Share News

Konda Surekha: కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

ABN , Publish Date - Dec 11 , 2025 | 06:16 PM

దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది.

Konda Surekha: కొండా సురేఖకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు గురువారం నాన్ బెయిల‌బుల్ వారెంట్ జారీ చేసింది. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో మంత్రి కొండా సురేఖపై ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అనంతరం ఈ కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5వ తేదీకి నాంపల్లి ప్రత్యేక కోర్టు వాయిదా వేసింది.

ఈ కేసులో సుదీర్ఘ విచారణ జరిగింది. ఈ విచారణ సమయంలో మంత్రి కొండా సురేఖ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేదు. దీనిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు తదుపరి విచారణ ఫిబ్రవరి 5వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని కొండా సురేఖను కోర్టు ఆదేశించింది.


ఇంతకీ వివాదం ఏమిటంటే..?

గతంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విమర్శలు చేసే క్రమంలో.. నాగచైతన్య, సమంత విడాకులపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఇవి వివాదాస్పదమైనాయి. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. తన పరువుకు నష్టం కలిగించేలా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.


గతంలో తాను మంత్రిగా పని చేశానని.. పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడి ఉన్నానని ఆయన కోర్టుకు తెలిపారు. ఈ కేసు విచారణలో భాగంగా సాక్షులుగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు బాల్కా సుమన్, సత్యవతి రాథోడ్, తుల ఉమ, దాసోజ్ శ్రవణ్ స్టేట్‌మెంట్లను సైతం కోర్టు రికార్డు చేసింది. కోర్టులో ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది.


ఇక మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను హీరో అక్కినేని నాగార్జున తప్పు పట్టారు. కొండా సురేఖపై పరువు నష్టం దావా వేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్స్, సోషల్ మీడియా లింక్స్‌తో కలిపి నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ పరువు ప్రతిష్టకు భంగం కలిగించేలా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారని.. చట్టపరమైన క్రిమినల్ చర్యలతోపాటు పరువునష్టానికి సంబంధించి బీఎస్ఎస్ 356 కిద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. అయితే ఇటీవల మంత్రి కొండా సురేఖ.. హీరో నాగార్జునకు క్షమాపణలు చెప్పారు. దాంతో ఈ కేసును హీరో నాగార్జున ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే.

ఈ వార్త కూడా చదవండి..

వారణాసి వెళ్తున్నారా.. గుడ్ న్యూస్

అఖండ - 2 మేకర్స్‌కి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టులో కేసు..

Read Latest TG News and National News

Updated Date - Dec 11 , 2025 | 06:53 PM