Share News

Phone Tapping Case: ప్రభాకర్ రావుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

ABN , Publish Date - Dec 11 , 2025 | 02:59 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ఆయనకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Phone Tapping Case: ప్రభాకర్ రావుకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, డిసెంబర్ 11: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. శుక్రవారం పోలీసుల ముందు సరండర్ కావాలని ప్రభాకర్ రావును జస్టిస్ బి.వి. నాగరత్న సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (సిట్) ముందు హాజరు కావాలని ఆయనకు స్పష్టం చేసింది. ఏసీపీ వెంకటగిరి ముందు హాజరుకావాలని ప్రభాకర్ రావుకు సూచించింది. విచారణ సమయంలో ఆయనను ఎటువంటి టార్చర్ చేయవద్దంటూ సిట్ అధికారులకు సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది.

ఈ కేసు విచారణను వచ్చే శుక్రవారం పర్యవేక్షించనున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కస్టడీ సమయంలో ప్రభాకర్ రావుకు ఇంటి నుంచి భోజనాన్ని తీసుకు వెళ్లేందుకు న్యాయస్థానం అనుమతించింది. మరో వైపు ఈ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును విచారణకు అనుమతించాలని సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు.


ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌‌పై మంగళవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ కేసును గురువారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై గతనెల.. నవంబర్ 18వ తేదీనే వాదనలు జరగాల్సి ఉంది. కానీ ప్రభాకర్ రావు తరఫు న్యాయవాది అందుబాటులో లేరు. దాంతో ఈ పిటిషన్‌పై విచారణ పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరగా ఈ రోజు.. అంటే గురువారం ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది.


ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలను ప్రభాకర్ రావు ధ్వంసం చేశారంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించింది. డిజిటల్ ఎక్విప్‌మెంట్, పాస్ వర్డ్ ఇవ్వకుండా విసిగించడంతోపాటు విచారణకు ఆయన ఏ మాత్రం సహకరించ లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తమ వాదనల ద్వారా వినిపించారు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్, పాస్ వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.


ఇది జరిగింది.. ?

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీల నేతలపైనే కాకుండా.. స్వపక్షంలోని పలువురు అగ్రనేతల నేతలపై ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇదే విషయాన్ని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన కీలక నేతలు సైతం పలుమార్లు వివిధ వేదికల మీద ఆరోపించారు. 2023 ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ పార్టీకి ఓటరు పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం కొలువు తీరింది.


ఫోన్ ట్యాపింగ్ అంశంపై వాస్తవాలు వెలికి తీయాలంటూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్‌లో కీలకంగా వ్యవహరించిన పలువురు ఉన్నతాధికారులను సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. దాంతో ఫోన్ ట్యాపింగ్ జరిగింది వాస్తవమని వారు ధృవీకరించారు. ఈ సందర్భంగా పలువురు ఉన్నతాధికారులను అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. ఆయనను భారత్‌కు రప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు.. సిట్ అధికారులు తనను అరెస్ట్ చేయకుండా ఉండాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రభాకర్ రావును ముందస్తు అరెస్ట్ చేయవద్దంటూ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.


దాంతో స్వదేశానికి వచ్చిన ప్రభాకర్ రావు.. సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కానీ ఈ విచారణలో అధికారులు సంధించిన ప్రశ్నలకు ప్రభాకర్ రావు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆయన ఆశ్రయించారు. ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును రేవంత్ ప్రభుత్వం ఆశ్రయించింది. ఈ కేసులో వాదోపవాదాలు విన్న అత్యున్నత న్యాయస్థానం.. పోలీసుల ఎదుట లొంగిపోవాలంటూ ప్రభాకర్ రావును ఆదేశించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

నరసాపురం వాసులకు గుడ్ న్యూస్.. ‘వందే భారత్‌’ రైలు పొడిగింపు

3 నెలల్లో తుమ్మిడిహెట్టి డీపీఆర్‌

Read Latest Telangana News and National News

Updated Date - Dec 11 , 2025 | 03:17 PM