Kishan Reddy: వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ సమస్యకు పరిష్కారం..త్వరలోనే
ABN , Publish Date - Jul 18 , 2025 | 02:07 PM
Kishan Reddy: హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. పాలకులు మాత్రం హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, జులై 18: ఆ నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాం నుంచి వరంగల్‌లో కోచ్ ఫ్యాక్టరీ కావాలని అనేక పోరాటాలు జరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Union Minister Kishan Reddy) గుర్తుచేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. కోచ్ ఫ్యాక్టరీ సమస్య పరిష్కారం కాబోతుందని తెలిపారు. రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ (ఆర్యంయూ)కి ప్రధాని మోదీ (PM Modi) భూమి పూజ చేశారని.. రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 60 శాతం పనులు పూర్తి అయ్యాయని అన్నారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రేపు (శనివారం) రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనుల పురోగతిని పరిశీలిస్తారని చెప్పారు. రైలు ఇంజన్, కోచ్, వ్యాగన్స్ ఉత్పత్తి అయ్యేలా ప్లాన్ చేస్తున్నామని.. ముందుగా రైలు ఇంజన్ తయారీ చేయాలని నిర్ణయించామని కేంద్రమంత్రి అన్నారు.
వరంగల్‌లో ఆదునిక కోచ్‌లు..
రాదు అనుకున్న పరిశ్రమను మోదీ తెలంగాణకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. వరంగల్‌కు మెగా టెక్స్ టైల్ పార్క్ తీసుకురావడం జరిగిందన్నారు. హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పాలకులు మాత్రం హైదరాబాద్ చుట్టే ఆలోచన చేస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. వరంగల్ విమానాశ్రయానికి భూమి సేకరించి ఇవ్వాలని కేసీఆర్‌కు అనేక లేఖలు రాసినట్లు తెలిపారు. కేసీఆర్ రాళ్లు వేయడం, విమర్శించడం తప్ప.. భూమి సేకరించి ఇవ్వలేదని విమర్శించారు. రైలు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చే ఏడాది ఉత్పత్తి ప్రారంభించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రెండు వందల కోట్లతో ప్రారంభమైందని.. మరో రెండు వందల కోట్ల వరకు బడ్జెట్ పెరిగే అవకాశం ఉందన్నారు. వరంగల్‌లో ఆధునికమైన కోచ్‌లు తయారు చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. సుమారు మూడు వేల మందికి ఉపాధి అవకాశం దొరుకుతుందన్నారు. ఇక్కడ నివసించే రాజస్థాన్ ప్రజలు రైలు కావాలని కోరుతున్నారని.. రేపు రాజస్థాన్‌కు ట్రైన్ ప్రారంభిస్తున్నామన్నారు. ఎంఎంటీఎస్ రెండో పేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని.. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందానికి కట్టుబడి లేదని అన్నారు.
యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్‌ను విస్తరిస్తున్నామని పేర్కొన్నారు. కొమురవెల్లి రైల్వే స్టేషన్ జనవరిలో భక్తులకు అంకితం చేస్తామని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా వచ్చే సంవత్సరం ప్రజలకు అంకితం చేస్తామని ప్రకటించారు. కాచిగూడ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు కూడా ప్రారంభిస్తామన్నారు. తెలంగాణకు మోదీ ఏమి చేశారన్న వాళ్లు వినాలి.. కళ్ళతో చూడాలన్నారు. ప్రధాని శంకుస్థాపనకు వస్తే రాకుండా ఆ నాటి ముఖ్యమంత్రి ఫాం హౌస్‌లో పడుకున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని రైల్వే స్టేషన్లలో ఉచిత వైఫై సదుపాయం కల్పిస్తున్నామన్నారు..
జడ్జ్‌మెంట్ కోసం పిలవలేదు
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటే జోక్యం చేసుకుంది అంటున్నారని.. జోక్యం చేసుకోకపోతే.. ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారని కేంద్రమంత్రి అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను కూర్చోపెట్టాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. జడ్జ్‌మెంట్ ఇవ్వడానికి ఇద్దరు ముఖ్యమంత్రులను పిలవలేదని స్పష్టం చేశారు. బనకచర్ల సమస్య పరిష్కారం కోసం పిలిచామన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక పాలసీ.. అధికారంలో లేనప్పుడు మరొక్క పాలసీ అవలంభిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక పాత్రలు పోషించారంటూ ఎద్దేవా చేశారు. కేంద్రానికి జోక్యం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసిందని.. ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశాన్ని బీఆర్ఎస్ తప్పు పట్టడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఒక రాష్ట్రానికి అనుకూలంగా.. మరొక రాష్ట్రానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వరన్నారు. కృష్ణా, గోదావరి జలాలపైన ఇద్దరు ముఖ్యమంత్రులు వేరు వేరు ఎజెండాలతో వచ్చారని చెప్పారు. గోదావరి జలాల వినియోగంపైన రేవంత్ రెడ్డి ఏదైనా కార్యాచరణ రూపొందించారా అని ప్రశ్నించారు. కేంద్రాన్ని, మోదీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలనేదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యమని స్పష్టం చేశారు. యూరీయా కొరత లేకుండా చూసే బాధ్యత కేంద్రానిదన్నారు. బ్రిటీష్ కాలంలో ఉన్న రిజర్వేషన్లను ముస్లిం రిజర్వేషన్లు ఎట్లా అవుతాయని అడిగారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ ముస్లింల పేరు మీద పది శాతం రిజర్వేషన్ ఇచ్చిందన్నారు. పది శాతం పోతే బీసీలకు దక్కేది 32 శాతం మాత్రమే అని అన్నారు. దీనివల్ల బీసీలకు మేలు జరుగుతుందా.. అన్యాయం జరుగుతుందా ఆలోచించాలన్నారు. మతపరమైన రిజర్వేషన్లు పక్కన పెట్టి బీసీలకే ఇవ్వాలనదే బీజేపీ విధానమని స్పష్టం చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు
ఇవి కూడా చదవండి..
బావ బామ్మర్దులది పనికిమాలిన ఏడుపు.. కేటీఆర్, హరీష్‌పై జగ్గారెడ్డి ఫైర్
తెలంగాణకు రేవంత్ అన్యాయం చేయలేదు: నారాయణ
Read latest Telangana News And Telugu News