Share News

Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు

ABN , Publish Date - Feb 28 , 2025 | 03:29 PM

Rajnath Singh: యూపీఐ లావాదేవీలలో భారత్ నేడు అగ్రగామిగా ఉందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. గతేడాది అంటే.. 2024లో భారత్‌లో రూ. 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 2.45 లక్షల కోట్ల రూపాయిలని ఆయన సోదాహరణగా వివరించారు.

Rajnath Singh: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలంటూ విద్యార్థులకు పిలుపు
Defence Minister Rajnath Singh

హైదరాబాద్, ఫిబ్రవరి 28: శాస్త్రవేత్తలను ఆదర్శంగా తీసుకోవాలని యువతకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిలుపు నిచ్చారు. గ్లోబల్ లీడర్ షిప్‌లో యువతదే కీలక పాత్ర అని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ సైన్స్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని విజ్ఞాన్ వైభవ్-2025ను సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చే మార్పుల పట్ల విద్యార్ధులు అవగాహన కలిగి ఉండాలన్నారు.

రక్షణ శాఖ చారిత్రాత్మక విజయాల్లో కేంద్రం విశేష పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా ఈ శాఖకు తాను మంత్రిగా ఉండడం తన అదృష్టంగా భావిస్తున్నాన్నారు. మానవుని మేధ సంపత్తు చాలా గొప్పదని చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రక్షణ శాఖలో మార్పులు చోటు చేసుకుంటున్నాయని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో దేశం కొత్త ఒరవడిని సృష్టిస్తోందని పేర్కొన్నారు. దేశంలో పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతోందన్నారు. అన్ని రంగాల్లో భారత్ అగ్రగామిగా మారుతోందని చెప్పారు.


యూపీఐ (UPI) లావాదేవీలలో భారత్ నేడు అగ్రగామిగా ఉందన్నారు. గతేడాది అంటే.. 2024లో భారత్‌లో మాత్రమే రూ. 171 బిలియన్ల లావాదేవీలు జరిగాయని వివరించారు. ఈ మొత్తం లావాదేవీల విలువ రూ. 2.45 లక్షల కోట్ల రూపాయిలని ఆయన సోదాహరణగా వివరించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటం కంప్యూటింగ్‌లో మనం ముందంజ వేయాల్సి ఉందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్‌వేర్‌కు యుద్ధం పెరుగుతున్నదన్నారు.


ఈ దృక్కోణం నుంచి కూడా.. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకు సాగడం ముఖ్యమని తెలిపారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో ప్రవేశించే ముందు సైన్స్ విద్యార్థిగానే కాకు.. సైన్స్ ప్రొఫెసర్‌గా పని చేసినట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. అంతకు ముందు గచ్చిబౌలి స్టేడియంలో అబ్దుల్ కలాం, సీవీ రామన్ విగ్రహాలకు పూలమాలలు వేసిన కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్‌తోపాటు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.


విజ్ఞాన్ వైభవ్-2025లో భాగంగా డీఆర్డీడీవో ఆధ్వర్యంలో యుద్ధాల్లో వినియోగించే మిస్సైల్స్‌ను గచ్చిబౌలి స్టేడియంలో నేటి నుంచి అంటే.. శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ప్రదర్శించనున్నారు. వీటిని విద్యార్థులతో పాటు సామాన్యులు సైతం వీక్షించే అవకాశాన్ని అధికారులు కల్పించారు.

For National News And Telugu News

Updated Date - Feb 28 , 2025 | 03:29 PM