CM Reacts On Telugu IPS: ఐపీఎస్ ఆత్మహత్య.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Oct 11 , 2025 | 06:37 PM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్య చేసుకోవడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి తన సానుభూతి తెలిపారు.
హైదరాబాద్, అక్టోబర్ 11: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన హర్యానా కేడర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ వై.పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అణగారిన వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కుల ఉన్మాదానికి ఈ ఐపీఎస్ అధికారి బలవన్మరణం ఒక ఉదాహరణ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. అడిషనల్ డీజీపీ స్థాయి అధికారిని కులం పేరుతో వేధించడం చూస్తే.. సామాన్య ప్రజల దయనీయ జీవన పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం తీవ్ర ఆందోళనకరమని రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. అణచివేతకు గురైన వర్గాల పట్ల చూపిస్తున్న ద్వేషం.. సమాజాన్ని విషపూరితం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా అవమానకర సంఘటనల వల్ల రాజ్యాంగం, సమానత్వంతోపాటు న్యాయంపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందన్నారు.
అణగారిన వర్గాలపై ఈ తరహా దాడులను ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఘటనపై దేశంతోపాటు ప్రజలంతా ఆలోచించాలన్నారు. మృతుని కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.కోటి నజరానా..
రాహుల్‌కు నోబెల్ శాంతి బహుమతి..!: కాంగ్రెస్ నేత
Read Latest TG News and Telugu News