Delimitation Issue: ఆ అంశంపై తొలిసారి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీజేపీకి గట్టి కౌంటర్..
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:51 PM
డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతోపాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకూ నష్టం జరగుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బిహార్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ఆయన చెప్పారు.

ఢిల్లీ: దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన డీలిమిటేషన్ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. డీలిమిటేషన్‌పై చర్చ జరిపేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. దక్షిణాదిలో ఏ ఒక్క రాష్ట్రంలోనూ బీజేపీ నేరుగా అధికారంలో లేదని, అందుకే ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ అంశాన్ని తెరపైకి తెచ్చినట్లు ముఖ్యమంత్రి ఆరోపించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఇండియా టుడే నిర్వహించిన కాంక్లేవ్‌లో తెలంగాణ సీఎం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. "డీలిమిటేషన్‌కు దక్షిణాది రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వినిపిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడమే లక్ష్యంగా మోదీ సర్కార్ డీలిమిటేషన్‌కు సిద్ధమవుతోంది. దక్షిణాదిలో బీజేపీకి సరైన ప్రాతినిధ్యం లేదు. ఎన్టీయే మూడోసారి అధికారం చేపట్టినా గెలిచిన 240 సీట్లలో దక్షిణాది నుంచి కేవలం 29 స్థానాలే దక్కించుకుంది. అందుకే నియోజకవర్గాల పునర్ విభజన చేయాలని భావిస్తోంది. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణ సమక్రంగా అమలు చేశాయి. "మేమిద్దరం మనకిద్దరు" అనే నినాదం గతంలో కేంద్రం తెచ్చింది. దానికి కట్టుబడి ఉండడం వల్లే దక్షిణాదిన జనాభా తగ్గింది. 30 ఏళ్లపాటు డీలిమిటేషన్ అమలు చేయకుండా ఉంటే దక్షిణ భారతదేశ సత్తా ఏంటో చూపిస్తాం.
30 ఏళ్ల తర్వాత మాత్రమే డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. అప్పుడు ఈ ప్రాంతాల్లో జనాభా ఎలా పెరుగుతుందో తెలుస్తుంది. ఇప్పుడు డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలతోపాటు పంజాబ్ వంటి రాష్ట్రాలకూ నష్టం జరుగుతుంది. బిహార్, మధ్యప్రదేశ్, యూపీ, రాజస్థాన్ రాష్ట్రాలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ డీలిమిటేషన్ జరిగితే 1971 నాటి జనాభా లెక్కల ఆధారంగానే చేయాలి. హిందీని బలవంతంగా రుద్దడాన్ని మేం వ్యతిరేకిస్తాం. హైదరాబాదులో ఒలంపిక్ క్రీడలు నిర్వహించడానికి అవసరమైన మౌలిక వసతులున్నాయి. స్పోర్ట్స్‌కు అన్ని విధాలా తెలంగాణ అనుకూలంగా ఉంది.
దేశానికి వచ్చే పెట్టుబడులన్నీ గుజరాత్ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ తరలించుకుపోతున్నారు. ఇదెక్కడి న్యాయం?. ఉచిత పథకాలపైనా దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. తెలంగాణ ఏర్పాటు అయినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పు ఉంటే.. కేసీఆర్ హయాంలో అది రూ.7 లక్షల కోట్లకు పెరిగింది. మేము గ్యారెంటీలు ఇచ్చినప్పుడు రాష్ట్రానికి ఇంత అప్పు ఉందని తెలియదు. నెలకు రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తే.. అందులో రూ.13 వేల కోట్లు జీతాలు, అప్పులు చెల్లించడానికే సరిపోతోంది. మిగిలిన రూ.5 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మౌలిక వసతుల ప్రాజెక్టులపై కనీసం రూ.500 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోతున్నామని" చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Tenth Class Exams: పదో తరగతి విద్యార్థులకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్..
Mumbai: భార్య వేధింపులకు మరో టెకీ సూసైడ్.. అతను రాసిన లెటర్ చూస్తే కన్నీళ్లు ఆగవు..