Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసు.. ప్రభుత్వం ఆలోచన ఇదీ
ABN , Publish Date - Jan 24 , 2025 | 10:36 AM
Kidney Racket: అలకనంద కిడ్నీ రాకెట్ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు. ఈకేసులో సీఐడీకి అప్పగించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు.
హైదరాబాద్, జనవరి 24: అలకనంద కిడ్నీ రాకెట్ (Alakananda Kidney Racket Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల సమావేశంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ (Minister Damodara Rajanarsimha) చర్చించారు. కిడ్నీ రాకెట్ వెనుక ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది బ్రోకర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందిన వారుగా, గ్రహితీలు బెంగళూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఆరు నెలలుగా అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్‌కు రూ.50 లక్షలు వసూలు చేస్తున్నట్లు పోలీసులు విచారణలో వెల్లడైంది.
కిడ్నీ రాకెట్ కేసులో పోలీసుల విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ కేసును వైద్య ఆరోగ్య శాఖ సీరియస్‌గా తీసుకుంది. ఎనిమిది మంది బ్రోకర్లను అరెస్ట్ చేసిన పోలీసులు వారంతా హైదరాబాద్, బెంగళూరు, తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. ఈ కేసులో ఒక్కోరోజు ఒక్కో విషయం వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో.. దీనిని సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. నిన్న (గురువారం) వైద్య ఆరోగ్య శాఖ సమీక్ష జరిపిన సమయంలో మంత్రి దామోదర రాజనర్సింహ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హైదరాబాద్ కేంద్రంగా నడిచిన ఈ వ్యవహారం పూర్తిస్థాయిలో వెలుగులోకి రావాలంటే సీఐడీకి బదిలీ చేయడమే బెటర్ అని పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి. ఈ కిడ్నీ రాకెట్ వెనుక బెంగళూరుకు చెందిన ఓ డాక్టర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు.
ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న రాచకొండ పోలీసులు.. వారిని ఈరోజు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అలకనంద యజమాని సుమంత్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ సుమంత్ తరపు న్యాయవాదులు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. సుమంత్ కనిపించడం లేదని.. వెంటనే మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చాలని హెబియస్‌కార్పస్ పిటిషన్ వేశారు. సుమంత్‌పై పోలీసులు విచక్షణారహితంగా దాడులు చేస్తున్నారని ఈ పిటిషన్‌లో అతని తరపు న్యాయవాదలు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుమంత్‌ను న్యాయస్థానం ముందు హాజరుపర్చాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇంకా పరారీలో ఉన్న నిందితుల కోసం చెన్నై, బెంగళూరులో పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ కేసును సీఐడీకి బదిలీ చేయాలా, లేక పోలీసులే విచారణ జరపాలా అనేదానిపై ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
నాలా ద్వారా ఇంట్లోకి దూసుకొస్తున్న కొండచిలువ..
CM Revanth Reddy: దావోస్ టూర్ సక్సెస్.. స్వరాష్ట్రానికి సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News