Share News

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదా..? కేటీఆర్ సంచలన కామెంట్స్..

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:03 PM

కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోండి.. కానీ ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కేటీఆర్ కోరారు. కత్తి వాళ్లకు ఇచ్చి.. యుద్ధం తమను చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.

KTR Slams Congress: కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదా..? కేటీఆర్ సంచలన కామెంట్స్..
KTR Slams Congress

హైదరాబాద్, అక్టోబర్ 29: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూకుడు పెంచింది. కులసంఘాలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR).. తాజాగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తే ఏమైనా జరగొచ్చని.. మూడేళ్ళ వరకు ఎదురుచూడాల్సిన అవసరం ఉండదని తెలిపారు. కాంగ్రెస్ పైసలు ఇస్తే తీసుకోవాలని.. కానీ ఓటు మాత్రం బీఆర్‌ఎస్‌కు వేయాలని కోరారు. కత్తి వాళ్లకు ఇచ్చి.. యుద్ధం తమను చేయమంటే ఎలా అని ప్రశ్నించారు. కత్తి తమకు ఇవ్వాలని... కాంగ్రెస్‌తో యుద్ధం చేసే బాధ్యత తమది అని స్పష్టం చేశారు.


ఎస్సీలు, ఎస్టీలు, ముస్లింలు, మహిళలు, వృద్ధులు అందరూ బాధపడుతున్నారని కేటీఆర్ అన్నారు. కోటి మందిని కోటీశ్వరులను చేయడం ఏంటో కానీ.. మహిళలకు ఇస్తామన్నవి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భర్త చనిపోతే భార్యకు బాధ ఉండదా..? మాగంటి సునీతపై కామెంట్‌ చేయడానికి మంత్రులకు సిగ్గు ఉండాలంటూ ఫైర్ అయ్యారు. వాళ్ల కుటుంబంలో ఎవరైనా చనిపోతే కాంగ్రెస్‌ నేతలకు బాధ కలగదా అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ అభ్యర్థి సోదరుడికే మూడు ఓట్లు ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేశారు.


ప్రజలు ఎలాగూ ఓటేయరని తెలిసి.. దొంగ ఓట్లతో గెలవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే.. వారి ఓటు కూడా ఎవరో ఒకరు వేసేస్తారని తెలిపారు. అది జరగకుండా.. ప్రజలు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని వినతి చేశారు. మున్నూరు కాపులను కేసీఆర్‌ ఎలా చూసుకున్నారో అందరికీ తెలుసన్నారు. మున్నూరు కాపులకు సముచిత గౌరవం, సముచిత ప్రాధాన్యం ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పుకొచ్చారు. రైతులకు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని మంచి పనులు కేసీఆర్‌ చేశారని వెల్లడించారు.


కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కూడా సరిగా ఉండట్లేదని విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్‌ స్కీం కూడా ఎత్తేస్తారని.. ఒక ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌ రెడ్డే ఈ విషయాన్ని బయటపెట్టారని తెలిపారు. ఒక్క కొత్త రోడ్డు లేదని.. కొత్త బ్రిడ్జ్‌ లేదని.. కొత్త బిల్డింగ్‌ కట్టలేదని విమర్శించారు. కానీ.. కేసీఆర్‌ కట్టిన బిల్డింగ్‌లను మాత్రం ఓపెన్‌ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అంటూ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ చేస్తేనే జరుగుతుందని బీఆర్‌ఎస్ ముందే చెప్పిందన్నారు. రేవంత్ .. తన చేతిలో లేని ముచ్చట చెప్తూ.. ఇవ్వాల్సిన వాటి గురించి మాట్లాడరంటూ ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో బిల్లు పెడితే బీఆర్‌ఎస్ కూడా మద్దతు ఇస్తుందని చెప్పామని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


కాగా.. తెలంగాణభవన్‌లో జరిగిన మున్నూరుకాపు ఆత్మీయ సమ్మేళనంలో పొన్నాల లక్ష్మయ్య, వద్దిరాజు రవిచంద్ర, గంగుల కమలాకర్, దాస్యం వినయ్ భాస్కర్, శంబీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి...

జూబ్లీహిల్స్‌లో కేటీఆర్ ప్రచారం.. షెడ్యూల్ ఫిక్స్

ఏపీ, తెలంగాణకు ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు... ఐఎండీ హెచ్చరిక

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 03:41 PM