Kalvakuntla kavitha slams congress: జాగృతిలో చేరడమంటే.. బతుకమ్మ ఆడినట్లు ఉంటుంది
ABN , Publish Date - Oct 10 , 2025 | 07:39 PM
రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలు ఇవ్వడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాటం చేయాలని తెలంగాణ జాగృతిలో చేరిన వారికి ఆమె పిలుపు నిచ్చారు.
హైదరాబాద్, అక్టోబర్ 10: జాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్లు ఉంటుందని.. అదే విధంగా పిడికిలెత్తి పోరాటం చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం నాడు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కార్యాలయంలో పలువురు తెలంగాణ జాగృతిలో చేరారు. ఈ సందర్భంగా వారికి కండువా కప్పి తమ సంస్థలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇస్తామని మోసం చేసిందని.. అందుకోసం కొట్లాడాలంటూ సంస్థలోని సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు. ప్రసవం కోసం ఆస్పత్రులకు వెళ్లిన మహిళలకు గతంలో కేసీఆర్ కిట్ వచ్చేదని గుర్తు చేశారు.
కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అదీ ఆగిపోయిందంటూ రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు కవిత. ఆడబిడ్డలకు కిట్ల సాధన కోసం ప్రభుత్వంపై కొట్లాడాలని సూచించారు. పేదింటి బిడ్డ పెళ్లికి ఇస్తానన్న తులం బంగారం కోసం కొట్లాడుదామన్నారు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలంటూ గద్దెనెక్కి కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. ముఖ్యంగా బీసీ బిల్లు తెస్తామని.. తీసుకు రాలేనందుకు జాగృతి ఆధ్వర్యంలో కొట్లాడదామని పేర్కొన్నారు. జాగృతి అంటేనే పోరాటాల జెండా.. జాగృతి అంటేనే విప్లవాల జెండా అంటూ ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. ప్రజా సమస్యల పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని కవిత స్పష్టం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో.. బీజేపీ అభ్యర్థి బీఆర్ఎస్సే
For More Telangana News And Telugu News