Share News

Bandi Sanjay Warning: మీ పథకాలకు ఏ పేరైనా పెట్టుకోండి.. వాటి జోలికి వస్తే.. జాగ్రత్త

ABN , Publish Date - Jan 27 , 2025 | 01:40 PM

Bandi Sanjay: రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు.

Bandi Sanjay Warning: మీ పథకాలకు ఏ పేరైనా పెట్టుకోండి.. వాటి జోలికి వస్తే.. జాగ్రత్త
Union Minister Bandi Sanjay

హైదరాబాద్, జనవరి 27: కేంద్రమంత్రి బండి సంజయ్ (Union Minister Bandi Sanjay) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా కేంద్రమే నేరుగా ప్రజలకే అందిస్తుందన్నారు. పరిస్థితి అంత వరకు తీసుకురావొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాల అమలు విషయంలో పేదలకు ఎట్టి పరిస్థితిల్లోనూ తాము అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. ప్రజలందరికీ ఉచితంగా బియ్యం కేంద్రమే ఇస్తోంది కదా... గరీబ్ కళ్యాణ్ యోజన అని పేరు పెడితే తప్పేంది? ప్రధాని ఫోటో ఎందుకు పెట్టరు అని ప్రశ్నించారు.


రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఖర్చయ్యే సంక్షేమ పథకాలకు ఎవరి పేరు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని.. కాంగ్రెస్‌కు నచ్చితే ఒసామా బిన్ లాడెన్, దావూద్ ఇబ్రహీం పేర్లు పెట్టుకున్నా అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. అభివృద్ధి విషయంలో కేంద్రం పూర్తిగా సహకరిస్తోందన్నారు. గత 10 ఏళ్లలో రూ.12 లక్షల కోట్లకుపైగా కేంద్రం ఖర్చు చేసిందని తెలిపారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే అని స్పష్టం చేశారు. రైతు భరోసా, కమ్యూనిటీ హాల్, స్మశాన వాటిక, వీధి దీపాలు, రోడ్ల పైసలన్నీ కేంద్ర ప్రభుత్వానివే అని చెప్పుకొచ్చారు. ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేనేలేదన్నారు.

జగన్ కేసులపై సుప్రీం తాజా నిర్ణయం ఇదీ..


ఇంత దుర్మార్గమా?

‘‘మండలానికి ఒక గ్రామంలోనే నాలుగు పథకాలకు ఎంపిక చేసి లబ్ది చేయడమేంది? మిగిలిన గ్రామాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓట్లేయలేదా? రాష్ట్ర ప్రజలకు ఇంత దుర్మార్గంగా చీటింగ్ చేస్తారా? రాష్ట్ర ప్రజలందరికీ లబ్ది చేకూరుస్తామని చెప్పి మండలానికి ఒక గ్రామానికి లబ్ది చేకూర్చడం నీచం. కాంగ్రెస్ నేతల జేబుల నుంచి రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఖర్చు చేస్తున్నారా? లేక పాకిస్తాన్..బంగ్లాదేశ్ నుంచి తెచ్చి ఖర్చు చేస్తున్నారా? ప్రజలు కట్టిన పన్నులతోనే కేంద్రమైనా, రాష్ట్రమైనా ఖర్చు చేస్తోంది కదా? గతంలో పీఎం ఆవాస్ యోజన పేరుతో 2 లక్షల 40 వేల ఇండ్లను కేంద్రం మంజూరు చేస్తే... కేసీఆర్ ఒక్క ఇల్లు కట్టకుండా ప్రజలను రోడ్డున పడేసింది నిజం కాదా? డబుల్ బెడ్రూం ఇండ్ల పేరుతో ప్రజలను మభ్యపెట్టి మోసం చేసింది నిజం కాదా?’’ అంటూ ప్రశ్నలు కురిపించారు.


గద్దర్‌కు ఎట్లా ఇస్తారు..

పద్మ అవార్డుల జాబితాను పంపేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి పంపాలని హితవుపలికారు. గద్దర్‌కు ఎట్లా పద్మ అవార్డులిస్తామని ప్రశ్నించారు. ఎంత మంది బీజేపీ కార్యకర్తలను మట్టు పెట్టారో తెలియదా అని అన్నారు. వందల మంది బీజేపీ కార్యకర్తలు నమ్మిన సిద్ధాంతం కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన చేస్తే... నక్సలైట్లతో కలిసి హత్య చేయించిన వ్యక్తి గద్దర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సెంటిమెంట్‌తో ఎవరు లాభపడ్డారో... ఎవరు బలైపోయారో ప్రజలందరికీ అర్ధమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు.

Updated Date - Jan 27 , 2025 | 01:41 PM