Uttam Kumar Reddy: ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN , Publish Date - Nov 18 , 2025 | 07:59 PM
గోదావరి మిగులు జలాలపై ఎవరికీ హక్కు లేదని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కుండ బద్దలు కొట్టారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ పిలిచిన టెండర్లు రద్దు చేసినా మరొక పేరుతో ఏపీ ప్రాజెక్టును చేపట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ, నవంబర్ 18: జలశక్తి మంత్రిత్వశాఖలో తెలంగాణకు చెందిన పలు ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయని.. వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం మంత్రి ఉత్తమ్ విలేకర్లతో మాట్లాడుతూ.. పాలమూరు - రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కి 90 టీఎంసీల నీరు కేటాయించాలని గతంలో కోరామని చెప్పారు. తొలి దశలో మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టుల కింద ఉన్న 45 టీఎంసీలకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. సమ్మక్క - సాగర్ ప్రాజెక్టుపై లేవనెత్తిన అభ్యంతరాలను ఇప్పటికి నివృత్తి చేశామని.. అందుకు వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. సమ్మక్క - సారక్క ప్రాజెక్ట్‌కు గోదావరి నీటి కేటాయింపులు చేయాలనీ అడిగినట్లు చెప్పారు. సెంట్రల్ వాటర్ కమిషన్‌ను సమ్మక్క - సారక్కకు అనుమతులు ఇవ్వాలని కోరామన్నారు. బ్రిజేష్ ట్రిబ్యునల్, కృష్ణా ట్రిబ్యునల్ 2 ఏపీ ,తెలంగాణ మధ్య 811 టీఎంసీలు కేటాయించారని.. కానీ అది ముందుకు సాగడం లేదని కేంద్ర మంత్రికి వివరించినట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా జలాల పునర్ పంపిణీపై ట్రిబ్యునల్ 2 విచారణ త్వరగా పూర్తి అయ్యేలా కేంద్రం చొరవ చూపాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు.
గోదావరి మిగులు జలాలపై ఎవరికి హక్కు లేదని కుండ బద్దలు కొట్టారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టు డీపీఆర్ టెండర్లు రద్దు చేసినా మరొక పేరుతో ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ చేపట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం - బనకచర్లకు ఫ్రీ ఫ్రిజిబులిటి రిపోర్ట్‌ను ఏపీ ప్రభుత్వం సబ్మిట్ చేసిందని.. తాము ఫిర్యాదు చేయడంతో దాని టెండర్ రద్దు చేశారని గుర్తు చేశారు. బనకచర్ల ప్రాజెక్టు పూర్తిగా ఇల్లీగల్.. తమ ఫిర్యాదుతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందన్నారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు సైతం వ్యతిరేకిస్తున్నాయని గుర్తు చేశారు. పోలవరం - బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని తాము కోరామన్నారు. ఆల్మట్టి ఎత్తును పెంచేందుకు కర్ణాటక ప్రభుత్వం భూసేకరణ చేపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని దాన్ని అడ్డుకోవాలన్నారు.
ఆల్మట్టి ఎత్తు 512 అడుగులకు మించి నిర్మాణం చేయకూడదని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఆల్మట్టి డ్యాం హైట్ పెంచితే తెలంగాణ ప్రజల ప్రయోజనాలు దెబ్బ తింటాయన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంచకుండా కర్ణాటకను కట్టడి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ఉత్తమ్ సూచించారు. అందుకు సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు అందజేశామని వివరించారు. 20 నెలల క్రితం రాష్ట్రంలో చేపట్టిన ఇరిగేషన్ పనులకు నిధులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌ను కోరామన్నారు. కేంద్ర జల శక్తి సూచన మేరకు.. దేవాదుల ప్రాజెక్టు మినహా అన్ని ప్రాజెక్టులు ఆపేశామని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ నుంచి ప్రాజెక్టులకు పెట్టుబడుల అనుమతులు ఇప్పించాలని కోరామన్నారు.
PMKSY పథకం కింద తెలంగాణ రాష్ట్రంలో చేపట్టే పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధులు ఇవ్వాలని కొన్ని ప్రతిపాదనలు చేశామని తెలిపారు. సాంకేతికంగా, ఆర్థికంగా నాలుగు ప్రాజెక్టులు అనుకూలంగా ఉన్నాయన్నారు. ముక్తేశ్వర్ చిన్న (కాళేశ్వరం ), చనాకా కొరాట బ్యారేజ్ కెనాల్, మోదీ కుంట వాగు ప్రాజెక్టు, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు ఆర్థిక అనుమతులు మంజూరు కావాల్సి ఉందన్నారు. తెలంగాణ, ఏపీ విభజన చట్టం ప్రకారం krmb బోర్డుకు అధికారం ఇచ్చారని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. టెలీమెట్రి పెట్టాలని కేంద్రాన్ని కోరామన్నారు. దీనిలో కొంత పురోగతి సాధించినట్లు చెప్పారు. తొలి దశలో 18 టెలిమెట్రీలు పూర్తయ్యాయని చెప్పారు. రెండో దశ కింద 9 టెలిమెట్రీలు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. మూడో దశ కింద మరో 11 టెలీమెట్రిలు ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. రెండు, మూడు దశల్లో కేఆర్‌బీఏంకి ఆదేశాలు ఇచ్చి టెలీమెట్రి పెట్టాలని కేంద్ర జల శక్తి మంత్రిని కోరినట్లు ఆయన వివరించారు. దీని వల్ల అంతర్ రాష్ట్రాల జల వివాదాలు జరగకుండా ఉంటాయని మంత్రి ఉత్తమ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అర్బన్ నక్సల్స్‌పై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
నిర్దేశించిన లక్ష్యం కంటే ముందే పూర్తికానున్న ఆపరేషన్ కగార్
For More AP News And Telugu News