Share News

Mahesh Goud: దీక్ష పేరుతో నాటకం.. కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదు: మహేష్ గౌడ్

ABN , Publish Date - Nov 28 , 2025 | 03:03 PM

తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆరోపించారు. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

Mahesh Goud: దీక్ష పేరుతో నాటకం.. కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదు: మహేష్ గౌడ్
Mahesh Goud

హైదరాబాద్, నవంబర్ 28: తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ (KCR) చేసిన దీక్షపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ (TPCC Chief Mahesh Goud) సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ వల్ల తెలంగాణ రాలేదన్నారు. దీక్ష పేరుతో కేసీఆర్ ఎనిమిది రోజులు ఫ్లూయిడ్స్ తీసుకున్నారని.. దీక్ష పేరుతో కేసీఆర్ నాటకం చేశారని ఆరోపించారు. కేసీఆర్ దీక్ష చేసిన సమయంలో డాక్టర్స్ ఇచ్చిన రిపోర్టులను కేటీఆర్‌కు పంపుతామని పీసీసీ చీఫ్ అన్నారు. కేసీఆర్ దీక్షతో తెలంగాణకు వచ్చింది ఏంటి అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో చనిపోయింది ఎస్సీ, ఎస్టీ, బీసీ బిడ్డలని తెలిపారు. కేసీఆర్ దీక్ష విరమిస్తే విద్యార్థులు పోరాటాన్ని కొనసాగించారని అప్పటి సంగతులను గుర్తుచేశారు.


విద్యార్థుల ఆవేదన చూసి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కిరోసిన్ పోసుకున్న హరీష్ రావుకి అగ్గిపెట్టె దొరకలేదా అని ప్రశ్నించారు. ఫ్లూయిడ్స్ తీసుకుని ఐరోమ్ షర్మిల 16 ఏండ్లు దీక్ష చేశారన్నారు. ఉనికి కోల్పోయిన బీఆర్ఎస్ కోట్లాది రూపాయలతో దీక్షా దివాస్ చేస్తోందని విమర్శించారు. తెలంగాణ కోసం దీక్ష చేసినట్లు కేసీఆర్ నాటకం ఆడారని.. ఇప్పుడు దీక్షా దివాస్ పేరుతో మళ్ళీ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దీక్షా దివాస్‌ను పక్కన పెట్టి సోనియా గాంధీకి పాలాభిషేకాలు చేయాలని హితవుపలికారు. తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని కేసీఆర్ భావిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముగిసిన అధ్యాయమని కేసీఆర్‌కు అర్థమైందని.. అందుకే ఆయన బయటకు రావడం లేదంటూ కామెంట్స్ చేశారు.


బీసీ రిజర్వేషన్లపై...

బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మహేష్ గౌడ్ స్పందిస్తూ.. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కోర్టుకు వెళ్తామన్నారు. ఇంద్రా సహానీ, కృష్ణమూర్తి కేసులను ఛాలెంజ్ చేస్తామని చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశం ముగిసిపోలేదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పెంపు కోసం అడ్డు పడుతోంది బీజేపీ అని ఆరోపించారు. ఈ విషయంపై బీసీ నాయకులు.. బీజేపీ, బీఆర్ఎస్ నాయకుల ఇండ్లకు వెళ్ళి ప్రశ్నించాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై మాట్లాడాలని ఎంపీలకు విన్నవించినట్లు తెలిపారు.


తెలంగాణకు రండి..

హిడ్మా, గణపతి ప్రజాసేవ కోసం త్యాగం చేశాని పీసీసీ చీఫ్ అన్నారు. లొంగిపోదామని వచ్చే మావోయిస్టులకు అవకాశం ఇవ్వాలన్నారు. లొంగిపోదాం అనుకునే మావోయిస్టులు తెలంగాణకు రావచ్చని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లు మతం పేరుతో విషం నింపుతున్నారని మండిపడ్డారు. మతాల పేరుతో చిచ్చు పెట్టినన్ని రోజులు ఇండియా ముందుకు పోదని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

టాప్‌-10లో హైదరాబాదీ బిర్యానీ

అంబర్‌పేట్ ఎస్‌ఐ గన్‌ మిస్సింగ్ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 03:10 PM