BC Reservation Bill: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఏం సంబంధం..?
ABN , Publish Date - Jul 11 , 2025 | 08:15 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర లేదన్నారు. అయినా ఆమె ఎందుకు ఇంత హడావుడి చేస్తుందో అర్థం కావడం లేదన్నారు.
న్యూఢిల్లీ, జులై 11: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు.. బీసీ బిల్లుకు ఏం సంబంధమని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ సందేహం వ్యక్తం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందడంపై ఆమె హడావుడి చేస్తుందంటూ మండిపడ్డారు. బీసీ బిల్లును సైతం కవిత హైజాక్ చేస్తుందని ఆరోపించారు. అయినా ఈ బిల్లు ఆమోదం పొందడంలో నీ పాత్ర ఏమిటంటూ కల్వకుంట్ల కవితను ఈ సందర్భంగా ఆయన సూటిగా ప్రశ్నించారు. బీసీలపై ముసలి కన్నీరు కార్చడం మానేయాలంటూ ఆమెకు ఆది శ్రీనివాస్ హితవు పలికారు.
లేని రంగులు పూసుకుంటే ప్రజలు నమ్ముతారనేది వారి భ్రమని వ్యంగ్యంగా అన్నారు. కవిత మై డియర్ డాడీ అంటూ ఒక లేఖ రాసింది.. డాడీ మీరు ఇంటికి పరిమితం అయ్యారని కవిత అంటుందని ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ గుర్తు చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీ పర్యటనలో ఉన్న ఆది శ్రీనివాస్ శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆమోదం పొందడం ద్వారా బీసీలు అందరూ సంబరపడి పండగ చేసుకుంటుంటే కవిత ఏదో కష్టపడినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
రిజర్వేషన్ బిల్లు కేబినెట్ ఆమోదం పొందడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణన జరిగిందని గుర్తు చేశారు. ఆర్డినెన్స్ తీసుకు రావడం బీసీల విజయమన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌లోని బీసీ నేతలంతా.. కాంగ్రెస్ పార్టీని అభినందించాలని ఈ సందర్భంగా వారికి సూచించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధితో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని వివరించారు. సీఎం రేవంత్ రెడ్డితోపాటు ఆయన మంత్రి వర్గం కష్ట పడుతుందన్నారు.
ప్రతిపక్ష నేతగా ఉండి కూడా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని గతంలో ఇచ్చిన హామీని కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం నెరవేరుస్తుందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డికి బీసీ సంఘాలన్నీ మద్దతుగా ఉంటాయని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన బిల్లు.. కేబినెట్‌లో ఆమోదం పొందిన జులై 10వ తేదీ సువర్ణ అక్షరాలతో లిఖించదగిన రోజు అని ఆది శ్రీనివాస్ అభివర్ణించారు.
అలాగే రాష్ట్రంలో శాస్త్రీయంగా కుల గణన జరిగిందన్నారు. బీసీ బిడ్డ కాకపోయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఆ యా వర్గాల అభ్యున్నతి కోసం పోరాడుతున్నారని ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి బీసీ క్యాంపెనర్‌గా పని చేస్తున్నారన్నారు. ఈ బిల్లును అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి సైతం పంపించామని గుర్తు చేశారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఉంటే.. దానిని 21 శాతానికి దింపిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే చెల్లిందని ప్రభుత్వ వీప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!
అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు
For Telangana News And Telugu News