Veeraraghava Reddy: రంగరాజన్‌పై దాడి కేసు.. కోర్టుకు వీరరాఘవరెడ్డి
ABN , Publish Date - Feb 21 , 2025 | 04:40 PM
Veeraraghava Reddy: అర్చకులు రంగరాజన్‌పై దాడి కేసులో అరెస్ట్ అయిన వీరరాఘవరెడ్డి కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
హైదరాబాద్, ఫిబ్రవరి 21: చిలుకూరు దేవాలయం ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై (Chilkuru temple priest Rangarajan) దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డిని పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో (Rajendranagar Court) హాజరుపరిచారు. మూడు రోజులపాటు కస్టడీలో వీర రాఘవరెడ్డిని పోలీసులు విచారించారు. కస్టడీ ముగియడంతో రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరిచి ఆ తరువాత వీర రాఘవరెడ్డిని చంచల్‌గూడా జైలుకు తరలించనున్నారు. వీర రాఘవరెడ్డి తెలుగు రాష్ట్రాల్లోని ఆరు ప్రధాన ఆలయాలకు వెళ్లినట్టు పోలీసులు గుర్తించారు. పలుచోట్ల రామరాజ్య స్థాపన కోసం ఫండ్స్ వసూలు చేసినట్టు విచారణలో బయటపడింది.
వీర రాఘవరెడ్డికి సంబంధించిన బ్యాంక్ స్టేట్‌మెంట్ కోసం బ్యాంక్‌కు మొయినాబాద్ పోలీసులు లేఖ రాశారు. ఎప్పటి నుంచి విరాళాలు సేకరించారనే దానిపై వివరాలు రాబట్టారు పోలీసులు. ప్రస్తుతం వీర రాఘవరెడ్డి బ్యాంక్ అకౌంట్‌లో 20,000 మాత్రమే ఉన్నట్టు గుర్తించారు. ఈ కేసులో మొత్తం 20 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. మరో నలుగురు పరారీలో ఉండగా... వారి కోసం మొయినాబాద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
మూడు రోజుల పాటు వీరరాఘవరెడ్డిని పోలీసులు విచారించిన సమయంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రామరాజ్య స్థాపన కోసం ఫండ్స్ ఇవ్వాలంటూ పలు ప్రాంతాల్లో ఒత్తిళ్లకు గురిచేసినట్లు పోలీసులు గుర్తించారు. బ్యాంక్ స్టేట్‌మెంట్లను వీరరాఘవరెడ్డి ముందు పెట్టి మరీ పోలీసులు విచారించారు. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాల్లో డబ్బులు వసూలు చేశారనే అంశానికి సంబంధించి ఆరా తీశారు. ఎప్పటి నుంచి విరాళాలు సేకరించారు అనే దానిపై కూడా కాప్స్ విచారించారు. అతడి బ్యాంకులో కేవలం 20 వేలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు... అరెస్ట్ కాక ముందే నగదు మొత్తాన్ని డ్రా చేసినట్లు అనుమానిస్తున్నారు.
వీరరాఘవరెడ్డి ఓ వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి ఏపీ, తెలంగాణలో చాలా మందిని ఆకర్షించినట్లు తెలుస్తోంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా రామరాజ్యం పేరుతో వారందరికీ పదువులు ఇచ్చి రిక్ర్యూట్ చేయాలని ఆదేశాలిచ్చి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే చిలుకూరు బాలాజీ ఆలయ అర్చుకుడిపై కూడా దాడి చేసినట్లు సమాచారం. కస్టడీలో అనేక విషయాలను రాబట్టిన పోలీసులు అనంతరం వీరరాఘవరెడ్డిని రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపర్చారు.
ఇవి కూడా చదవండి...
2047 నాటికి అధిక ఆదాయ దేశంగా భారత్
Read Latest Telangana News And Telugu News