Share News

Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు

ABN , Publish Date - Nov 26 , 2025 | 06:51 PM

పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై జస్టిస్ మాధవి దేవి విచారణ జరిపి..రేపటికి వాయిదా వేశారు.

Panchayat Elections: పంచాయతీ రిజర్వేషన్లపై హైకోర్టును ఆశ్రయించిన గ్రామస్తులు

హైదరాబాద్, నవంబర్ 26: తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు బుధవారం హైకోర్టు‌ను ఆశ్రయించారు. బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ ఒకరు పిటిషన్ వేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలోని వెల్దండ తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. వార్డులన్నింటిని ఎస్సీ, ఎస్టీలకే కేటాయించారంటూ ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల కంటే బీసీల జనాభా అధికంగా ఉందంటూ ఇంకో పిటిషనర్ ఆరోపించారు.


సంగారెడ్డి జిల్లాలో పలు గ్రామాల్లో సరైన రిజర్వేషన్ల పాటించడం లేదంటూ ఆంధోల్ మండలం రామసానిపల్లికి చెందిన మాజీ సర్పంచు ఆగమయ్య పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీఓ 46 తీసుకొచ్చిందని పిటిషనర్ పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలు ఉన్నాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ బీసీలకు 117 సర్పంచు స్థానాలనే రిజర్వు చేశారని చెప్పారు.


సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 19 శాతమే ఉందని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్‌ను రద్దు చేసి మళ్లీ రిజర్వు చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ కోరారు. రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17శాతం రిజర్వేషన్లు వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ 46కు ఈ రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని మరో పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి.మాధవిదేవి బుధవారం విచారణ చేపట్టారు. తదపరి విచారణను రేపటికి అంటే.. గురువారానికి వాయిదా వేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

హార్ట్ ఎటాక్ బాధితులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్..

బీసీలకు మోసం జరుగుతుంటే.. బీఆర్ఎస్ నుంచి నో రియాక్షన్: కవిత

For More TG News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 07:29 PM