JaggaReddy: రూ. వెయ్యి కోట్లు గంటల్లో పంచేస్తా
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:14 PM
బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ గాంధీ భవన్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. వీరి తీరును ఎండగట్టారు.
హైదరాబాద్, ఆగస్ట్ 08: బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. శుక్రవారం నాంపల్లిలోని గాంధీభవన్‌లో జగ్గారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. నువ్వు నా క్యారెక్టర్ అంచనా వేయలేవంటూ కొత్త ప్రభాకర్ రెడ్డికి సూచించారు. రాష్ట్రంలో ఎవర్ని అడిగినా నా క్యారెక్టర్ గురించి చెబుతారన్నారు. నా క్యారెక్టర్‌కి, ప్రభాకర్ రెడ్డి క్యారెక్టర్‌కి చాలా తేడా ఉంటుందని పేర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఉన్నంత ఆస్తి నా వద్ద ఉంటే ప్రజలకి ఎప్పుడో పంచేసే వాడినని తెలిపారు.
మా అమ్మనాన్న ఇచ్చిన ఆస్తి..
పంచే గుణం మా అమ్మనాన్న నాకు ఇచ్చిన ఆస్తి అని చెప్పారు. భవిష్యత్తులో నేను రూ. వేల కోట్లు సంపాదించినా వాటిని ప్రజలకే పంచుతానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. నా ఆస్తి నా పిల్లల కోసం కాదని.. ప్రజల కోసమని తెలిపారు. రూ. 1000 కోట్లు కొన్ని గంటల్లోనే పంచేస్తానన్నారు. ప్రభాకర్ రెడ్డికి ఎలా పంచాలో కూడా తెలియదని ఆక్షేపించారు. నేను ఎలాంటి వాడినో కేసీఆర్, హరీష్ రావుని అడిగి తెలుసుకోవాలంటూ ప్రభాకర్ రెడ్డికి సూచించారు. కొత్త ప్రభాకర్ రెడ్డి.. నీవు మగాడవయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభాకర్ రెడ్డిది నా స్థాయి కాదన్నారు. కొన్ని విషయాల్లో ఎమోషనల్ కావ్వడం నా బలహీనత అని తెలిపారు. ప్రజల సమస్య వింటే వాళ్ళ కంటే ముందు నాకే ఏడుపు వస్తుందన్నారు. నా చుట్టూ పేదలు ఉంటారని.. నా వద్దకు క్యాన్సర్ పేషెంట్లు సైతం వస్తారని చెప్పారు.
ఆ ఫ్యామిలీకి ఆ టైటిలే కరెక్ట్‌గా..
తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ దోచుకున్నారని మండిపడ్డారు. ఎంత దొరికితే అంత దోచుకున్నారని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే అంచనా వేయలేనంతగా రాష్ట్రాన్ని దోచి పడేశారని తెలిపారు. అవినీతి ఎలా చేయాలో అనే యూనివర్సిటీకి కేసీఆర్ ప్రొఫెసర్ అని అభివర్ణించారు. రాష్ట్ర ప్రజల ఖజానా దోచుకోవడంలో కేసీఆర్ ఫ్యామిలీ దిట్ట అని పేర్కొన్నారు.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని.. సుద్దపూసలాగా.. నంగనాచి మాటలు మాట్లాడుతున్నారని కేసీఆర్ ఫ్యామిలీపై నిప్పులు చెరిగారు. అలీబాబా నలభై దొంగలు అనే టైటిల్ కేసీఆర్ ఫ్యామిలీకి కరెక్ట్ సెట్ అవుతుందని స్పష్టం చేశారు. వారు స్థాపించిన పార్టీలోని కొత్త ప్రభాకర్ సుద్దపూసలాగా మాట్లాడుతున్నాడని చెప్పారు. ప్రజలకి ఏమైనా చేద్దామంటే ఖజానాలో మిగుల్చకుండా దోచుకొని పోయారంటూ కేసీఆర్ ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేనేమైనా ప్యాకేజీల లీడర్ నా?
నేనేమైనా ప్యాకేజీల లీడర్ నా అంటూ బీఆర్ఎస్ నేతలను ఈ సందర్భంగా జగ్గారెడ్డి సూటిగా ప్రశ్నించారు. నేనేమి బీ ఫారంలు కొనుకొని రాలేదని వ్యంగ్యంగా అన్నారు. దొంగతనాలు మీరు చేసి.. మాపై నిందలు వేస్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ మీలాగా ప్రైవేట్ కంపెనీనా? అని వారిని నిలదీశారు. ఇసుక దందాలలో మీరు సంపాదించింది ఎంత? అంటూ ఆ పార్టీ నేతలను ఆయన బల్లగుద్ది ప్రశ్నించారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని భూములు, చెరువులు కబ్జా చేసింది బీఆర్ఎస్ నాయకులేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కీలక పరిణామం.. బీజీపీలోకి గువ్వల బాలరాజు
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
For More Telangana News And Telugu News