Share News

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?

ABN , Publish Date - Dec 14 , 2025 | 03:37 PM

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ సమావేశం కానుంది. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది.

KCR: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ భేటీ.. ఎప్పుడంటే..?
BRS Chief KCR

హైదరాబాద్, డిసెంబర్ 14: రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమవుతోంది. బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్‌పీ సమావేశం కానుంది. డిసెంబర్ 19వ తేదీన హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కృష్ణా, గోదావరి జలాలతోపాటు సాగునీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అంతేకాకుండా.. తదుపరి నిర్మించబోయే తెలంగాణ ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించనుంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీలు కేటాయిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రం ముందు దేబరించడం బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయపడుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలకు అంగీకరిస్తూ కేంద్రం వద్ద మోకరడం రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని బీఆర్ఎస్ భావిస్తోంది.


రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరన్నట్లుగా ఉందని బీఆర్ఎస్ చెబుతోంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు - రంగారెడ్డి నల్లగొండ ప్రజల రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో, తెలంగాణ నుంచి ఎనిమిది మంది బిజెపి ఎంపీలు ఉండి కూడా ఒక్కరూ మాట్లాడడం లేదని వ్యాఖ్యానిస్తోంది. ఇంకా చెప్పాలంటే... బీజేపీ.. తెలంగాణ ప్రయోజనాలను గండి కొడుతున్నట్లుగా ఉందని స్పష్టమవుతున్నదని బీఆర్ఎస్ చెబుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి విషయంలో కాదు.. కావేరి తదితర నదుల అనుసంధానం పేరుతో ఆంధ్ర రాష్ట్ర జల దోపిడికి సహకరిస్తున్న బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే.. తెలంగాణ సమాజం మరో సారి ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.


2023 ఏడాది జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో రాసి అధికారంలోకి వచ్చి ఉంటే.. ఈ పాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు నుంచి నీళ్లు అందడం ద్వారా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల ప్రజల ప్రయోజనాలు కాపాడబడేవని బీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. కానీ ప్రస్తుతం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం .. ఈ మూడు జిల్లాల ప్రయోజనాల పట్ల పూర్తి నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించడం వల్ల పూచిక పొల్లంత పని కూడా చేయలేక పోవడం వల్ల ఆ ప్రాంతం ప్రజలు, రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని బీఆర్ఎస్ అగ్రనాయకత్వం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ప్రభుత్వం కొలువుదీరి రెండేళ్లు గడిచినా కూడా, తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను నిర్లక్ష్యం చేస్తుండడంపై ఇంకా తెలంగాణ సమాజం మౌనం వహించ జాలకూడదని ఆ పార్టీ అభిప్రాయపడుతుంది.


పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు, కృష్ణా జలాలలో కేవలం 45 టీఎంసీలు ఒప్పుకోవడం అనేది ఘోరమని అభివర్ణించింది. కాబట్టి సాగునీరు తెలంగాణ రైతాంగ ప్రయోజనాలను కాపాడే విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎన్నటికీ రాజీ పడబోదని ఆ పార్టీ స్పష్టం చేసింది. కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఈ కీలక అంశాలపై కూలంకుషంగా చర్చ జరగనుంది. అలాగే అందుకు అనుగుణంగా చేపట్ట బోయే ప్రజా ఉద్యమాల నిర్మాణం, అనుసరించాల్సిన కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, గోదావరి కృష్ణా జలాల విషయంతోపాటు ఆంధ్ర జల దోపిడిపై పోరాడేందుకు.. ఒక ఉద్యమ స్వరూపానికి ఈ సమావేశంలో శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది.


మరోవైపు ఏపీ ప్రభుత్వం పోలవరం- బనకచర్ల ప్రాజెక్ట్ చేపట్టేందుకు ప్రయత్నించగా.. ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకు వెళ్లింది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం పక్కన పెట్టింది. తాజాగా పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్ట్‌ను ఏపీ ప్రభుత్వం తెర మీదకు తీసుకు వచ్చింది. దీనిపై సైతం కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి తీసుకెళ్లారు.


పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్ పేరు మార్చి నల్లమల సాగర్‌ ప్రాజెక్ట్‌గా ఏపీ ప్రభుత్వం తన వంతు ప్రయత్నాలు చేపట్టిందంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖకు రాసిన లేఖ సైతం వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతుల నీటి హక్కులపై పోరు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం భావిస్తోంది. అదీకాక రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం జరిగినా.. ఇంకా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలు నేటికి అలాగే ఉన్నాయి. వాటిని పరిష్కరించుకోవడం లేదు. వీటిని పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వం నూతనంగా చేపడుతున్న ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాల్సి వస్తోంది. అదీకాక.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం రైతుల నీటి హక్కులపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందంటూ గత కొంత కాలంగా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులు ఆరోపణలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

రౌడీ షీటర్ దారుణ హత్య..

అంబటి రాంబాబు అలా మాట్లాడొద్దు.. పెమ్మసాని ఫైర్

For More TG News And Telugu News

Updated Date - Dec 14 , 2025 | 04:05 PM