Hyderabad: ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎస్సీ వర్గీకరణ ఏక సభ్య కమిషన్, క్యాబినెట్ సబ్ కమిటీ భేటీ..
ABN , Publish Date - Feb 03 , 2025 | 03:52 PM
తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11, 2024న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది.

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సమావేశం ప్రారంభమైంది. క్యాబినెట్ సబ్ కమిటీ, ఏకసభ్య కమిషన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్ మధ్య కీలక భేటీ మెుదలైంది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డితోపాటు కమిటీ వైస్ ఛైర్మన్ దామోదర్ రాజనర్సింహ, సభ్యుడు మంత్రి పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్యాబినెట్ సబ్ కమిటీకి ఎస్సీ వర్గీకరణ నివేదికను ఏక సభ్య కమిషన్ అందించనుంది. ఆగస్టు1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చింది.
ఈ మేరకు తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 11, 2024న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అఖ్తర్‌ను ఏకసభ్య కమిషన్‌గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల్లో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించింది. దీంతో అధ్యయనం పూర్తి చేసిన కమిషన్ నేడు ఎస్సీ వర్గీకరణపై క్యాబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు అందించనుంది. మంగళవారం జరిగే క్యాబినెట్ సమావేశంలో మంత్రిమండలి దృష్టికి ఈ రిపోర్టు రానుంది. మంగళవారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఆమోదించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
కాగా, తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ చేయాలంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ "వెయ్యి గొంతులు- లక్ష డప్పులు" కార్యక్రమాన్ని ఫిబ్రవరి 07న చేపట్టనున్నారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ మందకృష్ణ ఇప్పటికే డిమాండ్ చేశారు. దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసే మెుట్టమెుదటి రాష్ట్రం తెలంగాణనే అంటూ ముఖ్యమంత్రి చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని కోరారు. మంగళవారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
Gun Firing Case: రూ.333 కోట్లు.. వంద మంది యువతులే టార్గెట్.. వెలుగులోకి ప్రభాకర్ నేరాలు
Supreme Court: తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత కేసు.. సుప్రీంకు కేటీఆర్
Read Latest Telangana News And Telugu News