Kavitha Vs Etela: ఈటల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు దారుణం: కవిత
ABN , Publish Date - Oct 01 , 2025 | 03:10 PM
ఈటల ఫైటర్ అయి ఉండి.. గౌరవం తగ్గించుకునే విధంగా మాట్లాడారని కవిత విమర్శించారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ ఈటల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమన్నారు.
హైదరాబాద్, అక్టోబర్ 1: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్(MP Etela Rajender)పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kalvakuntla Kavitha) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బుధవారం నాడు మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు ఎంపీ ఈటల క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుకు వెళ్తానని ఈటల రాజేందర్ అనటం తప్పన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ చిత్తశుద్ధికి ఈటల వ్యాఖ్యలు నిదర్శనమన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం అవసరమైతే సొంత పార్టీ బీజేపీతో ఈటల కొట్లాడాలని అన్నారు. ఈటల ఫైటర్ అయి ఉండి.. గౌరవం తగ్గించుకునే విధంగా మాట్లాడారని విమర్శించారు. ఉద్యమకారుడు, బీసీ బిడ్డ ఈటల నుంచి ఇలాంటి వ్యాఖ్యలు దారుణమన్నారు. బీసీ రిజర్వేషన్లను బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు స్వాగతిస్తారని.. కానీ ఈటల మాత్రం ఎన్నికల తర్వాత కోర్టుకు వెళ్తానంటున్నారని మండిపడ్డారు.
బీసీ రిజర్వేషన్లపై కోర్టుకు వెళ్లిన వారు సీఎం రేవంత్ రెడ్డికి దగ్గర వ్యక్తులంటూ వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజకీయంగా అవకాశం వస్తుంటే కోర్టుకు పోతామని ఈటల ఎలా అంటారని ప్రశ్నించారు. గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉన్న ఆర్డినెన్స్‌ను బీజేపీ పాస్ చేపించాలని డిమాండ్ చేశారు కవిత. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీకి చెందిన 8 మంది ఎంపీలు మోదీని కలవాలన్నారు. రాష్ట్రపతి దగ్గర పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లును పాస్ చేయించాలని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కులగణన తప్పుల తడక అని విమర్శలు గుప్పించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లేని గ్రామాలను ఆయా వర్గాలకు రిజర్వ్ చేశారన్నారు. రిజర్వేషన్ల ఖరారులో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ చేశామంటున్న రేవంత్.. రిజర్వేషన్ల కేటాయింపులో వర్గీకరణ పాటించలేదని ఫైర్ అయ్యారు. ఎస్సీల్లో మాదిగలకు ఎన్ని సీట్లు కేటాయించారో ఎందుకు చెప్పలేదని నిలదీశారు. గ్రామ పంచాయతీల వారీగా కులగణనను బయట పెట్టాలని జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు.
మాకు అదే ముఖ్యం..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు కవిత. ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచినా పెద్ద తేడా ఏమీ ఉండదని తెలిపారు. జాగృతి టార్గెట్ బీసీ రిజర్వేషన్లు సాధించటమే అని.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాదని స్పష్టం చేశారు. 8వ తేదీన కోర్టు తీర్పును బట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై తమ స్టాండ్ చెప్తామన్నారు. పోటీ చేసే అంశంపై తమ నాయకులతో చర్చించి నిర్ణయిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం మంచిదే అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ సీరియస్‌గా ఫైట్ చేయాలని కవిత సూచించారు.
ఇవి కూడా చదవండి...
ఏపీలో సుస్థిర పట్టణాభివృద్ధికి సిటీ నెట్ సహకారం
రెచ్చిపోయిన కానిస్టేబుల్ ఫ్యామిలీ.. భవానీ భక్తుడిపై దారుణం
Read Latest Telangana News And Telugu News