Share News

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్

ABN , Publish Date - Aug 26 , 2025 | 06:59 PM

మరికొన్ని రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా మంగళవారం కీలక నోటిఫికేషన్ విడుదల చేసింది.

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికల వేళ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్నికల కమిషన్
TGSEC

హైదరాబాద్, ఆగస్టు 26: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. అందులో భాగంగా మంగళవారం గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం పోలింగ్ కేంద్రాలు, తుది ఓటర్ల జాబితా విడుదలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆ క్రమంలో నోటిఫై చేయబడిన అన్ని గ్రామ పంచాయతీల్లో ఫొటోతో కూడిన ఓటర్ల జాబితాను తయారు చేసి ప్రచురించాలని జిల్లా పంచాయతీ అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గ్రామ పంచాయతీల ఓటర్ల జాబితా తయారీ, ప్రచురణ కోసం షెడ్యూల్ సైతం విడుదల చేసింది.


అయితే ఆగస్టు 28వ తేదీ లోపు గ్రామ పంచాయతీల ముసాయిదా ఓటర్ల జాబితా తయారీ చేసి గ్రామ పంచాయతీ, మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను ప్రదర్శించాలని జారీ చేసిన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. ఇక ఆ మరునాడే.. అంటే ఆగస్టు 29వ తేదీన ఎంపీడీవోల ద్వారా మండల స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 30వ తేదీన ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. అలాగే ఆగస్టు 31వ తేదీన జిల్లా పంచాయతీ అధికారి గ్రామ పంచాయతీల వార్డుల వారీగా ఫొటో ఓటర్ల తుది జాబితాలను ప్రచురణ చేస్తారని ఎన్నికల సంఘం తెలిపింది.


ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. గతంలో గడువు ముగిసినా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు తెలంగాణ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది.


2024, జనవరి 31వ తేదీతో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. దీంతో ఏడాదిన్నరగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడం లేదంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో పై విధంగా కోర్టు తీర్పు వెలువరించింది.


మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందింది. అనంతరం కేంద్రానికి పంపింది. దీనిపై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ బిల్లును అమోదించాలంటూ తెలంగాణలోని అధికార కాంగ్రెస్ పార్టీతోపాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా ఆందోళనలు చేపట్టిన విషయం విదితమే. ఇంకోవైపు ఈ బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీతోపాటు బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ఒకదానిపై ఒకటి విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నాయి.

WhatsApp Image 2025-08-26 at 6.11.54 PM.jpeg


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 26 , 2025 | 07:54 PM