Telangana Assembly: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు.. అసెంబ్లీలో దుమారం
ABN , Publish Date - Dec 29 , 2025 | 01:04 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ మాదిరిగానే తనుగుల చెక్ డ్యాంను బాంబు పెట్టి పేల్చారని ఆయన ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 29: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీలో తీవ్ర దుమారం రేపాయి. మేడిగడ్డ ప్రాజెక్ట్ మాదిరిగానే తనుగుల చెక్ డ్యాంను బాంబులు పెట్టి పేల్చేశారంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. ఈ విమర్శతో అసెంబ్లీలో అలజడి రేగింది. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చారని ఆరోపణలు చేయడం ఏమిటంటూ కౌశిక్ రెడ్డిపై కాంగ్రెస్ సభ్యులు ఎదురుదాడికి దిగారు. రికార్డుల నుంచి ఆ పదాలు తొలగించాలంటూ స్పీకర్‌ను కాంగ్రెస్ సభ్యుడు నాగరాజు కోరారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
2023 ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దీనికి కొన్ని నెలల ముందు లక్షల కోట్ల రూపాయిలు ప్రజాధనం వెచ్చించి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్‌లోని పలు పిల్లర్లు కుంగాయి. ఈ అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రూ.లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపానికి కారణం నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది.
అంతేకాకుండా తాము అధికారంలోకి వస్తే.. దీనిపై న్యాయ విచారణ చేపడతామంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఓటరు పట్టం కట్టాడు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దాదాపు రెండేళ్ల పాటు విచారించిన ఈ కమిషన్.. తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. అయితే మేడిగడ్డ పిల్లర్లు కృంగడానికి బాంబుతో పేల్చడమే కారణమంటూ బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఈ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
హంపి, అర్జున్‌లకు సీఎం చంద్రబాబు అభినందనలు
చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి
For TG News and Telugu News