‌ రెడ్డి.. పీడితులు, తాడితుల తరఫున పోరాడుతున్నారని ఎన్సీపీ(ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కొనియాడారు. దేశంలో రిజర్వేషన్లు కల్పించిన అంబేడ్కర్‌, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లకు కారణమైన కరుణానిధి పేర్ల పక్కన రేవంత్‌రెడ్డి పేరును సువర్ణాక్షరాలతో లిఖించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.


బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్‌రెడ్డి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. ఎవరు ఎంతో.. వారికి అంత దక్కాల్సిందే... అనేది కాంగ్రెస్‌ సంకల్పమని కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పేర్కొన్నారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు ఓబీసీల రిజర్వేషన్లకు మద్దతు ఇస్తున్నాయని గుర్తు చేశారు. రిజర్వేషన్ల సాధన కోసం యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. రేవంత్‌ రెడ్డి ఇంత సాహసం చేస్తారని ఊహించలేదని, రెడ్డి వర్గానికి చెందిన వారైనా బీసీల కోసం గళమెత్తారని కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ పేర్కొన్నారు. ఈ తత్వం కాంగ్రెస్‌ డీఎన్‌ఏలోనే ఉందని, ఒక వరుసలోని చివరి వ్యక్తికి కూడా అన్నీ అందించాలన్నదే తమ పార్టీ ధర్మమని చెప్పారు. తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌రెడ్డి సాహసోపేతమైన అడుగు వేశారని, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కులగణన చేపట్టారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ చేపట్టిన సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం బిల్లులు తీసుకురావడం దేశానికే ఆదర్శమని కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ మోడల్‌ను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ఎస్పీ ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌ పేర్కొన్నారు. బీజేపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా బీసీ బిల్లులను ఆమోదించాలని డిమాండ్‌ చేశారు. బీసీ రిజర్వేషన్లు.. ఏ కులానికో, వర్గానికో వ్యతిరేకం కాదని బిహార్‌ స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్‌ పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం రాహుల్‌గాంధీ నిరంతరం తపిస్తుంటారని తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలు

ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ కీలక వ్యాఖ్యలు

Updated Date - Aug 07 , 2025 | 03:51 AM