Income Tax Raids: డీఎస్‌ఆర్ గ్రూపు సంస్థల్లో ఐటీ సోదాలు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:15 AM
ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎ్‌సఆర్ గ్రూపు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులో 27 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
హైదరాబాద్, బెంగళూరులో ఏకకాలంలో.. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో కూడా..
ఫ్లాట్ల అమ్మకాల్లో అక్రమాలు
జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో..
హైదరాబాద్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ డీఎ్‌సఆర్ గ్రూపు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖాధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. హైదరాబాద్, బెంగళూరులో 27 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి డీఎ్‌సఆర్ గ్రూపుతో వ్యాపార భాగస్వామ్యం ఉందన్న నేపథ్యంలో ఆయన ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. డీఎ్‌సఆర్ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, డీఎ్‌సఆర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, డీఎ్‌సఆర్ కన్‌స్ట్రక్షన్స్, డీఎ్‌సఆర్ ప్రైమ్, డీఎ్‌సఆర్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ కార్యాలయాల్లో జరిగిన ఈ సోదాల్లో అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎ్‌సఆర్ కంపెనీల డైరెక్టర్ల ఇళ్లు, ప్రాజెక్టు సైట్లలో కూడా సోదాలు చేశారు. డీఎ్‌సఆర్ స్కై వన్, డీఎ్‌సఆర్ వరల్డ్ వెంచర్లలో అమ్మకాలకు సంబంధించి పలు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. వీటిలో చదరపు అడుగు రూ.12 వేల నుంచి రూ.13 వేలకు అమ్మగా, రిజిస్ట్రేషన్లు మాత్రం రూ.7 వేల చొప్పునే జరిగాయన్న ఫిర్యాదులపై ఐటీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. డీఎ్‌సఆర్ గ్రూపు సంస్థలు ఒక్కో చదరపు అడుగుకు ఐదారు వేలు నగదు రూపంలో సేకరించాయన్న ఆరోపణలకు సంబంధించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి సైతం డీఎ్‌సఆర్ గ్రూపు అమ్మకాలకు సంబంధించి వివరాలు సేకరించిన తర్వాతే ఐటీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. డీఎ్‌సఆర్ గ్రూపు ఎండీ దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డీ ప్రభాకర్ రెడ్డి, సీఈవో సత్యనారాయణ రెడ్డి తదితరుల ఇళ్లల్లోనూ సోదాలు నిర్వహించారు. పన్ను ఎగవేతకు సంబంధించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐటీ అధికారులు శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్ కంపెనీలో కూడా సోదాలు నిర్వహించారు. ఈ సంస్థ భాగస్వామి అయిన వెంకట కృష్ణారెడ్డికి డీఎ్‌సఆర్ సంస్థతో వ్యాపార సంబంధాలు ఉన్న నేపథ్యంలో సోదాలు చర్చనీయాంశమయ్యాయి. గతంలో ఏపీ మద్యం కుంభకోణంలో శ్రీనివాస కన్‌స్ట్రక్షన్స్‌పై ఆరోపణలు వచ్చాయి. రాజ్ కసిరెడ్డి.. ఈ సంస్థ ద్వారా ఏపీ లిక్కర్ స్కాంలో వచ్చిన డబ్బును దారి మళ్లించినట్టు సీఐడీ ఇప్పటికే గుర్తించింది. ఈ క్రమంలో ఐటీ సోదాలు మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..