KTR Slams Govt: ఆ బాధ్యత ప్రభుత్వానిదే.. కల్తీ కల్లు ఘటనపై కేటీఆర్
ABN , Publish Date - Jul 10 , 2025 | 04:20 PM
KTR Slams Govt: కుటుంబం కోసం కాయాకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని కేటీఆర్ అన్నారు. ఇంత మంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు.
హైదరాబాద్, జులై 10: నగరంలో కల్తీ కల్లు తాగి ఆరుగురు మరణించడంపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Former Minister KTR) స్పందించారు. హైదరాబాద్‌లో కల్తీ కల్లు బారిన పడి ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం (Telangana Govt) అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు. ఒక్కొక్క కుటుంబానికి 20 లక్షల రూపాయల నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉండి మెరుగైన చికిత్స అందించాలని కోరుతున్నట్లు మాజీ మంత్రి తెలిపారు.
కుటుంబం కోసం కాయాకష్టం చేసే కష్టజీవులు కల్తీ కల్లు బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు. ఇంత మంది చనిపోతే ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చాలా దారుణమని మండిపడ్డారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి కేటీఆర్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్టు చేశారు.
కాగా... కల్తీ కల్లు ఘటనలో తాజాగా మరొకరు మరణించారు. కల్తీ కల్లు భాధితురాలు నర్సమ్మ (54) ఈఎస్ఐ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతిచెందినట్లు వైద్యుల తెలిపారు. మృతురాలు సాయిచందు కాలనీ వాసి. నర్సమ్మ మృతితో కల్తీ కల్లు మృతుల సంఖ్య ఆరుకు చేరింది.
ఇవి కూడా చదవండి
మల్నాడు కిచెన్ డ్రగ్స్ కేసు.. విచారణలో విస్తుపోయే నిజాలు
హెచ్‌సీఏ, ఎస్‌ఆర్‌హెచ్ వివాదం.. వెలుగులోకి కీలక విషయాలు
Read Latest Telangana News And Telugu News