Dev Ji Missing: పోలీసుల అదుపులోనే దేవ్ జీ... మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
ABN , Publish Date - Nov 28 , 2025 | 10:25 AM
మావోయిస్టు కీలక నేత దేవ్ జీకి సంబంధించి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ సంచలన లేఖ రాసింది. పోలీసుల అదుపులోనే దేవ్ జీ ఉన్నారని ఆరోపించింది.
హైదరాబాద్, నవంబర్ 28: పోలీసుల అదుపులో మావోయిస్టు కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దేవ్ జీ ఉన్నారని మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ ఆరోపిస్తోంది. దేవ్ జీని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ డిమాండ్ చేస్తోంది. అలాగే నవంబర్ 18న జరిగిన మావో కీలక నేత హిడ్మా ఎన్‌కౌంటర్ బూటకమని ఆరోపించింది. అదే సమయంలో దేవ్ జీతో పాటు 50 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని డీకేఎస్‌జెడ్‌సీ తెలిపింది. ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈ నెల 30న ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం బంద్‌కు మావోయిస్టు దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ పిలుపునిచ్చింది.
కాగా.. నవంబర్ 18న హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత దేవ్ జీ ఆచూకీ లభించలేదు. దేవ్ జీ ఎక్కడ ఉన్నాడనే విషయాన్ని ఇటు పోలీసులు కానీ.. అటు మావోయిస్టులు కానీ నిర్ధారించలేదు. ఎట్టకేలకు దేవ్ జీకి సంబంధించి మావోయిస్టు పార్టీ ఓ లేఖను విడుదల చేసింది. పోలీసుల అదుపులో దేవ్ జీ ఉన్నారని.. అతడిని కోర్టులో హాజరుపర్చాలని దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ లేఖలో స్పష్టం చేసింది. నవంబర్ 18న ఏపీ పోలీసులు హిడ్మాను ఎన్‌కౌంటర్ చేశారని.. కానీ పక్కా ప్రణాళికతోనే హిడ్మాను పట్టుకుని ఎన్‌కౌంటర్ చేశారని.. అది బూటకపు ఎన్‌కౌంటర్ అని కమిటీ భావిస్తోంది. దేవ్ జీతో పాటు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. వారందరినీ న్యాయస్థానంలో హాజరుపర్చాలని దండకారణ్య కమిటీ లేఖలో డిమాండ్ చేసింది.
అయితే దేవ్ జీ విషయంలో తెలంగాణ పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు. దేవ్ జీ తమ ఆధీనంలో లేరని తెలంగాణ డీజీపీ స్పష్టం చేశారు. అలాగే ఏపీ పోలీసులు కూడా దేవ్ జీ విషయాన్ని కోర్టుకు తెలియజేశారు. దేవ్ జీ ఆచూకీపై ఆయన బంధువులు కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా దేవ్ జీ తమ ఆధీనంలో లేరని కోర్టుకు పోలీసులు తెలిపారు. దీంతో దేవ్ జీ ఎక్కడ ఉన్నారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ఇవి కూడా చదవండి...
అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
విలీనం తర్వాతే విభజన.. ప్రభుత్వ విభాగాల కసరత్తు
Read Latest Telangana News And Telugu News