Purchase of corn crop: రైతులకు శుభవార్త.. పంట కొనుగోలుపై మంత్రి తుమ్మల ప్రకటన
ABN , Publish Date - Oct 09 , 2025 | 07:35 PM
తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీపికబురు చెప్పారు. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి సుధీర్ఘంగా చర్చించారు.
హైదరాబాద్: తెలంగాణ రైతులకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తీపికబురు చెప్పారు. మొక్కజొన్న పంటను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. గురువారం సీఎం రేవంత్ రెడ్డితో మద్దతు ధరకు మొక్కజొన్న పంటను కొనుగోలు చేయడంపై మంత్రి సుధీర్ఘంగా చర్చించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్నకు మద్దతుధర ప్రకటించినా.. కొనుగోళ్లు చేసేందుకు ముందుకు రాలేదని చెప్పారు. దీంతో రైతులు నష్టపోకుండా ఉండేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనతో సర్కారే మార్క్ ఫెడ్ ద్వారా మొక్కజొన్న పంటను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గతేడాది కూడా ఇలాగే ఎలాంటి కొనుగోళ్లు జరపకపోయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే దాదాపు రూ.535 కోట్లు ఖర్చు పెట్టి జొన్న పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసిందని గుర్తుచేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6,24,544 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని మంత్రి వివరించారు. సాగు పరిస్థితులు వృద్ధి చెందడంతో సగటున ఎకరాకు 18.50 క్వింటల్ దిగుబడితో మొత్తం 11.56 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అవుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేసినట్టు చెప్పారు. ఈ పంటకాలంలో 8.66 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను కొనుగోలు చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసిందని పేర్కొన్నారు.
మార్కెట్లోకి సెప్టెంబర్ 3 వ వారం నుండే మొక్కజొన్న పంట అధికంగా రావడంతో ధరలు తగ్గిపోయాయని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ ధరలు కేంద్రం ప్రకటించిన ఎమ్ఎస్పీ (రూ.2,400/క్వింటల్) కన్నా రూ.441 తక్కువగా రూ. 1,959 ఉందని వివరించారు. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. 8.66 లక్షల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పంటను కొనుగోలుకు సర్కార్ పై రూ.2400 కోట్ల భారం పడుతుందని, అయినా రైతులకు ఎలాంటి నష్టం జరుగకుండా మద్ధతు ధర చెల్లించి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రైతు తాను పండించిన మొక్కజొన్న పంటను సమీపంలోని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Minister Ponnam Prabhakar: హైకోర్టు స్టే విధిస్తుందని అనుకోలేదు.. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు
BJP On Court Stay: కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను రాజకీయంగా వాడుకుంటోంది..